పేదల ఇళ్లలో కొత్త సంవత్సర సందడి - ఒకరోజు ముందే పింఛన్ల పండుగ
ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ - తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేత - పంపిణీలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు - హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 31, 2025 at 9:53 PM IST
NTR Bharosa Pensions Distribution in AP: రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో పేదల ఇళ్లలో కొత్త సంవత్సర సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. స్థానికులు, వృద్ధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం చూపారు. కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందుగానే పింఛన్లు అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పింఛన్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు: నెల్లూరులో పెన్షన్ల పంపిణీ పండుగలా జరిగింది. మత్యకారులు, మాజీ సైనికులకు మంత్రి నారాయణ స్వయంగా పెన్షన్లు అందచేశారు. నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేటలో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కొత్త ఏడాదిలో ప్రజల ముఖాల్లో ఆనందం కోసం ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని ప్రకాశం జిల్లా నూజిళ్లపల్లిలో మంత్రి గొట్టిపాటి తెలిపారు.
9 మందికి రూ.18 లక్షలు పంపిణీ: నంద్యాలలో మంత్రి ఫరూక్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అక్కడ దుస్తులు ఇస్త్రీ చేసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పింఛన్ల మొత్తాన్ని పెంచి ఇస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో వైఎస్సార్సీపీ హయాంలో పింఛన్లు కోల్పోయిన 9 మందికి కోర్టు ఆదేశాలతో రూ.18 లక్షల రూపాయలను మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు.
విజయనగరం జిల్లా బోనంగిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పీఎంఈజీపీ (PMEGP) పథకం కింద 22 మందికి కోటి 7 లక్షల రూపాయల ఆస్తులను పంపిణీ చేశారు. మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి ఓ వృద్ధురాలు నిర్వహిస్తున్న దుకాణం వద్దకు వెళ్లి పూరీలు కాల్చారు.
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా సీఎం చంద్రబాబు నాయకత్వంలో మెరుగైన సంక్షేమం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు రాయదుర్గంలో అన్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కడప జిల్లా అమ్మగారిపల్లెలో కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. జమ్మలమడుగులో తెలుగుదేశం నేత భూపేశ్ రెడ్డి, కర్నూలు కృష్ణా నగర్‌లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఫించన్లు పంపిణీ చేశారు.
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్‌బాబు త్రిపురాంతకం మండలం గూట్లపల్లిలో కూటమి శ్రేణులతో కలిసి పింఛన్లు అందజేశారు. తాడికొండ నియోజకవర్గం పేరేచర్లలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. చీరాల నియోజకవర్గంలో 30,000 మందికి పింఛన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. బాపట్ల ఇస్లాంపేటలో ఎమ్మెల్యే నరేంద్రవర్మ పింఛన్లు పంపిణీ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా మునగచర్లలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి పల్లె పండుగ 2.Oలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పింఛన్ల పంపిణీని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఒకరోజు ముందుగానే పింఛన్లు అందించడంతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందాన్ని చూశామని అమలాపురం ఎంపీ హరీశ్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు అన్నారు.
"కొత్త ఏడాదిలో ప్రజల ముఖాల్లో ఆనందం కోసమే ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పింఛన్ల మొత్తాన్ని పెంచి ఇస్తున్నాం. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది."-గొట్టిపాటి రవికుమార్, మంత్రి

