పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు - నిల్వలు ఉన్న చోటకు జనం పరుగులు
జనానికి చుక్కలు చూపిస్తున్న చమురు కొరత - చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం - స్టాక్ ఉన్న బంకుల వద్ద జనం బారులు - పెద్ద డబ్బాల్లో డీజిల్ పట్టించుకుంటున్న జనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 26, 2026 at 10:51 AM IST
Petrol and Diesel Shortage in Andhra Pradesh : ఎక్కడ చూసినా 'నో స్టాక్' బోర్డులు! స్టాక్ ఉన్నచోట వాహనాల బారులు.!. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా చోట్ల పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి! చమురు కొరత జనానికి చుక్కలు చూపిస్తోంది. పనులన్నీ మానుకుని ఇంధనం కోసం బంకుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. గంటల తరబడి అక్కడే పడిగాపులు కాసేలా చేస్తోంది. అయినా దొరుకుతుందనే నమ్మకం లేదు. స్టాక్ అయిపోయిందని నిర్వాహకులు చెప్పడంతో చాలా మంది హతాశులై ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు.
రాష్ట్రంలోని పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత అధికమైంది. శుక్రవారం రాత్రి మొదలైన ఈ సమస్య శనివారం, నేడు(ఆదివారం) మరింత తీవ్రమైంది. చాలా మంది అవసరానికి మించి ఎక్కువ కొనుగోలు చేయడంతో నిల్వల తగ్గిపోతున్నాయి. పలుచోట్ల పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు, డ్రమ్ముల్లో డీజిల్ కొని తీసుకెళ్తున్నారు. దీంతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. స్టాక్ ఉన్నచోట జనం బారులు తీరుతున్నారు. వరి కోత యంత్రాలు, ఆక్వా సాగులో ఏరియేటర్లకు డీజిల్ కావాలంటూ రైతులు బంకుల వద్ద క్యూ కడుతున్నారు.
మార్కాపురం జిల్లాలో డీజిల్, పెట్రోల్ లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాల్లోని చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. దీంతో స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనాలు వరుస కట్టాయి. మార్కాపురంలో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బంకు వద్ద బైక్‌లు క్యూ కట్టాయి. రాత్రి పది దాటినా రద్దీ కొనసాగింది. మళ్లీ దొరుకుతుందో లేదోనని ట్యాంక్ ఫుల్ చేయాలంటూ ద్విచక్ర వాహనదారులు నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఉదయం నుంచి నో స్టాక్ బోర్డులు : కర్నూలులో శనివారం ఉదయం నుంచి నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వగా రాత్రికి కొన్నింటిలో స్టాక్ వచ్చింది. దీంతో వాహనదారులు బంకులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాలా మంది బాటిళ్లు, ప్లాస్టిక్ డబ్బాలు తీసుకొచ్చారు. మరికొందరైతే మినరల్ వాటర్ క్యాన్‌లు కూడా తీసుకొచ్చి వాటిలో చమురు నింపుకున్నారు. వాహనదారులతో పాటు బాటిళ్లు తీసుకొచ్చిన వారు మరో క్యూ కట్టారు.
కడప జిల్లావ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతోంది. కడపలో చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. స్టాక్ ఉన్న బంకులకు జనం భారీగా వెళ్తున్నారు. దీంతో వాహనదారుల తాకిడి తట్టుకోలేక నిర్వాహకులు బంకులు మూసేసి వెళ్లిపోయారు. పెట్రోల్ కావాలనుకునేవారు పట్టు వదలని విక్రమార్కుల్లా గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉంటున్నారు. జమ్మలమడుగులోనూ బంకులు జనంతో నిండిపోయాయి. వాహనాల బారులతో అక్కడక్కడా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
కాకినాడ జిల్లాలోనూ చమురు అందుబాటులో లేక జనం అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి బంకుల వద్ద నిల్చుంటున్నారు. స్టాక్ అయిపోవడంతో అక్కడి నుంచి మరో బంకుకు పరుగులు తీస్తున్నారు.
డీజిల్ దొరక్క రైతులు ఆందోళన : డీజిల్ కొరతతో కోనసీమ ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి కోత మిషన్లకు డీజిల్ దొరక్కపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ ఉన్న చోట కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని వరికోత మిషన్లకు డీజిల్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలుచోట్ల డీజిల్ కొరత ఏర్పడింది. గుంటూరు నగరంలో అనేక పెట్రోల్ బంకుల ముందు నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. డీజిల్ దొరకదనే ఆందోళనతో వాహనదారులు అవసరానికి మించి డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోలు బంకుల వద్దకు వస్తున్నారు. గుంటూరు లాడ్జి సెంటర్‌లో మూడు పెట్రోలు బంకులు ఉండగా కేవలం ఒక్క పెట్రోలు బంక్ వద్దే డీజిల్ ఉండటంతో ఆటోలు, కార్లు బారులు తీరాయి. పల్నాడు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలు బంకుల్లో శనివారం నంచే డీజిల్ సరఫరా నిలిచిపోయింది. మేడికొండూరు, పేరేచర్ల, ఫిరంగిపురం లాంటి అనేక ప్రాంతాల్లో డీజిల్ కొరత తీవ్రంగా ఉంది.
పెట్రోల్ బంకుల వద్ద బారులు : ఎన్టీఆర్ జిల్లాలో డీజిల్, పెట్రోల్ నిల్వలు నిండుకోవడంతో వినియోగదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. చాలా బంకులు వద్ద ఇప్పటికే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విజయవాడ నగరంలోని కొన్ని బంకులలో ఇంధన కొరత ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆటోనగర్, పటమట, మొగల్ రాజుపురం, యనమలకుదురు తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి క్యూలైన్ లు ఉన్నాయి. పెట్రోలు కేవలం 200 రూపాయలు పరిమితం చేయటంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తిరువూరు, కంచికచర్ల, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో కొరత నెలకొంది. ముఖ్యంగా మైలవరం మండలంలోని 7 బంకుల్లోనూ డీజిల్ అందుబాటులో లేదు, కొన్ని చోట్ల పెట్రోల్ కూడా దొరకడం లేదు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల సమయం కావడంతో, రవాణా వాహనాలకు వ్యవసాయ పనులకు ఇంధనం దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల కంపెనీలు సరఫరాను తగ్గించాయి. తాజా పరిస్థితులు, పరిణామాలపై నేడు పౌరసరఫరాల శాఖ కమీషనర్ వీడియో కాన్ ఫెరెన్స్ ద్వారా చమురు కంపెనీ ప్రతినిధులు, పెట్రోలు డీలర్ల సంఘా నాయకులు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సరఫరాను మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జిల్లాల వారీగా ఇంధన కోరత పరిస్థితిలపై పూర్తి స్థాయిలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష : మార్కాపురం జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత వేధిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. పెట్రోల్, డీజిల్ ఉన్న బంకుల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి ప్రాంతాల్లో దాదాపుగా బంకులు మూతపడ్డాయి. మార్కాపురంలోని అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులో ఉదయం నుంచి ద్విచక్ర వాహనాలు బారులు తీరాయి.
ఇంధన కొరత, వాహనదారులు, రైతుల ఇబ్బందులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సీఎస్, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.
ఇంధన కొరతపై సీఎం సమీక్ష- తక్షణ చర్యలకు ఆదేశం
రాష్ట్రంలో పలుచోట్ల డీజిల్ కొరత - గోదావరి జిల్లాల్లో నిలిచిపోతున్న వరికోతలు

