ETV Bharat / state

సెలవులే కదా అని మైనర్లకు బండి ఇవ్వకండి - దొరికితే శిక్ష ఏమిటో తెలుసా?

బైక్​ ఇవ్వకపోతే మారం చేస్తున్నాడని చెప్తున్న తల్లిదండ్రులు - ప్రతి ఏడు పెరుగుతున్న రెట్టింపు అవుతున్న ప్రమాదాలు - మైనర్లు డ్రైవింగ్​తో 25 ఏళ్లు లైసెన్స్‌ క్యాన్సిల్​

Increasing Of Minor Driving Cases In Hyderabad
Increasing Of Minor Driving Cases In Hyderabad (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : January 11, 2026 at 10:43 AM IST

3 Min Read
Choose ETV Bharat

Increasing Of Minor Driving Cases In Hyderabad : తల్లిదండ్రులు తమ పిల్లాడికి చిన్న వయసులోనే బైక్​ అప్పగించి, 'అప్పుడే మా వాడు బైక్​ నడుపుతున్నాడు' అని మురిసిపోతారు. స్నేహితులతో సరదాగా అలా బయటకే కదా! కొద్దిదూరమే కదా నడిపితే ఏమౌతుంది? అని కారణమేదైనా మైనర్ల డ్రైవింగ్ ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో కొందరు టీనేజర్లు డ్రైవింగ్‌ మీద కనీస అవగాహన లేకుండా, బండి నడపాలన్న ఉత్సాహంతో బైకులు, కార్లతో వేగంగా దూసుకెళ్తూ రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారు. అంతే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇప్పుడు సెలవులు కావడంతో ఇలా తల్లిదండ్రుల బైకులు డ్రైవింగ్ చేస్తున్న మైనర్లు చాలామందే ఉన్నారు.

మూడు నెలల్లో 5వేల కేసులు : రాజధానిలో మైనర్‌ డ్రైవింగ్‌ కేసుల సంఖ్య ఏటా రెట్టింపు సంఖ్యలో పెరగడమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌లో 2023లో 1878 మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదవగా 2024లో ఈ సంఖ్య 2976కు పెరిగింది. 2025లో ఏకంగా 7808 ఉల్లంఘనలు నమోదయ్యాయి. అలాగే కేవలం ఏప్రిల్‌ 5 నుంచి జూన్‌ నెలాఖరు వరకు మాత్రమే 5,040 కేసులు నమోదు చేశారు.

తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణం : హైదరాబాద్​ నగరానికి చెందిన ఇద్దరు మైనర్లు ఓ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. వీరిద్దరికీ లైసెన్సు లేదని తెలిసినా ఏజెన్సీ యజమాని తన ఖరీదైన బైకు చేతికిచ్చాడు. కొద్దిదూరమేననే భావనతో టీనేజర్లు బైకు నడుపుతూ కారును ఢీకొట్టి మృత్యువాతపడ్డారు. మైనర్లు వాహనాలు నడపడానికి మెజార్టీ ఉదంతాల్లో తల్లిదండ్రుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బయటపడుతోంది. పోలీసులు విచారించినప్పుడు మారాం చేస్తున్నాడని, కొద్దిదూరమేనని డ్రైవింగ్‌ ఇచ్చామని, స్నేహితుల ఇంటికి వెళ్తానని చెప్పాడంటూ సమాధానాలిస్తున్నారు. ప్రమాదం జరిగితే ఎలాగని ప్రశ్నిస్తే మౌనంతో బదులిస్తున్నారు. మరికొన్ని ఉదంతాల్లో స్నేహితుల వాహనం నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

బండిస్తే చట్ట పరంగా ఎదుర్కోవాలి

  • మైనర్లకు వాహనం ఇస్తే చట్టప్రకారం వాహన యజమాని/తల్లిదండ్రులు చట్టపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  • మైనర్‌ మీద జువైనల్‌ సెక్షన్ల కింద కేసు నమోదవుతుంది.
  • ఈ కేసుల్లో చట్టపరమైన చర్యలతో పాటు మైనర్‌ నడిపిన వాహనం రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తారు. గతేడాది హైదరాబాద్‌లో 1455 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి.
  • బాధ్యులకు జైలు శిక్షలు పడతాయి. ఎక్కువ ఉదంతాల్లో సామాజిక సేవ చేయాలంటూ ఆదేశాలు వస్తున్నాయి.

2025లో మైనర్‌ డ్రైవింగ్‌ వివరాలు

  • మొత్తం కేసులు: 7808
  • వాహనమిచ్చిన వారిపై ఛార్జిషీట్లు: 5818
  • రద్దయిన వాహనాల రిజిస్ట్రేషన్లు : 1455
  • సామాజిక సేవ శిక్షలు: 5627
  • విధించిన చలాన్ల మొత్తం: రూ.70.6 లక్షలు

జరిమానా కట్టితే సరిపోతుందిలే : బైక్​ నడపడం వచ్చని, పోలీసులు పట్టుకున్నా జరిమానా కడితే సరిపోతుందిలే అనే ఆలోచనతో ఇలా తల్లిదండ్రులు తమకు తామే సర్దిచెప్పుకుని పిల్లల చేతికి వాహనం ఇవ్వటం సర్వసాధారణంగా మారింది. కన్నవారిని ఏమార్చి బండి తీసుకెళ్తున్న పిల్లలూ ఉన్నారు. పరీక్షలో మంచి మార్కులు వస్తే కొనిస్తానని ఆశ చూపి, బండు చేతికిస్తున్నారు. అది భవిష్యత్తులో ఎంత ప్రమాదానికి దారి తీస్తుందని గుర్తించడం లేదు.

25 ఏళ్ల వయసు వరకు లైసెన్స్​ ఉండదు : మైనర్ల డ్రైవింగ్‌తో జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహన యజమానులు, తల్లిదండ్రులు, సంరక్షకులపై కేసులు నమోదు చేస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్‌ చేస్తే వాహన యజమానులకు 3 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 12 నెలల పాటు ఆర్సీ రద్దు చేస్తారు. వాహన రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేయిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేసి పోలీసులకు చిక్కితే 25 ఏళ్ల వయసు వచ్చేంత వరకు లైసెన్స్‌ పొందే అవకాశం లేకుండా రవాణా శాఖకు ట్రాఫిక్‌ పోలీసులు సమాచారం అందిస్తున్నారు.

మైనర్లు డ్రైవింగ్​ చేస్తే కఠిన చర్యలు - దొరికితే పాతికేళ్లదాకా లైసెన్సు ఉండదు

Punishment for Minor Driving: మైనర్లు రోడ్డు ప్రమాదం చేస్తే.. తల్లిదండ్రులకు జైలు శిక్ష