తెలంగాణలో ఇకపై డీలర్ల వద్దే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ - ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ
వాహన కొనగోలుదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లకుండానే రిజిస్ట్రేషన్ - 15 రోజుల్లో అందుబాటులోకి రానున్న నూతన సాఫ్ట్వేర్ - రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సుమారు 6 నెలల సమయం

Published : January 9, 2026 at 10:46 AM IST
New Vehicle Registration In Telangana : బైకులు, కార్లు, వ్యాన్లు ఇలా వాహనాల్లో ప్రయాణించడం అంటే అందరికీ ఇష్టమే. అయితే వాటిని కొనుగోలు చేసే సందర్భంలో వాటి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇందుకు ఫుల్స్టాప్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో ఓ కొత్త సంస్కరణను గురువారం ప్రారంభించింది. నూతనంగా వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేసే వారు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ల చేసుకునే విధానం అమలుకు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే,
సంస్కరణకు శ్రీకారం : కొత్తగా వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేసే సందర్భంలో రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అవసరం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం డిసెంబరు 19న రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో డీలర్ల వద్దనే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో యంత్రాంగం ఈ సంస్కరణలను చేపట్టింది.
గతంలో కార్యాలయాల చుట్టూ : రాష్ట్రవ్యాప్తంగా సగటున ప్రతి సంవత్సరం 6.03 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.75 లక్షల కార్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త వాహనం కొన్నప్పుడు షోరూం డీలర్ సిబ్బంది తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) చేస్తున్నారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో కార్యాలయానికి కొత్త వాహనం తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆపై హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు వేసుకోవడానికి మళ్లీ డీలర్ దగ్గరికి వెళ్లాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాహన్, సారథి పోర్టళ్లలో రిజిస్టర్ చేస్తూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంది.
15 రోజుల్లోగా నూతన సాఫ్ట్వేర్ : రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్ల అమలు చేయనున్న నూతన విధానాన్ని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పై డీలర్ల వద్దనే వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) డీలర్ వద్ద చేసుకునేవారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది.
అయితే కార్యాలయాల్లో అధికారులకు ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతాయన్న విమర్శలు ఉన్నాయి. దీనికి పరిష్కారంగా డీలర్ వద్దనే వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కొత్త పోర్టల్‌ను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టే అవకాశాలు ఉండడంతో వెంటనే ఈ నిబంధనలను అమలు చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు.
కొత్త వాహనాదారులు ఏం చేయాలంటే :
అధీకృత డీలర్ వద్దనే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయాలంటే వివిధ రకాల పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఇన్వాయిస్
- ఫారం - 21 (విక్రయ ధ్రువీకరణ)
- ఫారం - 22 (రోడ్డు అనుకూలత ధ్రువీకరణ)
- బీమా పత్రం
- కొనుగోలుదారుల చిరునామా ధ్రువీకరణ పత్రం
- మరో వాహనం లేదని డిక్లరేషన్
- కొనుగోలుదారుల ఫొటో, సంతకం స్కాన్ కాపీ
- వాహనం ఇంజిన్, ఛాసిస్ నంబర్ల ఫొటోలు
- అవసరం మేరకు రవాణా శాఖ నిర్దేశించే ఇతర పత్రాలు
దరఖాస్తులను పరిశీలించి : డీలర్ నుంచి వచ్చిన వాహన కొనుగోలుదారుల దరఖాస్తులను రిజిస్టరింగ్ అథారిటీ/ అదనపు రిజిస్టరింగ్ అథారిటీ పరిశీలించి నిబంధనల ప్రకారం వారి సంబంధిత పత్రాలను ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తుంది. రిజిస్ట్రేషన్ పత్రాన్ని (ఆర్సీ) స్పీడ్ పోస్ట్ ద్వారా కొనుగోలుదారులకు పంపిస్తారు. అధీకృత డీలర్ల వద్ద ఉన్న వాహనాల నిల్వలపై వెహికల్ ఇన్స్పెటర్/ ఆర్టీవో/ డీటీసీ/ జేటీసీ/ రవాణా కమిషనర్ ఎప్పుడైనా తనిఖీలు చేపట్టవచ్చు.
కారు ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.1.17 కోట్లు- దేశంలోనే అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్

