ETV Bharat / state

రంగారెడ్డిలో మద్యం తాగి పరీక్షకు వచ్చిన స్టూడెంట్ - గుర్తించి వెనక్కి పంపిన అధికారులు

దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్ష - రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో నీట్​ ఎగ్జామ్​ రాసిన విద్యార్థులు - రంగారెడ్డి జిల్లా శేరిగూడలో మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థి

NEET Exam 2026
ముగిసిన నీట్​ పీజీ 2026 పరీక్ష (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : August 30, 2026 at 12:33 PM IST

|

Updated : August 30, 2026 at 6:23 PM IST

1 Min Read
Choose ETV Bharat

NEET Exam 2026 : నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 2,73,183 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 1,300 కేంద్రాల్లో ఎగ్జామ్​ నిర్వహించారు. ఇక తెలంగాణలో 17,627 మంది దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగానూ 56 కేంద్రాల్లో నీట్‌ ప్రశాంతంగా ముగిసింది.

రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఓ విద్యార్థి మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతడిని సిబ్బంది గుర్తించి వెనక్కి పంపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యార్థి కోసం గ్రీన్ ఛానల్ : గచ్చిబౌలి ట్రాఫిక్‌లో చిక్కుకున్న నీట్ పిజి విద్యార్థి వికాస్​ను రాయదుర్గం పోలీసులు నిమిషాల్లో ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చారు. ఉదయం మారథాన్ రన్​లో భాగంగా గచ్చిబౌలి - రాయదుర్గం మార్గంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వికాస్​ ట్రాఫిక్ చిక్కుకుపోవడంతో సైబరాబాద్ పోలీసులు ఆయన కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. మారథాన్ ట్రాఫిక్‌ను దాటుకుంటూ రాయదుర్గం పోలీసులు గ్రీన్ ఛానెల్ ద్వారా వికాస్​ను ఎగ్జామ్ సెంటర్​ వద్దకు చేర్చారు. గచ్చిబౌలి - రాయదుర్గం మార్గంలో మారథాన్ రన్ ఉన్నందున ట్రాఫిక్ ఉంటుందని సైబరాబాద్ పోలీసులు ముందుగానే ఊహించారు. ఎవరైనా ట్రాఫిక్​లో చిక్కుకుపోతే కాల్ చేసేందుకు నెంబర్​ కూడా ఏర్పాటు చేశారు.

మంథని జేఎన్టీయూలో నీట్ పీజీ పరీక్ష : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని మంథని జేఎన్టీయూ కళాశాలలో నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మంథని జేఎన్టీయూ కళాశాలలో 100 మంది విద్యార్థులకు గాను 98 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులను ఉదయం 7:30 నుంచి 8:45 వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. విద్యార్థుల ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు, ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, అడ్మిట్ కార్డును క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.

Last Updated : August 30, 2026 at 6:23 PM IST