ETV Bharat / state

దుర్గగుడికి మహర్దశ - దశాబ్దం తర్వాత నూతన అన్నప్రసాద, లడ్డూ పోటు భవనాలు ప్రారంభం

కనకదుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం కొత్తగా అన్నప్రసాద, లడ్డూ పోటు భవనాలు - అధునాతన భవనాలు మొత్తం రూ.52.50 కోట్ల వ్యయంతో నిర్మాణం

రూ.52.50 కోట్లతో కనకదుర్గ ఆలయంలో భారీ అన్నప్రసాద, లడ్డూ పోటు భవనాలు ప్రారంభం
రూ.52.50 కోట్లతో కనకదుర్గ ఆలయంలో భారీ అన్నప్రసాద, లడ్డూ పోటు భవనాలు ప్రారంభం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 21, 2026 at 10:24 PM IST

2 Min Read
Choose ETV Bharat

Kanakadurga Temple Annaprasada Building : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం కొత్తగా నిర్మించిన అన్నప్రసాద, లడ్డూ పోటు భవనాలను అట్టహాసంగా ప్రారంభమైంది. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఈ అధునాతన భవనాలను మొత్తం రూ.52.50 కోట్ల వ్యయంతో నిర్మించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్‌ యార్లగడ్డ వెంకటరావు, ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఇతర పాలకవర్గ సభ్యులు, దేవాదాయశాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ తదితరులు శాస్త్రోక్తంగా పూజలు చేసి భక్తులకు అంకితం చేశారు. రూ.26 కోట్లతో 58వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం, రూ.26.50 కోట్లతో 38వేల చదరపు అడుగుల్లో శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనం నిర్మించారు.

దుర్గగుడికి మహర్దశ - దశాబ్దం తర్వాత నూతన అన్నప్రసాద, లడ్డూ పోటు భవనాలు ప్రారంభం (ETV Bharat)

ఆలయ అభివృద్ధే లక్ష్యం : ఆలయ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని అత్యున్నత పరిశుభ్రతా ప్రమాణాలతో ఈ రెండు భవనాల్లో త్వరలోనే యాంత్రీకృత వంటశాలలను అందుబాటులోకి తెస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కుమ్మరిపాలెం నుంచి 700 మీటర్ల మేర రెండో ఘాట్ రోడ్డు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కుమ్మరిపాలెంలోని 3 ఎకరాల టీటీడీ స్థలంలో 15 వేల మంది భక్తులకు ఉపయోగపడేలా మల్టీ లెవల్ పార్కింగ్, వసతి గదులతో కూడిన ఏడంతస్తుల భవనం నిర్మించనున్నట్లు మంత్రి ఆనం తెలిపారు.

గంటకు 60 వేల లడ్డూలు : దుర్గాఘాట్ సమీపంలో నూతన కేశఖండనశాల, ఘాట్ రోడ్డు మొదటి మలుపు వద్ద 25 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఆనం వివరించారు. కొత్త ప్రసాదం పోటు ద్వారా గంటకు 60 వేల లడ్డూలు తయారవుతాయని, అలాగే అన్నదాన సత్రంలో ఒకేసారి పది వేల మంది వరకు ఒక విడతలో 800 మంది నుంచి వెయ్యి మంది భోజనం చేసేలా అధునాతన సౌకర్యాలు కల్పించినట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. కొత్త రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో అమ్మవారి ఆలయం ప్రత్యేక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు.

"కనకదుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద, లడ్డూ పోటు భవనాలను కొత్తగా నిర్మించడం జరిగింది. అలాగే కుమ్మరిపాలెం నుంచి 700 మీటర్ల మేర రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు." - ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి

శరవేగంగా నిర్మాణాలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతోనే ఈ నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. గత నాలుగు నెలలుగా రాష్ట్రంలోని దేవాలయాల్లో దుర్గమ్మ గుడి ప్రథమ స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇప్పటి నుంచే పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ఆనం, ఎంపీ కేశినేని చిన్ని, పాలకమండలి సభ్యులు భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం ప్రసాద కౌంటర్‌లో మంత్రి స్వయంగా నగదు చెల్లించి అమ్మవారి లడ్డూను కొనుగోలు చేశారు.

రైతు కూలీల కొరతకు చెక్ పెట్టిన యువకుడు - డ్రోన్ బుకింగ్​తో ఈజీగా పొలంలో పిచికారీ

శరవేగంగా రాజధాని అమరావతి పనులు - ప్రతి నెలా ఒక్కో టవర్ నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ