దశాబ్ద కాలంగా విజయవాడ రైల్వేస్టేషన్‌కు నిరాశ - కొత్త రైళ్ల ఊసే లేదు
దశాబ్ద కాలంగా విజయవాడ నుంచి ప్రారంభం కాని కొత్త రైళ్లు - ప్రస్తుతం ఇక్కడి నుంచి బయలుదేరే సర్వీసులు ఐదు మాత్రమే - రోజుకు 200రైళ్ల రాకపోకలు - లక్ష మందికి పైగా ప్రయాణికులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 10:31 AM IST
NO New trains from Vijayawada Railway Station : దేశంలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ రైల్వేస్టేషన్‌కు ఏళ్ల తరబడి అన్యాయం జరుగుతోంది. రైల్వే శాఖకు అత్యధిక ఆదాయం సమకూర్చిపెడుతున్న స్టేషన్లలో ఇది ముందు వరుసలో ఉంటుంది. కానీ, గత దశాబ్ద కాలంగా ఇక్కడి నుంచి ఒక్కటంటే ఒక్క కొత్త రైలు కూడా ప్రారంభం కాలేదు. వివిధ ప్రాంతాలకు కొత్త రైళ్లను నడపాలని ప్రయాణికులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రయాణికులు రిజర్వేషన్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడ నుంచి ఆరంభమై ఇతర నగరాలకు వెళ్లే రైళ్లు మాత్రం కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి.
- చెన్నైకు - పినాకిని, జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు
- విశాఖపట్నంకు - రత్నాచల్ ఎక్స్‌ప్రెస్
- సికింద్రాబాద్‌కు - శాతవాహన ఎక్స్‌ప్రెస్
- లింగంపల్లికి - ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
ఈ ఐదు రైళ్లు మినహా మిగతా రైళ్లన్నీ ఇతర నగరాల నుంచి వచ్చి విజయవాడ మీదుగా వెళ్తున్నవే కావడం గమనార్హం. బెజవాడ ఇలవేల్పు అయిన కనకదుర్గమ్మ పేరుతోనైనా కనీసం ఒక్క రైలు నడపాలని దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్నారు. అయినా రైల్వే శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు.
పెరుగుతున్న రద్దీ : విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా ప్రతిరోజూ సుమారు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం కనీసం లక్ష మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తుంటారు. వారాంతాలు, పండగల సమయాల్లో ఈ సంఖ్య లక్షన్నర నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. రద్దీకి తగ్గట్లుగా రైల్వేస్టేషన్‌ను రూ. 661 కోట్లతో ఆధునికీకరించేందుకు ఏడాది కిందట నీతి ఆయోగ్ ఆమోద ముద్ర వేసింది. 2061 నాటికి ఇక్కడి నుంచి రోజుకు కనీసం నాలుగైదు లక్షల మంది ప్రయాణిస్తారని ఒక అంచనా. అయితే, ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నా, దానికి తగ్గట్లుగా ఇక్కడి నుంచి కొత్త రైళ్లు మాత్రం మంజూరు కావడం లేదు.
ఉన్నవి కూడా ఊడగొట్టారు : రైల్వేకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న విజయవాడ నుంచి గతంలో వారానికోసారి మహారాష్ట్రలోని శిర్డీకి ఒక రైలు ఉండేది. కానీ, ఇటీవల దానిని నర్సాపూర్‌కు పొడిగించి మార్చేశారు. అలాగే, విజయవాడ-ధర్మవరం మధ్య నడిచే మరో రైలును సైతం మచిలీపట్నంకు మార్చారు. ప్రతిష్టాత్మక వందేభారత్ రైలును విజయవాడ నుంచే ఆరంభిస్తామని గతంలో అధికారులు చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో ఆయా రైళ్లకు ఆఖరి నిమిషం వరకూ ఎదురుచూసి, రిజర్వేషన్లు కన్ఫర్మ్ కాక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
బెంగళూరుకు నిత్యం వెయిటింగే : విజయవాడ నుంచి ఐటీ హబ్ బెంగళూరుకు నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే, బెంగళూరుకు వెళ్లే రైళ్లలో ఎప్పుడూ వెయిటింగే ఉంటుంది. కనీసం నెల రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే తప్ప బెర్త్ దొరకని పరిస్థితి. కేవలం బెంగళూరు మాత్రమే కాకుండా హావ్‌డా, ముంబయి నగరాలకు కూడా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంది. ఇక రాజస్థాన్ నుంచి వచ్చి విజయవాడలో స్థిరపడిన వాళ్లు లక్షల్లో ఉన్నారు. కానీ రాజస్థాన్‌కు ఇక్కడి నుంచి ఒక్క రైలూ లేదు. పుణ్యక్షేత్రాలైన శిర్డీ, తమిళనాడులోని వేళంగిణి (నాగపట్నం జిల్లా) ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి నేరుగా రైళ్లు నడపాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
సర్క్యులర్ రైళ్లు ఏవీ? : కరోనా మహమ్మారి తర్వాత రైల్వే శాఖ ప్యాసింజర్ సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది. దీంతో స్థానికంగా ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాలన్నింటినీ కలుపుతూ సర్క్యులర్ రైళ్లను తిప్పాలన్న ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఇప్పటికైనా రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్పందించి, విజయవాడ నుంచి కొత్త రైళ్లను ప్రారంభించాలని, సర్క్యులర్ రైళ్లను అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రోడ్డు మార్గంలో 40 నిమిషాలు - రైల్లో గంటన్నర ప్రయాణం
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో అక్రమాల అనకొండలు - వెలుగులోకి వస్తున్న భారీ కుంభకోణాలు

