సైబర్ నేరాలపై పోలీసుల యుద్ధం - ప్రచార రథాలతో ప్రజల్లో అవగాహన
డ్రగ్స్‌పై దండయాత్ర తరహాలోనే సైబర్ నేరాలపై పోలీసుల ఫోకస్ - సామాజిక మాధ్యమాలు, టెలిగ్రామ్ ఛానళ్లపై ప్రత్యేక నిఘా - ప్రత్యేక టూల్ ద్వారా ఫేక్ ప్రకటనల గుర్తింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 24, 2026 at 10:18 PM IST
Cyber Crime Awareness Campaign in NTR District : సైబర్ నేరాలపై ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ యుద్ధం ప్రకటించింది. డ్రగ్స్‌పై దండయాత్ర పేరుతో ఇటీవల పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మత్తు పదార్థాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో సైబర్ నేరాల కట్టడిపై పోలీసులు దృష్టి సారించారు. రోజురోజుకూ పెరుగుతున్న ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించారు. ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సామాజిక మాధ్యమాలపై డేగకన్ను వేశారు. అందులో వచ్చే మోసపూరిత ప్రకటనలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. వాటిని వెంటనే తొలగిస్తూ సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తున్నారు. ముఖ్యంగా టెలిగ్రామ్‌లోని వివిధ ఛానళ్లపై నిఘా ఉంచారు. మోసాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ప్రత్యేక టూల్‌తో డేగకన్ను : సామాజిక మాధ్యమాల్లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రకటనలు అమాయకులను ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీనికోసం నగర పోలీస్ కమిషనర్ (సీపీ) రాజశేఖరబాబు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ టూల్ ద్వారా సైబర్ నేరగాళ్లను పసిగడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు టెలిగ్రామ్‌లోని వివిధ ఛానళ్లలో వచ్చే నకిలీ ప్రకటనలను జల్లెడ పడుతోంది. 'వర్క్ ఫ్రమ్ హోం', 'పెట్టుబడికి రెట్టింపు లాభాలు' అంటూ వచ్చే ప్రకటనలను ట్రాక్ చేస్తోంది. ఈ-కామర్స్ మోసాలకు సంబంధించిన లింక్‌లను సులభంగా గుర్తిస్తోంది.
'సహయోగ్' పోర్టల్ ద్వారా లింక్‌ల తొలగింపు : నకిలీ ప్రకటనలను గుర్తించిన వెంటనే పోలీసులు తదుపరి చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈ వివరాలను వెంటనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపుతున్నారు. కేంద్రం ప్రత్యేకంగా రూపొందించిన 'సహయోగ్' పోర్టల్‌లో వీటిని అప్‌లోడ్ చేస్తున్నారు. తద్వారా అమాయకులను బురిడీ కొట్టించే ప్రకటనలను శాశ్వతంగా తొలగిస్తున్నారు.
ఇలా ఇప్పటివరకు దాదాపు వందకు పైగా నకిలీ లింక్‌లను పోలీసులు గుర్తించారు. వాటిని పూర్తి స్థాయిలో తొలగించి ప్రజలను సైబర్ మోసాల నుంచి కాపాడారు. వీటితో పాటు పలు టెలిగ్రామ్ ఛానళ్లలో బోగస్ క్యూఆర్ కోడ్‌లతో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్, ఈ-కామర్స్ మోసాలకు పాల్పడుతున్నారు. వీటిపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
అవగాహన కోసం ప్రచార రథాలు : సైబర్ మోసాలను అరికట్టాలంటే ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన రావడం ఎంతో ముఖ్యం. అందుకే ప్రజలను చైతన్య పరిచేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సైబర్ నేరాల నివారణపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఆరు ప్రచార రథాలను సిద్ధం చేశారు. ఈ వాహనాల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు. 'ఖాకీ స్టూడియో' ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత వీడియోలను సైతం చూపుతారు.
వీలైనన్ని ఎక్కువ జనావాస ప్రాంతాలకు ఈ రథాలు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రచార రథాలను నేడు అధికారికంగా ప్రారంభించారు. నగరవ్యాప్తంగా దాదాపు 15 రోజుల పాటు ఈ ప్రచార కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగనుంది. మొబైల్‌కు వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, సైబర్ మోసాలపై ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో మోసాలు - టాస్క్ ఆధారిత సైబర్ నేరాలపై ‘యుద్ధం’
లైక్ కొడితే వేలకు వేలు వస్తాయా? - ఆశ పడ్డారో నిలువునా దోచేస్తారు - 'టాస్క్' మోసాలపై పోలీసుల అలర్ట్

