దేశీయ రోబోటిక్ హ్యాండ్ - స్వదేశీ టెక్నాలజీతో జెట్ ఇంజిన్ : ఆకట్టుకున్న నేషనల్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్
టీ వర్క్స్ ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ - రక్షణ రంగంలో పనిచేసే స్టార్టప్‌లను ప్రోత్సహించే కార్యక్రమం - స్టాళ్లను సందర్శించిన పలు కంపెనీల నిర్వాహకులు

Published : July 9, 2026 at 2:18 PM IST
|Updated : July 9, 2026 at 2:23 PM IST
National Defence Innovation Conclave : స్వదేశీ సాంకేతికతను రక్షణ రంగంలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నేషనల్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ నిర్వహించారు. టీ-వర్క్స్ వేదికగా నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఎంపికైన డిఫెన్స్, డీప్‌టెక్ స్టార్టప్‌లు తమ కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించాయి. భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
పాల్గొన్న 42 స్టార్టప్ కంపెనీలు : రక్షణ రంగంలో పని చేసే అంకుర పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా టీ వర్క్స్ ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ఏర్పాటు చేశారు. టీ వర్క్స్‌లో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో 42 స్టార్టప్ కంపెనీలు పాల్గొన్నాయి. డ్రోన్లు, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, మిలిటరీ కమ్యూనికేషన్, స్మార్ట్ సెన్సర్లు, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలను స్టార్టప్ కంపెనీలు ప్రదర్శించాయి. యుద్ధ సమయంలో వినియోగించే డ్రోన్లు ప్రదర్శనకు ఉంచారు. రక్షణ శాఖ అవసరాలకు తగిన విధంగా తమ ఉత్పత్తులు ఉన్నాయని స్టార్టప్ నిర్వాహకులు తెలిపారు.
- స్వదేశీ టెక్నాలజీతో జెట్ ఇంజిన్ : దేశీయ సాంకేతికతతో కావాల్సిన జెట్ ఇంజిన్, క్రూజ్ మిసైల్, అన్మ్యాన్డ్ ఏరియాల్ సిస్టం (మనిషి లేకుండా) అభివృద్ధి చేస్తున్నట్లు పనీనియన్ ఏరోస్పేస్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రాఘవేంద్ర తెలిపారు. మొదటి ప్రైవేటు సంస్థ జెట్ ఇంజిన్‌ను రూపొందించినట్లు చెప్పారు. టీ వర్క్స్ సహకారంతో ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్ కంట్రోల్ చిప్స్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్నారు.
- సరిహద్దుల్లో నిఘా పెంచుతుంది : సెంటినెల్ఎక్స్ వ్యవస్థాపకుడు సీఈవో ఇమ్రాన్ అహ్మద్ పెరిమీటర్ డిటెక్షన్ సిస్టంను రూపొందించినట్లు తెలిపారు. నిర్ధారిత సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెడితే భద్రతా సిబ్బందికి సమాచారాన్ని చేరవేస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తుంది. వినకపోతే కాల్పులు జరుపుతుంది.
- దేశీయ రోబోటిక్ చేయి : స్వదేశీ పరిజ్ఞానంతో ఓ కంపెనీ ఫ్రిక్షన్ రోబోటిక్ చేయిని రూపొందించింది. రెండు అడుగులు ముందుకు సాగుతూ 2.5 కేజీల వరకు బరువును ఎత్తగలుగుతుంది. ధీనిని వెల్డింగ్, అల్ట్రాసౌండ్ వంటి అవసరాలకు వాడొచ్చు.
- నేర పరిశోధనలో కీలమైనది : ఫోసిక్ అనే అంకుర సంస్థ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ వ్యవస్థ రూపొందించింది. ఇది నేర పరిశోధనలో కీలకంగా నిలుస్తుంది. ఒకే పరికరం 9 రకాల లైట్లను ప్రసారం చేస్తుంది. నేరం జరిగిన ప్రదేశంలో ఈ లైట్లు పడినట్లయితే వేలిముద్రలు, మరకలు కనిపిస్తాయి.
గత ఎనిమిది సంవత్సరాలుగా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అవసరాల కోసం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశాం. టీ వర్క్స్ ఆధ్వర్యంలో డిఫెన్స్, ఎరోస్పేస్ కస్టమర్స్‌తో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు
- రఘు ఎడ్ల, పనీయన్ కంపెనీ
రక్షణ రంగంలో ఉపయోగించే డ్రోన్ల ప్రదర్శన : త్రివిధ దళాలకు ఉపయోగపడే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా డ్రోన్లు రూపొందించారు. గతంతో పోలిస్తే ఈ రంగంలో అంకుర పరిశ్రమల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇది దేశ భద్రతతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. కొన్ని స్టార్టప్ కంపెనీలు సొంతంగా ఇలాంటి ఉత్పత్తులు రూపొందిస్తుండగా, మరికొన్ని కంపెనీలు టీ వర్క్ వేదికగా పరిశోధనలు చేస్తున్నాయి. నేషనల్ డిఫెన్స్ కాంక్లేవ్‌లో రక్షణ రంగానికి చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొని స్టాళ్లను సందర్శించారు.
మంచి ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా స్టార్టప్ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. టీ వర్క్స్ వేదికగా నిర్వహించిన ఈ సదస్సులో పలు కళాశాలలకు చెందిన ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సైతం పాల్గొని రక్షణ రంగ ఉత్పత్తుల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
డ్రోన్ హార్ట్ ఇది. డ్రోన్ టేకాఫ్ నుంచి ఎక్కడికైనా వెళ్లడానికి, ఏదైనా అత్యవసర సమయంలో మెడికల్ హెల్త్ కేర్ ఇవ్వడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా ఇందులో ఉంటుంది - పల్లాటి శ్రీనివాస్, డ్రోన్ పరిశోధకుడు

