ETV Bharat / state

నర్సింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​ - జర్మనీలో​ అధిక వేతనంతో ఉద్యోగాలు

నర్సింగ్‌ విద్యార్థినులకు కొలువుల ఆహ్వానం - ఒంగోలు జిల్లా వ్యాప్తంగా 298 మందికి ప్రయోజనం - రాష్ట్రంలోని విద్యార్థినుల్లో ఆసక్తి ఉన్నవారిని జర్మనీ పంపి అక్కడ ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒప్పందం

Representative Image Of Nursing Jobs in Germany
Representative Image Of Nursing Jobs in Germany (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2025 at 4:58 PM IST

2 Min Read
Choose ETV Bharat

Nursing Jobs in Germany : నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి జర్మన్‌ భాష వస్తే అధిక వేతనాలు, ఉద్యోగ భద్రతతో ఆ దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయి. జర్మనీలో అధిక సంఖ్యలో ఉన్న వృద్ధుల అవసరాలకు తగ్గట్లు నర్సులు లేనందున అక్కడి ప్రభుత్వం భారత్‌తో పాటు ఇతర దేశాల్లో వారిని నియమించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కూటమి ప్రభుత్వం కూడా ఆ ఉద్యోగావకాశాలను రాష్ట్ర విద్యార్థులు అందిపుచ్చుకునేందుకు కృషి చేస్తోంది.

నర్సింగ్‌ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు ఉన్నట్లు పలు దేశాలు ప్రకటించడంతో వాటిని అందిపుచ్చుకునే విధంగా కళాశాలలోనే ఉచిత శిక్షణ ఇస్తున్నారు. నర్సింగ్‌ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. దీర్ఘకాలం వేచి చూడకుండా ఉపాధి కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరేవారు. అక్కడ నైపుణ్యం బట్టి కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.20 వేలు వేతనం ఇచ్చేవారు. ప్రతిభతో సీటు సాధించి నాలుగేళ్లు చదివినా సరైన కొలువులు రాలేదని నిరాశ చెందేవారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయస్థాయి ఉద్యోగాలకు మార్గం కల్పించింది.

కళాశాలలోనే జర్మన్‌ భాష : జర్మనీలో దాదాపు లక్షకు పైగా నర్సింగ్‌ ఉద్యోగాలకు అవకాశాలున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందినట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. దీంతో రాష్ట్రంలోని విద్యార్థినుల్లో ఆసక్తి ఉన్నవారిని జర్మనీ పంపి అక్కడ ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు ఉన్న కళాశాలలకు శిక్షకులను నియమించింది. ఒంగోలు నగరంలోని కళాశాలలో నాలుగు బ్యాచ్‌ల్లో కలిపి 298 మంది విద్యార్థినులు ఉన్నారు.

ఉత్తీర్ణత సాధిస్తే జర్మనీలో ఉద్యోగం : అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగో సంవత్సరంలో 101 మంది చదువుతున్నారు. వీరు కోర్సు పూర్తి చేయగానే జర్మనీలో కొలువులు సాధించేందుకు అవకాశం ఉంది. బ్యాచ్‌కు 55 మంది చొప్పున ప్రతిరోజు మూడు బ్యాచ్‌లకు 2 గంటల పాటు జర్మన్‌ భాష నేర్పిస్తున్నారు. ఏ 1, ఏ 2 లో నెల రోజులపాటు ప్రాథమిక స్థాయి బోధన కింద అక్షరాలు చదవడం, రాయడం, పదాలు పలకడంపై అవగాహన కల్పిస్తారు. మరో మూడు నెలలు బీ 2 ప్రొఫెషనల్‌ స్థాయిలో అనర్గళంగా మాట్లాడే విధంగా తర్ఫీదు ఇస్తారు. దశల వారిగా ప్రక్రియ కొనసాగుతుంది. ఒక దశ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే రెండో దశలోకి ప్రవేశం కల్పిస్తారు. అన్ని దశలు పూర్తయ్యాక ప్రభుత్వమే జర్మనీలో ఉద్యోగం కల్పిస్తుంది.

నెలకు రూ. 3.10 లక్షల వేతనం : విద్యార్థినులకు జర్మనీలో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఒంగోలు నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్ పసుపులేటి సుమిత్రాదేవి తెలిపారు. ఉద్యోగం పొందిన వారికి నెలకు రూ. 3.10 లక్షల వేతనం లభిస్తుందని ప్రిన్సిపల్​ వివరిస్తున్నారు. అకడమిక్‌ సబ్జెక్టుతోపాటు అదనంగా శిక్షణ ఉంటుందని సుమిత్రాదేవి పేర్కొన్నారు. పాస్‌పోర్టు, వీసా ఇతరత్రా పనులన్నీ ప్రభుత్వం ద్వారానే జరుగుతాయని అన్నారు.

జర్మనీ భాషపై పట్టు సాధిస్తే విదేశీ కొలువు మీ సొంతం - నెలకు రూ.లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశాలు

జర్మనీలో కొలువులు- ఆ భాష నేర్చుకుంటే నెలకు రూ.3 లక్షల వరకు జీతం పొందొచ్చు!