రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు - మిన్నంటిన సంబరాలు
టపాసుల మోతలు, కేక్ కటింగ్‌లు, డీజే శబ్దాల మధ్య సంబరాలు - నృత్యాలతో అలరించిన విద్యార్థులు, మహిళలు - కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ కోలాహలం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 1, 2026 at 8:10 AM IST
New Year Celebrations in Andhra Pradesh : రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. టపాసుల మోతలు, కేక్ కటింగ్‌లు, డీజే శబ్దాల మధ్య ‘హ్యాపీ న్యూఇయర్’ అంటూ హోరెత్తించారు. కళాశాలల్లో యువతీ, యువకులు నృత్యాలతో కేరింతలు కొట్టారు. నగరాలు, పట్టణాలు మొదలుకొని గ్రామాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.
2026కు స్వాగతం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అర్థరాత్రి వరకూ నృత్యాలతో సందడి చేసిన యువత అర్థరాత్రి 12 గంటలు దాటాక కేకులు కోసి కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలిపారు. గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కమ్మజన సేనాసమితి వసతి గృహంలో విద్యార్థినిలు ఆటపాటలతో సందడి చేశారు. నూతన ఏడాదిలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకుసాగుతామని చెప్పారు.
కుటుంబసమేతంగా నృత్యాలు: విజయవాడ వాసులూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. కొన్నిగృహసముదాయాల్లో కుటుంబసమేతంగా నృత్యాలు చేశారు. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో విశాఖ ఆర్కేబీచ్ జనసంద్రమైంది. సాగరతీరంలో కేకులు కోసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బీచ్ రోడ్‌లో బైక్‌లు, కార్లు రాకుండా పోలీసులు నిలువరించారు.
యువత సంబరాలు: నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్లో మంత్రి నారాయణ ప్రజల మధ్య కేక్ కట్ చేశారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద యువకులు సంబరాలు చేసుకున్నారు. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ కేకు కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. తనను కలిసేందుకు వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. యర్రగొండపాలెం సమీపంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద యువత సంబరాలు చేసుకున్నారు. ఎస్సై చౌడయ్య కేక్ కట్ చేశారు.
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు: కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు కేక్ కోసి నూతన ఏడాదికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద జిల్లా ఎస్పీ జగదీష్ వేడుకలను పరిశీలించారు. తిరుపతిలో నూతన ఏడాది సందర్భంగా ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2026 సంవత్సరానికి రాష్ట్రప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. యువత ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. యువతీ యువకులు నృత్యాలు, పాటలతో హోరెత్తించారు. ఇళ్లు, కాలనీ వీధుల్లో చిన్నారులు, మహిళలు సందడి చేశారు. మహిళలు రంగవల్లులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. పల్లె, పట్నం, నగరవాసులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖలో, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరులో ప్రజలు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.
ఆర్కే బీచ్‌కు పెద్ద ఎత్తున నగరవాసులు: విశాఖలో నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. ఆర్కే బీచ్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆర్కే బీచ్‌కు పెద్దఎత్తున నగరవాసులు వచ్చారు. యువత బీచ్‌లో కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విశాఖ సముద్రతీరంలో ఆట, పాటలతో కేరింతలు కొట్టారు. రాత్రి విశాఖ బీచ్ రోడ్‌లో కార్లు, బైకులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బీచ్ రోడ్డులో పోలీసుల బందోబస్తు నడుమ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.
ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు
హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యాల సాధనకు 2026లో మరిన్ని అడుగులు పడాలి: సీఎం చంద్రబాబు

