ప్రతి విద్యార్థి ఆంగ్లంలో పట్టు సాధించాలి - కూర్లపల్లి బడిలో నారా భువనేశ్వరి సందడి
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో సీఎం సతీమణి పర్యటన - రూ. 24 లక్షల హెరిటేజ్ సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ బడి పునరుద్ధరణ - కొత్త రూపుదిద్దుకున్న భవనాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 25, 2026 at 10:39 PM IST
Nara Bhuvaneshwari School Visit : శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. లేపాక్షి మండలం కూర్లపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆమె సందర్శించారు. హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ బడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కొత్త భవనాన్ని భువనేశ్వరి తన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. పిల్లల ప్రతిభను మెచ్చుకున్నారు. ప్రతి విద్యార్థి ఆంగ్ల భాషలో మాట్లాడే నైపుణ్యం పెంచుకోవాలని ఆమె సూచించారు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శిథిలావస్థ నుంచి సరికొత్త రూపు : కూర్లపల్లి ప్రభుత్వ పాఠశాల భవనం గతంలో శిథిలావస్థకు చేరుకుంది. విద్యార్థులు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని గమనించిన హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది. తమ సంస్థ 'సీఎస్ఆర్' నిధుల నుంచి అక్షరాలా రూ. 24 లక్షలు కేటాయించింది. ఆ నిధులతో పాఠశాల భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించారు. ఇప్పుడు ఆ బడి సరికొత్త రూపు సంతరించుకుంది. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శనమిస్తోంది.
ఉత్సాహంగా ప్రారంభోత్సవం : ఆధునికీకరించిన పాఠశాలను నారా భువనేశ్వరి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పల్లెటూరి బడికి కొత్త కళ రావడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థ చేసిన సాయాన్ని గ్రామస్థులు కొనియాడారు. అనంతరం భువనేశ్వరి తరగతి గదులను స్వయంగా పరిశీలించారు. బడిలో కల్పించిన మౌలిక వసతుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ఆంగ్లంపై పట్టు సాధించాలి : పాఠశాల ప్రారంభోత్సవం తర్వాత భువనేశ్వరి విద్యార్థులతో సమావేశమయ్యారు. వారితో ఎంతో సరదాగా గడిపారు. చిన్న పిల్లలతో కలిసిపోయి ఆత్మీయంగా మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. ఆంగ్లంలో మంచి నైపుణ్యం సాధిస్తే భవిష్యత్తులో ఉన్నత అవకాశాలు వస్తాయని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
విద్యాశాఖ మంత్రి ఎవరు? : విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో భువనేశ్వరి వాళ్లకు కొన్ని ప్రశ్నలు వేశారు. పిల్లల సాధారణ జ్ఞానాన్ని (జనరల్ నాలెడ్జ్) సరదాగా పరీక్షించారు. "మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరో మీకు తెలుసా?" అని ఆమె పిల్లలను అడిగారు. విద్యార్థులు "నారా లోకేశ్ బాబు" అని సమాధానం ఇచ్చారు. పిల్లల చురుకుదనాన్ని చూసి భువనేశ్వరి ఎంతో సంతోషించారు. విద్యార్థులందరికీ స్వీట్ బాక్సులు స్వయంగా అందజేసి ఉత్సాహపరిచారు.
ఉత్తమ పౌరులుగా ఎదగాలి : చిన్నారులకు భువనేశ్వరి పలు విలువైన సూచనలు చేశారు. పిల్లలంతా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. భవిష్యత్తులో మన భారతదేశం గర్వించదగ్గ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఆశీర్వదించారు. పిల్లలందరూ ఎప్పుడూ క్రమశిక్షణతో మెలగాలని చెప్పారు. భువనేశ్వరి రాకతో కూర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
"ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలను మా హెరిటేజ్ కంపెనీ అడాప్ట్ చేసుకుని పాఠశాలను బాగు చేస్తున్నాం. ఇక్కడ మేం స్కూల్ తీసుకున్నప్పుడు పిల్లలకు సరైన సదుపాయాలు లేవు. మన కంపెనీ చుట్టూ ఉన్న గ్రామాలను కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన లాభాలు కంపెనీకే కాకుండా సమాజానికి, ప్రజలకు ఉపయోగపడాలి. ఈ స్కూల్లోని పిల్లలందరికీ ఏమీ సదుపాయాలు కావాలో అవన్నీ కల్పిస్తున్నాం. 24 లక్షల రూపాయలతో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం. "-నారా భువనేశ్వరి, సీఎం చంద్రబాబు సతీమణి
'కొడుకు ఎంత ఎదిగినా తల్లికి పసిబిడ్డే' - లోకేశ్‌కు భువనేశ్వరి బర్త్‌డే విషెష్
నారా భువనేశ్వరి చొరవతో వేగంగా నిమ్మకూరు అభివృద్ధి - గ్రామస్థుల హర్షం

