'అమ్మ భాషను మరవలేదు - ఆవకాయను మానలేదు' - ఎల్లలు దాటినా తెలుగుదనంపై తగ్గని మమకారం
ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్లు - మాతృభాషతో పెనవేసుకున్న అనుబంధాన్ని, తెలుగు నేలతో తెగని పేగుబంధాన్ని గుర్తుచేసుకున్న తెలుగు వారు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 4, 2026 at 10:49 PM IST
NRIs Attended World Telugu Mahasabhalu in Guntur : వారు దశాబ్దాల క్రితం మాతృభూమికి దూరమయ్యారు. కానీ మాతృభాషను పొత్తిళ్లలో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. విదేశాల్లో స్థిరపడ్డప్పటికీ తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన సంస్కృతి, సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నారు. ఆయా దేశాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగినా, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తున్నా తమ అమ్మభాష తెలుగేనని సగర్వంగా చెబుతున్నారు.
అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్ని అనుసరిస్తూనే తెలుగును ఆదరిస్తున్నారు. వారి పిల్లల పేర్లు మొదలు వంటల వరకూ అన్నింటా తెలుగుదనం ఉట్టిపడుతోంది. ప్రస్తుతం గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్లు విచ్చేశారు. మాతృభాషతో పెనవేసుకున్న అనుబంధాన్ని, తెలుగు నేలతో తెగని పేగుబంధాన్ని 'ఈటీవీ- ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
భజనలు, భక్తిగీతాలు తెలుగులోనే : " మా తాతముత్తాలు చేసిన రామభజనను ఇప్పటికీ మేం ఇళ్లు, గుళ్లలో చేస్తున్నాం. తెలుగులో భజన పాటలు పాడుతున్నాం. తెలుగు మాకు భాష మాత్రమే కాదు, వారసత్వం, అస్తిత్వం, జీవన విధానం కూడా. మాకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి డబ్బు అక్కర్లేదు. సాంస్కృతిక వారసత్వం కావాలి. ఇక్కడి కళలన్నీ అందించాలి. మా దేశ ప్రభుత్వం మారిషస్ తెలుగు మహాసభతో పాటు తెలుగు సాంస్కృతిక కేంద్రానికి ఏటా నిధులిస్తోంది." అని వ్యాపారి వీరజ్ ప్యాల్ రమణయ్య తెలిపారు.
మారిషస్‌లో ఉగాదికి అధికారిక సెలవు :

మారిషస్‌లో తెలుగువారి జనాభా లక్ష వరకూ ఉంటుంది. మా దేశ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ మంత్రి లచ్మనారాజ్ పెంటియ్య తెలుగువారు. ఆయన తెలుగులో మాట్లాడగలరు. మా పూర్వీకులు శతాబ్దాల క్రితం తెలుగు నేల నుంచి వలసవెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఐదు తరాలుగా సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి పండుగలు చేస్తున్నాం. 40 రోజుల పాటు శ్రీవేంకటేశ్వరస్వామి వ్రతం ఆచరిస్తాం. ఉగాదిని మారిషస్ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది. అక్కడి తెలుగు పిల్లల కోసం ‘సాయంత్రం బడులు’ నిర్వహిస్తున్నాం. మా మహాసభకు 90 శాఖలు, ఏడు ప్రాంతీయ కమిటీలు, యువజన విభాగం ఉన్నాయి.
ఉపకార వేతనాలతో ప్రోత్సాహం :

చెరకు తోటల్లో పని చేయడానికి 1901లో మా ముత్తాతను బ్రిటిష్ వాళ్లు మారిషస్‌కు తీసుకెళ్లారు. ఆయన స్వస్థలం పుత్తూరు. మాది అక్కడ మూడో తరం. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎంఏ, పీహెచ్‌డీ చదివాను. ఆంధ్ర, తెలంగాణల్లో తెలుగులో డిగ్రీ కోర్సులు చదువుతున్న మా దేశ విద్యార్థులకు ఉపకారం వేతనాలిస్తున్నాం. మారిషస్ రెండో భాషగా తెలుగు, హిందీ, తమిళ్, చైనీస్, ఇంగ్లిష్‌లలో ఏదైనా నేర్చుకోవచ్చు. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు తెలుగును ఓ పాఠ్యాంశంగా బోధిస్తున్నాం.
ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం :

ఖతార్‌లో సుమారు 50 వేల మంది తెలుగు వాళ్లున్నారు. అక్కడి ఆంధ్ర కళావేదిక, తెలుగు కళాసమితి సంస్థల సౌజన్యంతో తెలుగు భాషా దినోత్సవం, అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవంతో పాటు మన పండుగలు సామూహికంగా నిర్వహిస్తున్నాం. కొవిడ్‌కు ముందు భౌతికంగా జరిగే తెలుగు పాఠాల బోధనను నేడు వారంలో ఒకరోజు ఆన్‌లైన్‌లో ఉచితంగా అందిస్తున్నాం. ఖతార్‌లో స్థిరపడిన తొలితరం తెలుగువాళ్లలో మా కుటుంబమొకటి.
మూడో భాషగా తెలుగు బోధన :

సౌదీ అరేబియాలో రెండు లక్షలకు పైగా తెలుగు వాళ్లున్నారు. భారత రాయబార కార్యాలయం అక్కడ సీబీఎస్‌ఈ సిలబస్ పాఠశాలలను నిర్వహిస్తుంది. చాలా బడుల్లో తెలుగు మూడో భాష. భాషాభివృద్ధికి, సేవ కార్యక్రమాలకు సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) వంటి సంస్థలు పని చేస్తున్నాయి. పండుగలు సామూహికంగా జరుపుకొంటున్నాం.
మా సంఘానికి ప్రభుత్వ గుర్తింపు :

బహ్రెయిన్‌లో సుమారు 50 వేల మంది తెలుగు వారున్నారు. బతుకమ్మ, బోనాలు, ఉగాది, సంక్రాంతి తదితర పండుగల నిర్వహణకు కృషిచేస్తున్న మా సంస్థ ‘తెలుగు కళాసమితి’కి బహ్రెయిన్ ప్రభుత్వ గుర్తింపు ఉంది. పిల్లలకు తెలుగుపై వారాంతాల్లో ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాం. ఏపీ ప్రభుత్వం మాకు తెలుగు పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపుతోంది.
అమెరికాలో 18 ఏళ్లుగా ‘సాహితీ వేదిక’ :

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో అమెరికాలో నెలనెలా సాహితీ వేదిక పేరుతో సదస్సులు నిర్వహిస్తున్నాం. 18 ఏళ్లుగా నిరాటంకంగా 221 సదస్సులు నిర్వహించాం. పిల్లల కోసం తానా ఆధ్వర్యంలో పాఠశాల, సిలికానాంధ్ర ఆధ్వర్యంలో మనబడి, బాలబడి వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తెలుగు వర్ణమాల, పద్యాలు, కథలు, ఛందస్సు నేర్పిస్తున్నాం.
సాహిత్య, సాంస్కృతిక, హస్తకళల మేళవింపు - 3వ ప్రపంచ తెలుగు మహాసభలు
కనుల పండువగా రెండో రోజు తెలుగు మహాసభలు - ముఖ్యఅతిథిగా హాజరైన మారిషస్ అధ్యక్షుడు

