ETV Bharat / state

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌కు బాధితుల క్యూ - బాసటగా నిలుస్తున్న విద్యార్థులు

వృద్ధులు, దివ్యాంగులకు అండగా విద్యార్థులు - 'యూత్ టైమ్ బ్యాంక్' యాప్ ద్వారా స్వచ్ఛంద సేవలు - సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం తమకెంతో సంతోషాన్నిస్తోందంటున్న విద్యార్థులు

NTR District Collectorate Youth Time Bank Services
NTR District Collectorate Youth Time Bank Services (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 30, 2026 at 1:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

NTR District Collectorate With Youth Time Bank Services: వివిధ సమస్యలతో విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి నిత్యం ఎంతోమంది బాధితులు వస్తుంటారు. వాళ్లు తమ బాధను అధికారులకు చెప్పుకుని పరిష్కారం ఆశిస్తుంటారు. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను కలవాలన్నా, వారికి తమ సమస్యను విన్నవించాలన్నా దరఖాస్తు రాయాల్సి ఉంటుంది. అయితే అందులో చాలామంది వృద్ధులు, దివ్యాంగులు ఉండటంతో వారు అయోమయానికి గురవుతుంటుంటారు. అలాంటి వారికి సహాయం చేయడానికి కళాశాల విద్యార్థులు ముందుకు వస్తున్నారు. వారు వృద్ధులు , దివ్యాంగులను చేయి పట్టుకుని కార్యాలయం లోపలికి నడిపిస్తున్నారు. అలాగే, స్వయంగా రాయలేని వారికి వినతిపత్రాలను రాసిచ్చి, ఆ పత్రాలు కలెక్టర్‌కు అందేలా చూస్తున్నారు.

మోసం జరిగేతే వెంటనే ఫిర్యాదు: బాధితులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బారులు తీరగా, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వినతిపత్రాలు వెల్లువెత్తాయి. తాను బతికే ఉన్నప్పటికీ, అధికారిక రికార్డులలో తనను మరణించినట్లుగా నమోదు చేశారని ఒక బాధితుడు వాపోయాడు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బకాయి చెల్లింపులపై మరో వ్యక్తి వినతిపత్రాన్ని సమర్పించాడు. ఇదిలా ఉండగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరుతూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

"విద్యుత్ శాఖ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేము ఒక వినతిపత్రాన్ని సమర్పించాం. కాంట్రాక్ట్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా విలీనం చేయాలని, అందరికీ సమాన వేతనం కల్పించాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా తెలంగాణలో అమలు చేస్తున్న విధానం మాదిరిగానే 40,000 రూపాయల వేతనం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాం".- బాధితులు

యూత్ టైమ్ బ్యాంక్: వివిధ సమస్యలతో కలెక్టరేట్‌కు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులు , దివ్యాంగులకు యువత సహాయం అందిస్తున్నారు. రాయలేని వారికి వినతిపత్రాలను రాసివ్వడంతో సహా వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి 'యూత్ టైమ్ బ్యాంక్' (Youth Time Bank) యాప్ ద్వారా విద్యార్థులు స్వచ్ఛంద సేవకులుగా ముందుకు వస్తున్నారు. ప్రతి సోమవారం వివిధ కళాశాలల విద్యార్థులు వంతులవారీగా ఈ సేవలను అందిస్తున్నారని యువజన సేవల శాఖ ప్రతినిధులు తెలిపారు.

"మా NSS వాలంటీర్లు ఇక్కడ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సేవలు అందిస్తారు. కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించే వ్యక్తులకు ముఖ్యంగా రాయలేని వారికి లేదా దివ్యాంగులకు అవసరమైన సహాయం చేస్తూ, ఆ ప్రక్రియ అంతటిలోనూ వారికి అండగా నిలుస్తారు. ప్రతి సోమవారం ఈ సేవలను అందించడానికి, ఒక్కో కళాశాల నుంచి పది మంది వరకు విద్యార్థులు వచ్చేలా ఏర్పాట్లు చేశారు". - డా. కొల్లేటి రమేశ్, సీఈవో (యూత్ సర్వీసెస్)

చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం తమకెంతో సంతోషాన్నిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.

యువతకు ఉజ్వల భవిత - కెరీర్‌, నైపుణ్యాలు, ఉపాధికి 'మై భారత్'

యువకుడి ప్రాణం తీసిన అతివేగం - వైరల్​గా మారిన సీసీటీవీ దృశ్యాలు