ETV Bharat / state

ఆ భూమిలోని నిర్మాణాలను పునరుద్ధరించండి : హైడ్రాకు హైకోర్టు ఆదేశం

హైడ్రా పై ఆగ్రహించిన హైకోర్టు - కూకట్‌పల్లిలోని ఎన్వీఎన్ కన్‌స్ట్రక్షన్‌కు ఊరట - సెక్యూరిటీ రూమ్, ఫెన్సింగ్, ప్రవేశద్వారం తిరిగి నిర్మించాలని ఆదేశం - 24 గంటల్లో చర్యలు చేపట్టాలన్న హైకోర్టు

High Court on HYRDA
High Court on HYRDA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2026 at 9:31 PM IST

|

Updated : May 31, 2026 at 8:51 AM IST

2 Min Read
Choose ETV Bharat

High Court on HYRDA : హైదరాబాద్​ కూకట్​పల్లి పరిధిలో ఉన్న ఎన్వీఎన్ కన్​స్ట్రక్షన్​కు చెందిన స్థలంలో హైడ్రా చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే స్థలానికి సంబంధించి వివిధ ఉత్తర్వులున్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా రాత్రికి రాత్రి కూల్చివేతలు చేపట్టడాన్ని తప్పుబట్టింది. హైడ్రాకు ఇలాంటి చర్యలు కొత్త కాదని, కూల్చివేయడం, ఆ తర్వాత కంచె వేసి బోర్డు పెట్టడం, చర్యను సమర్థించుకోవడం, కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం హైడ్రాకు మాములైపోయిందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పిటిషనర్లు సమర్పించిన ఫొటోలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తే హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందని, నిబంధనలకు వ్యతిరేకంగా హైడ్రా ప్రయోజనాలు పొందాలనుకుంటే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అధికారం కోర్టుకు ఉందని పేర్కొంది.

కూకట్​పల్లిలోని సర్వే నెంబర్ 1003 నుంచి 1006 వరకు ఉన్న 13.17 ఎకరాల భూమిలో ఈ నెల 25కు ముందు ఎలా ఉందో అలా పునరుద్ధరించాలంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్​ను హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూమిలోకి వచ్చి ఫెన్సింగ్ కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్వీఎన్ కన్​స్ట్రక్షన్​ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. సెక్యూరిటీ గదులు, ప్రవేశ ద్వారాలను కూల్చివేయడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిపేశారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇదే భూమి విషయంలో గతంలో హైకోర్టులో నమోదైన పిటిషన్ల విచారణలో భాగంగా కుంట, శిఖం భూమి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖాధికారులు అఫిడవిట్ దాఖలు చేశారని వాదించారు. 2008లోనే రూ.9 కోట్లకు పైగా చెల్లించడంతో అప్పటి ప్రభుత్వం భూమిని తమకు కేటాయిస్తూ జీవో విడుదల చేసిందన్నారు.

హైడ్రా మాత్రం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేతలు చేపట్టిందని వాదించారు. ఖానామెట్ పరిధిలోకి ఉన్న భూమిని తప్పుడు సర్వే నెంబర్లతో ఆక్రమించుకున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు 24 గంటల్లోపు భూమిని యథావిధిగా ఉంచి, హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులు తొలగించాలని ఆదేశించింది. ఒకవేళ హైడ్రా చేయకపోతే పిటిషనరే పనులు చేయించుకొని ఆ డబ్బులను హైడ్రా అధికారుల సొంత ఖాతా నుంచి తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.

హైడ్రా భారీ ఆపరేషన్ - ఒకేరోజు 6 ప్రాంతాల్లో దాడులు - 6 క్రషింగ్‌ యూనిట్లు, 12 ఆర్​ఎంసీ ప్లాంట్లు నేలమట్టం

Last Updated : May 31, 2026 at 8:51 AM IST