వైద్యం-సంగీతంతో ఆధునిక చికిత్స విధానాలు - ప్రపంచంలోనే తొలిసారి గ్రంథం
ఆయా అంశాలతో ప్రపంచంలోనే తొలిసారి ఓ గ్రంథాన్ని విడుదల - మానవ శరీరంలో వెన్నుపూస 'వీణ’ను పోలి ఉంటుందని నిరూపణ - దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కచేరీలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 1:38 PM IST
Medical Research on Injuries of Instrumentalists : ఆయన వృత్తి వైద్యం. ప్రవృత్తి వీణా వాయిద్యం. వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ జాతీయ స్థాయి గుర్తింపు పొందారు ఆయన. ఈ రెండింటినీ కలిపి ఆధునిక చికిత్స విధానాలపై పరిశోధనలు చేశారు. శాస్త్రీయంగా నిరూపించారు. ఆయా అంశాలతో ప్రపంచంలోనే మొట్ట మొదటిసారి ఓ గ్రంథాన్ని విడుదల చేశారు. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన రేడియాలజిస్ట్ డాక్టర్ భమిడిపాటి కనకదుర్గాప్రసాద్.
కుటుంబ నేపథ్యం: విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల (AMC) వైస్ ప్రిన్సిపల్‌గా పని చేసిన డాక్టర్ బీఎన్వీ ప్రసాద్, డాక్టర్ బి. రాజకమల దంపతుల కుమారుడు కనక దుర్గాప్రసాద్. ఆయన 6వ ఏట నుంచి సంగీతం నేర్చుకుని, వీణపై సాధన చేశారు.
దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కచేరీలు: ఆసక్తిని గమనించిన తండ్రి వీణా వాయిద్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఎంబీబీఎస్‌లో సీటు సాధించడానికి ముందే ఆయన ఆకాశవాణిలో జాతీయ స్థాయి ఆర్టిస్ట్‌గా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా కచేరీలు ఇచ్చారు.
ఎంబీబీఎస్ చదువుతూనే వాయిద్యంలోనూ ప్రతిభ: ఏఎంసీలో ఎంబీబీఎస్ చదువుతూనే, అభిరుచి మేరకు వీణా వాయిద్యంలోనూ ప్రతిభ చూపేవారు. అక్కడే రేడియాలజీ విభాగంలో పీజీ కోర్సు పూర్తి చేశారు. రేడియాలజిస్టుగా స్థిరపడ్డారు. విశాఖలోని గీతం వర్సిటీలో రేడియాలజీ విభాగం ఆచార్యునిగా సుదీర్ఘ కాలం పని చేశారు. ప్రస్తుతం ఎన్ఆర్ఐ వైద్య సంస్థలో రేడియాలజీ విభాగాధిపతిగా, ప్రొఫెసర్‌గా విశేష సేవలు అందిస్తున్నారు. దుర్గా ప్రసాద్ భార్య డాక్టర్ ఇందిర ప్రసూతి వైద్య నిపుణురాలిగా పని చేస్తున్నారు.
మానవ శరీరంలో వెన్నుపూస 'వీణ' పోలి: నిత్యం రేడియాలజీ విభాగంలో అనేక మంది బాధితుల స్కానింగ్‌లు పరిశీలించి సమస్యను నిర్ధారిస్తుంటారు. అలా సంగీత వాయిద్య కళాకారులు ఏళ్ల తరబడి ఎదుర్కొనే అంతర్గత అనారోగ్య సమస్యలకు శాస్త్రీయ పద్ధతిలో వైద్య విధానాలు తీసుకు రావాలని సంకల్పించారు. అలా అనేక పరిశోధనలు చేసిన ఆయన మానవ శరీరంలో వెన్నుపూస 'వీణ'ను పోలి ఉంటుందని నిరూపించారు. దీనికి సంబంధించి అనేక మంది సుప్రసిద్ధ కళాకారుల నుంచి వివరాలు సేకరించారు. వాటికి వైద్యపరమైన అంశాలు జోడించి విశ్లేషించారు. అలా ఆధునిక చికిత్స విధానాలు వెలుగులోకి తీసుకు వచ్చారు.
జాతీయ స్థాయిలో ప్రాచుర్యం: తాజాగా వాటిపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా 'ఇన్జ్యూరీస్ ఇన్ మ్యుజిషియన్స్ - ఇమేజింగ్ అండ్ మేనేజ్‌మెంట్' అనే పుస్తకాన్ని వైద్య పరిభాషలో రచించారు. ఇప్పుడా గ్రంథం ఎంతో మంది వైద్యుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పుస్తకానికి ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ (IRIA) జాతీయ కమిటీ గుర్తింపు లభించడంతో జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది.
ఈ గ్రంథానికి ఆయన కుమార్తె వీణాధరి (US), అంతర్జాతీయ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ బొచ్చ సురేష్ (UK) సహ రచయితలుగా ఉన్నారు. ఇప్పుడు గర్భిణులకు మ్యూజిక్ వినిపిస్తూ, గర్భంలో ఉండే శిశువుల్లో వచ్చే మార్పులను రికార్డు చేస్తున్నామని డాక్టర్ దుర్గాప్రసాద్ అన్నారు. అవి భవిష్యత్తులో బిడ్డల పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై విశ్లేషిస్తామని చెప్పారు.
అరుదైన వస్తువుల సేకరణ హాబీ - ఇంటినే మ్యూజియంగా మార్చేసిన డాక్టర్లు
3 దశాబ్దాలుగా పాడి రైతుల జీవితాల్లో వెలుగులు - జాతీయ అవార్డు అందుకున్న 'సామాజిక' యాక్టర్

