ETV Bharat / state

గడువు ముగిసినా నివాసయోగ్యపత్రం - కానీ షరతులు వర్తిస్తాయి

షరతులతో అవకాశం కల్పించిన జీహెచ్‌ఎంసీ - నివాసయోగ్యపత్రం(ఓసీ) పొందలేకపోయిన భవనాలపై కీలక నిర్ణయం - నిబంధనలను పాటించి ఇంటి నిర్మాణం చేపడితే ఆలస్యమైనా సరే ఓసీ జారీ చేయనున్న బల్దీయా

Hyderabad Municipal Corporation
Hyderabad Municipal Corporation (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 9, 2026 at 2:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

Occupancy Certificate For Buildings in Greater Hyderabad Municipal Corporation : నిర్ణీత గడువులోపు నివాసయోగ్యపత్రం(ఓసీ) పొందలేకపోయిన భవనాలకు ఉపశమనం కల్పించడానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ.కర్ణన్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలను పాటించి ఇంటి నిర్మాణం చేపడితే ఆలస్యమైనా సరే ఓసీ జారీ చేయనున్నట్లు ఆయన వివరించారు. అందులో భాగంగా ఆక్యూపెన్సీ సర్టిఫికెేట్ల దరఖాస్తులను రెండు రకాలుగా విభజించి వాటికి సంబంధించి పలు మార్గదర్శకాలను గురువారం జారీ చేశారు. రెండు కేటగిరీల్లోనూ భవన నిర్మాణంలో ఉల్లంఘనలు గరిష్ఠంగా 10 శాతం మాత్రమే ఉండాలని, 18 మీటర్ల ఎత్తు వరకు అనుమతి తీసుకున్న భవనాలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తించనుందని కర్ణన్ స్పష్టం చేశారు.

మార్గదర్శకాలు ఇలా : భవన నిర్మాణ అనుమతి గడువు ముగిసిన తేదీ నుంచి రెండేళ్ల లోపు ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే పెండింగులోని నిర్మాణ అనుమతి రుసుము, లింకు రోడ్డు ఛార్జీలు, సీఆర్‌ఎంపీ ఫీజు, ఇతరత్రా అన్నీ రకాల రుసుములతో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. నిర్మాణ అనుమతి గడువు ముగిసిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత దరఖాస్తు చేసుకున్నట్లయితే దరఖాస్తు తేదీ నాటికి మొత్తం నిర్మిత విస్తీర్ణానికి వర్తించే అన్ని రకాల రుసుములు, ఛార్జీలు వసూలు చేస్తారు.

నివాసయోగ్య పత్రం అంటే? ఇది భవనం సురక్షితమైనేదేనని, మున్సిపల్ కార్పోరేషన్​ నిబంధనలను పాటించి నిర్మించిందని తెలిజేసే పత్రం. దీనిని తాగునీరు, విద్యుత్ కనెక్షన్లు పొందడానికి, మనకున్న ప్రాపర్టీని విక్రయించడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి ఇది తప్పనిసరిగా పరిగణలోనికి తీసుకుంటారు.

దరఖాస్తు విధానం : జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్ పోర్టల్ లేదా మీసేవా కేంద్రం ద్వారా ఓసీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నిర్మాణ వ్యర్థాల నిర్వాహణకు సంబంధించి నిబంధనలు పాటించాలి. దీనికోసం భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి పత్రాలు, ఆస్తి పన్ను చెల్లింపు రశీదు, నీటి, విద్యుత్ బిల్లులు, యజమాని గుర్తింపు కార్డులు అవసరమవుతాయి. దీని అధికార పరిధి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించిన మేరకు ఉంటుంది. నివాసయోగ్యపత్రం కోసం దరఖాస్తు చేసిన తర్వాత, అధికారులు భవనాన్ని పరిశీలించి ఓసీని జారీ చేస్తారు. అక్రమ నిర్మాణాలు నివాసయోగ్య పత్రం లేని భవనాలను సీల్ చేసే అధికారం జీహెచ్​ఎంసీ కమిషనర్‌కు ఉంటుంది.

మూడు కార్పోరేషన్​లుగా జీహెచ్​ఎంసీ : ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టీసీయూఆర్‌ (తెలంగాణ అర్బన్‌ కోర్‌ రీజియన్‌)గా అభివర్ణిస్తూ జీహెచ్​ఎంసీలో విలీనం చేసింది. రాజధాని హైదరాబాద్​లో పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్నందున అన్ని ప్రాంతాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసీ నదికి దక్షిణాన ఉన్న నాలుగు జోన్ల వరకు జీహెచ్‌ఎంసీని పరిమితం చేసి, ఉత్తరం వైపున భాగాన్ని మరో రెండు మహానగరపాలక సంస్థలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సైబరాబాద్, సికింద్రాబాద్‌ పేర్లతో ఆయా నగరపాలక సంస్థలను ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి అధికారులతో చర్చించినట్లు తెలిసింది.

జీహెచ్​ఎంసీ పాలకమండలి గడువు వచ్చే నెవ ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. 300 డివిజన్లను మూడు భాగాలుగా చేసి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు ఉంటాయనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. జులై నాటికి నిర్వహించకపోతే 2027 వరకు జరిగే అవకాశం ఉండదని సంబంధిత అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనగణన పూర్తవుతుందని, కొత్త జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టిన అనంతరం ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటుని చెబుతున్నారు.

ఫొటో దిగి యాప్​లో అప్​లోడ్​ చేయడమే మన పని - చెత్త సంగతి మనకెందుకులే!

భాగ్యనగరంలో మూడు కార్పొరేషన్లుగా పాలన స్టార్ట్​ - బాధ్యతలపై కమిషనర్లకు పూర్తి స్పష్టత