లైక్ కొడితే వేలకు వేలు వస్తాయా? - ఆశ పడ్డారో నిలువునా దోచేస్తారు - 'టాస్క్' మోసాలపై పోలీసుల అలర్ట్
ఇంటి నుంచే పని అంటూ సైబర్ నేరగాళ్ల గాలం - హోటళ్లు, రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తే డబ్బులంటూ వల - తొలుత కొంత డబ్బు చెల్లించి నమ్మకం కలిగించే ఎత్తుగడ

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 20, 2026 at 10:07 AM IST
NTR District Police Task Based Cyber Scam Alert : మీ మొబైల్ ఫోన్‌కు అకస్మాత్తుగా ఒక మెసేజ్ వస్తుంది. అందులో ఇలా ఉంటుంది. 'ఇంటి నుంచే పని. రోజుకు రూ. 2 వేలు సులభంగా సంపాదించొచ్చు. మీరు చేయాల్సిందల్లా యూట్యూబ్ వీడియోలకు, హోటళ్లకు లైక్‌లు కొట్టడమే'. అరె భలే ఉందే. కూర్చున్న చోటే డబ్బులు వస్తున్నాయని ఆశపడ్డారా? అయితే మీరు పెద్ద ప్రమాదంలో పడినట్లే. ఒక అదృశ్య వల మిమ్మల్ని చుట్టుముడుతున్నట్లే. మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు క్షణాల్లో ఖాళీ అయిపోవడం ఖాయం. ఇలాంటి సైబర్ మోసాలు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఈ 'టాస్క్' ఆధారిత మోసాలపై యుద్ధం ప్రకటించారు.
తొలుత నమ్మకం, ఆ తర్వాతే మోసం : సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ముందుగా మీకు చిన్నచిన్న టాస్క్‌లు ఇస్తారు. పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వమంటారు. లైక్‌లు కొట్టాలని చెబుతారు. వాళ్లు చెప్పినట్లు మీరు లైక్ కొట్టగానే వెంటనే మీ ఖాతాలో రూ. 500 వేస్తారు. మీ కళ్ల ముందే డబ్బులు జమ అయ్యేసరికి మీకు నమ్మకం కలుగుతుంది. 'చూశారుగా ఇంట్లోనే కూర్చుని ఎంత ఈజీగా డబ్బు సంపాదించారో' అని మిమ్మల్ని ఊరిస్తారు. మీలో ఆశను మరింత పెంచుతారు. సరిగ్గా అక్కడే అసలు నాటకానికి తెరతీస్తారు.
ప్రీమియం టాస్క్ : మీకు నమ్మకం కుదిరాక సైబర్ నేరగాళ్లు అసలు వ్యూహం అమలు చేస్తారు. ఈసారి మీకు 'ప్రీమియం టాస్క్' ఇస్తున్నామని నమ్మబలుకుతారు. దీనివల్ల లాభాలు రెట్టింపు ఉంటాయని ఆశ చూపుతారు. అయితే ఈ టాస్క్ చేయాలంటే ముందుగా మీరు రూ. 5 వేలు పెట్టుబడి పెట్టాలని అడుగుతారు. గతంలో డబ్బులు వచ్చాయి కదా అనే నమ్మకంతో మీరు ఆ డబ్బును చెల్లిస్తారు. ఆ తర్వాత మీతో మరో లైక్ కొట్టిస్తారు. మీ ఖాతా (వర్చువల్ వాలెట్)లో రూ. 8 వేలు ఉన్నట్లు చూపుతారు. మీరు ఆ డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చని చెబుతారు.
సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ముగింపు : మీరు ఆ 8 వేల రూపాయలను వెనక్కి తీసుకునేందుకు (విత్‌డ్రా) ప్రయత్నిస్తారు. కానీ ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలోకి రావు. విత్ డ్రా విఫలం అవుతుంది. అదేంటని మీరు వారిని ప్రశ్నిస్తారు. అప్పుడు సైబర్ నేరగాళ్లు మరో అబద్ధం ఆడుతారు. విత్ డ్రా కావాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద మరో రూ. 15 వేలు చెల్లించాలని అంటారు. ఇది ఆఖరి పేమెంట్ అని మభ్యపెడతారు. ఆ డబ్బు కడితే మీ పెట్టుబడి, లాభం మొత్తం ఒకేసారి వస్తుందని నమ్మిస్తారు. అది నిజమేనని నమ్మి మీరు డబ్బులు పంపితే ఇక అంతే సంగతులు. ఆ తర్వాత వారు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని మాయమైపోతారు.
⚠️ Review / Rating Task Scam Alert ⚠️
— Vijayawada City Police (@VjaCityPolice) August 18, 2026
“Review / Rating Task” పేరుతో ముందుగా డబ్బులు పెట్టించి, Task పూర్తి చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పే మోసాల పట్ల జాగ్రత్త!
👉 ముందుగా డబ్బులు అడిగితే నమ్మకండి...(1/2) pic.twitter.com/xYOMbjGnJb
'ఒక్క రూపాయి కూడా పంపొద్దు' : ఈ తరహా మోసాలు విపరీతంగా పెరుగుతుండటంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై రెండో అవగాహన వీడియోను విడుదల చేశారు. ఇందులో 'ఖాకీ బాబు, సైబర్ చిట్టి' అనే పాత్రలతో మోసం జరిగే తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. "డిపాజిట్‌గా ఒక్క రూపాయి కూడా పంపొద్దు. ముందుగా డబ్బులు పెట్టండి. ఆ తర్వాత ఎక్కువ డబ్బు తీసుకోండి అని ఎవరైనా చెబితే అది కచ్చితంగా సైబర్ మోసమే" అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా డబ్బులు అడిగే రివ్యూ, రేటింగ్ ఉద్యోగాలను అసలు నమ్మవద్దని పదేపదే సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సైబర్ బారిన పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
లండన్ కంపెనీల పేరుతో టోకరా - రూ.59 లక్షల సైబర్ మోసం కేసులో నయా ట్విస్ట్!
గుంటూరు లాలాపేటలో సైబర్ మోసం - రూ.80 లక్షలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు

