ETV Bharat / state

మోగనున్న స్థానిక ఎన్నికల నగారా - మొదట మున్సిపాల్టీ - చివర్లో పంచాయతీ పోరు!

అతిత్వరలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన - ఎన్నికల నిర్వహణకు దాదాపుగా పూర్తయిన ఏర్పాట్లు - ఓటరు జాబితా తయారీ ప్రక్రియ మొదలు, వచ్చే నెల 3న ప్రకటన

AP Local Body Elections 2026
స్థానిక ఎన్నికల నిర్వహణకు దాదాపుగా పూర్తయిన ఏర్పాట్లు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 7:20 AM IST

2 Min Read
Choose ETV Bharat

AP Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగించేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయినట్లుతెలుస్తోంది. మరికొన్నింటికి కోర్టు కేసులు కొలిక్కి వచ్చాక ఏర్పాట్లు ప్రారంభిస్తారు. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ మొదలవగా వచ్చే నెల 3న తుది జాబితాలు ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అదనంగా లక్షా 50 వేల బ్యాలట్‌ బాక్సుల కోసం సరిహద్దు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు ఎస్​ఈసీ అనిల్‌చంద్ర పునేఠా లేఖలు రాశారు.

రాష్ట్రంలో 13 వేల 295 పంచాయతీలు, 61 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. డివిజన్లు, వార్డుల పునర్విభజనపై హైకోర్టులో తాజాగా వేసిన కేసులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంచాయతీలను నగర పంచాయతీలుగా ఉన్నతీకరణ, పంచాయతీలు సమీప పుర, నగరపాలక సంస్థల్లో విలీనానికి వ్యతిరేకంగా వేసిన కేసులు కొలిక్కి వచ్చాక మరో 62 నగరాలు, పట్టణాల్లోనూ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు.

మోగనున్న స్థానిక ఎన్నికల నగారా - మొదట మున్సిపాల్టీ - చివర్లో పంచాయతీ పోరు! (ETV Bharat)

పొరుగు రాష్ట్రాలకు లేఖలు: 2026 ఫిబ్రవరి 5 వరకు చేసిన చేర్పులు, మార్పులతో కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాలతో పంచాయతీల్లో లక్షా 35 వేల వార్డుల ఓటర్ల తుది జాబితాల ప్రచురణ పూర్తయింది. వీటిలో నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. వచ్చేనెల 7న ఈ వివరాల్ని కలెక్టర్లు ప్రకటిస్తారు. వీటి ఆధారంగా సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. పంచాయతీల్లో లక్షా 30 వేల పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది. వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి ఈ నెల 31న కలెక్టర్లు తుది ప్రకటన చేయనున్నారు.

61 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల వారీగా ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 3న తుది జాబితాలు ప్రకటిస్తారు. రిజర్వేషన్లు ప్రకటించేందుకు అవసరమైన ఎస్సీ, ఎస్టీ, బీసీల వివరాలను వాటిలో నుంచి గుర్తించనున్నారు. అదే సమయంలో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపైనా అధికారులు చర్యలు తీసుకుంటారు. వచ్చే నెల మొదటివారంలో ఈ ప్రక్రియ పూర్తికానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అదనంగా లక్షా 50 వేల బ్యాలట్‌ బాక్సుల కోసం తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా లేఖలు రాశారు. రాష్ట్రంలో 50వేలకు పైగా బ్యాలట్‌ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకే నెలలో స్థానికసంస్థలకు వరుసగా ఎన్నికలు నిర్వహించాలంటే 2 లక్షల వరకు బాక్సులు అవసరమని అంచనా.

మొదట మున్సిపాల్టీ ఎన్నికలు: పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో మొదట ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి వచ్చేనెల రెండోవారంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కలెక్టర్ల ద్వారా గెజిట్‌ నోటిఫికేషన్లు అందించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. రెండోదశలో పరిషత్‌ ఎన్నికలు, మూడోదశలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ - సెప్టెంబర్ 2కి వాయిదా

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పేరుతో దుష్ప్రచారం - ఇలాంటివి నమ్మొద్దు: ఎస్‌ఈసీ పునేఠా