ETV Bharat / state

గుడ్​న్యూస్​ - ఏపీలో మరో 3 లక్షల పింఛన్లు - సెప్టెంబర్‌లో దరఖాస్తులు, అక్టోబర్‌లో మంజూరు

మొదట వితంతువులకు, వృద్ధులకు ఇచ్చేలా కార్యాచరణ - సెప్టెంబర్‌లో దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్‌ నుంచి పంపిణీ

NTR Bharosa Pension
కొత్త పింఛన్ల పంపిణీకి ప్రణాళిక (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 26, 2026 at 7:27 AM IST

2 Min Read
Choose ETV Bharat

NTR Bharosa Pension : రాష్ట్రంలో కొత్తగా 3 లక్షల మందికి ఎన్​టీఆర్​ భరోసా పింఛన్లు అందనున్నాయి. సెప్టెంబర్‌ తొలి వారంలో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ రెండో వారం నుంచి దఖాస్తులు స్వీకరించి అక్టోబర్‌లో కొత్త పింఛన్ల పంపిణీకి కార్యాచరణ రూపొందించనట్లు తెలుస్తోంది.

ఎన్​టీఆర్​ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్ల అందజేతపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా 3 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. వీటికి సంబంధించి సెప్టెంబర్‌ రెండో వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులకు అక్టోబర్‌లో పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు. దీనిపై వారం రోజులుగా 'సెర్ప్‌' అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్‌ తొలి వారంలో దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశముంది.

కొత్త పింఛన్ల పంపిణీకి ప్రణాళిక (ETV Bharat)

రాష్ట్రవ్యాప్తంగా 1,70,000 మంది : పింఛనుకు ఎంత మంది అర్హులున్నారనేది గుర్తించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,70,000 మంది వితంతువులున్నట్లు గుర్తించింది. వీరి వివరాలను ఆరు అంచెల నిబంధనలతో తనిఖీ చేయించింది. తుదిగా 1,50,000 మంది అర్హులు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకొచ్చింది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వాటిని మరోసారి వడపోయనుంది. మిగతా 1,50,000 పింఛన్లు వృద్ధులకు అందించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ హయాంలో అర్హత ఉన్నా దాదాపుగా లక్ష మంది వృద్ధులకు పింఛను ఇవ్వలేదు. ఆ సమాచారాన్నీ అధికారులు తెప్పించుకున్నారు. చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తిపరమైన పింఛను కేటగిరీ వారి వివరాలూ ఆయా శాఖల నుంచి సమీకరిస్తున్నారు. ఇవన్నీ 60-70 వేల వరకూ ఉండొచ్చని అంచనా.

వారికి విడతల వారీగా పింఛన్లు : దరఖాస్తుల స్వీకరణ అనంతరం వివిధ కేటగిరీలకు ఎంపికయ్యే అర్హుల సంఖ్యకు అనుగుణంగా వీరికి పింఛను మంజూరు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దివ్యాంగుల కేటగిరీ పింఛనుకు సంబంధించి వైకల్యం లేని వారికి భారీగా సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. వారి అర్హతను ఎలా నిర్ధారించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడత మంజూరు పోనూ మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిసింది.

60ఏళ్లకు ప్రభుత్వ పెన్షన్ - ప్రతి నెలా కొద్దిగా పొదుపు చేస్తే చాలు!

దివ్యాంగ విద్యార్థులు ఎలా కోరితే అలానే పింఛన్‌ - వారి కష్టాలు తీర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం