ETV Bharat / state

ఈ స్కూల్‌ హౌస్​ఫుల్‌ - అయినా సీటు కోసం తప్పని పోటీ

కూటమి పాలనలో సత్ఫలితాలిస్తున్న విద్యారంగ సంస్కరణలు - శ్రీ నాగరాజ మున్సిపల్ హైస్కూల్‌లో పూర్తైన అడ్మిషన్లు - సీట్లు నిండినవి, నో అడ్మిషన్స్ అంటూ బోర్డు - విద్యార్థులకు అధునాతన బోధన, మంచి సౌకర్యాలు

Sri Nagaraja Govt School
Sri Nagaraja Govt School (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 3, 2026 at 10:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sri Nagaraja Govt School : కార్పొరేట్‌ వసతులు, అధునాతన విద్యా బోధన, చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు. ఇవీ ఆ సర్కారీ బడి ప్రత్యేకతలు. ఆక్కడ సీటు కోసం విద్యార్థులు పోటీ పడ్డారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి వలస వచ్చేశారు. అడ్మిషన్లు ఎక్కువ కావడంతో ఉపాధ్యాయులు చివరకు నో అడ్మిషన్ బోర్డు పెట్టేశారు. కూటమి ప్రభుత్వ సంస్కరణల బెంచ్ మార్క్‌ అందుకుని ప్రైవేట్​కు పోటీ ఇస్తున్న ప్రభుత్వ పాఠశాల సక్సెస్‌ స్టోరీ ఇది.

కూటమి పాలనలో సత్ఫలితాలిస్తున్న విద్యారంగ సంస్కరణలు (ETV)

'సీట్లు నిండినవి నో అడ్మిషన్స్, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి అంటూ రాసిన నోటీస్ బోర్డు చూడండి'. ఇదేదో కార్పేరేట్ పాఠశాల ముందు పెట్టిన బోర్డు కాదు. రాజమహేంద్రవరం వీవర్స్ కాలనీలోని శ్రీ నాగరాజ స్పెషల్ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన నోటీస్‌. పచ్చని చెట్లతో నిండిన ప్రాంగణం, అధునాతన హంగులతో తరగతి గదులు, రుచికరమైన భోజనం, నైపుణ్యం, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఇవన్నీ ఈ పాఠశాల ప్రత్యేకతలు.

వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు : ఉపాధ్యాయులందు ఈ పాఠశాల ఉపాధ్యాయులే వేరు. మొక్కుబడిగా పాఠాలు చెప్పి పిల్లల్ని వదిలేయరు. చదువులో వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దానికి ఫలితాలు గతేడాది పదోతరగతి పరీక్షల్లో కనిపించాయి. ముందెన్నడూ లేని రీతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏకంగా 42 మంది విద్యార్థులు 500 పైగా మార్కులతో అదరగొట్టారు. టౌన్ ఫస్ట్ ర్యాంకులూ సాధించడంతో పాఠశాల పేరు మార్మోగింది.

"ఇక్కడ పాఠాలు బాగా చెబుతున్నారు. ఐఎఫ్​పీ ప్యానెల్స్ బాగా యూస్ అవుతున్నాయి. అర్థం కాకపోతే మళ్లీ చెప్తారు. బుక్స్, కిట్స్ అన్నీ ఉపయోగపడుతున్నాయి. టీచర్స్ అందరూ బాగా వివరిస్తారు. డౌట్స్ వస్తే వెంటనే క్లియర్ చేస్తారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చదవలేని పిల్లలకు ప్రత్యేక తరగతులు పెట్టి మోటివేట్ చేస్తారు. "-విద్యార్థులు

అత్యుత్తమ ప్రతిభ ఫోటోలతో ‍పాఠశాల ఆవరణలో ఫ్లెక్సీలు వేయించడం, కరపత్రాలు ముద్రించి ఇంటింటి ప్రచారం చేయడం ఈ స్కూల్ రేంజ్‌ను మార్చింది. ఈ ఏడాది అడ్మిషన్ల వరదే దానికి నిదర్శనం. తల్లిదండ్రులు తమ పిల్లలకు సీట్లు కావాలంటూ పోటీపడ్డారు. చూస్తే అన్ని తరగతుల్లోనూ సీట్లు నిండిపోయాయి.

"ఆరో తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తున్నాం. పిల్లలు చాలా ఆసక్తిగా వింటున్నారు. మేము చెప్పే పాఠాలు వాళ్లకు ఎంతవరకు అర్థమవుతున్నాయో హిస్టోగ్రామ్ గ్రాఫ్ ద్వారా స్క్రీన్ పైనే చూడగలుగుతున్నాం. ఈసారి 590 పైగా సాధించాలని పోటీ పడుతున్నాం. పిల్లలకు ఏ విధంగా అర్థమవుతుందో తెలుసుకుని దానికి తగ్గట్టు చెప్పడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. సీ,డీ గ్రేడ్ విద్యార్థుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం."-ఉపాధ్యాయులు

ఏఐ సాంకేతికత జోడించి, డిజిటల్ స్క్రీన్ల ద్వారా పాఠాలు చెప్పడం విద్యార్థులకు స్పెషల్ ఎట్రాక్షన్. స్పోర్ట్స్‌, యోగా వంటి యాక్టివిటీస్‌ ప్లస్‌ పాయింట్స్‌. అలా అన్ని విషయాల్లోనూ నంబర్‌వన్‌గా నిలవడం వల్లే ఈ పాఠశాలలో సీటు దొరకడం కష్టంగా మారింది. పెరిగిన అడ్మిషన్లతో తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. పదో తరగతిలోనే 45 మంది విద్యార్థుల చొప్పున 5 సెక్ష్లన్లు నడుస్తున్నాయి. బెంచీలపై కూర్చోబెడితే సరిపోవని భావించి కొన్ని తరగతుల్లో పిల్లలను కింద కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. మరికొందరు టీచర్లతోపాటు అదనంగా బెంచీలు, వాష్ రూమ్‌ల వంటి సౌకర్యాల కోసం ఉపాధ్యాయులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు పిల్లలకు సీట్లిప్పించాలంటూ స్థానిక నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. సిఫార్సులపై ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు.

​"గత విద్యా సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత సాధించాం. అందులో 42 మందికి 500 పైన మార్కులు వచ్చాయి, ఇద్దరికి ట్రిపుల్ ఐటీ సీట్లు వచ్చాయి. అడ్మిషన్స్ ఫుల్ అని బోర్డు పెట్టినా వస్తున్న విద్యార్థులను జాయిన్ చేసుకుంటూనే ఉన్నాం."- చక్రధర్, ప్రధానోపాధ్యాయుడు

ప్రైవేట్‌కు తక్కువేం కాదు - ప్రభుత్వ బడుల్లో 'నో అడ్మిషన్' బోర్డులు!

కేఎన్​ఆర్​ పాఠశాల.. వరుసగా ఎనిమిదో ఏడాది నో అడ్మిషన్​ బోర్డు.. కారణం ఏంటంటే..!