ETV Bharat / state

ఏడు నెలల శిక్షణతో జాబ్​ పక్కా! - దరఖాస్తుకు ఇంకో ఆరు రోజులు మాత్రమే సమయం

నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కోర్సులను అందిస్తున్న న్యాక్ - ఆయా కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించి యువత ప్రవేటు, ప్రభుత్వ రంగాల్లో నిలదొక్కుకునేలా శిక్షణ - ఎలా ధరఖాస్తు చేసుకోవాలంటే?

Nac Skill Development Courses
Nac Skill Development Courses (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : January 7, 2026 at 9:02 AM IST

3 Min Read
Choose ETV Bharat

Nac Skill Development Courses : ఇటీవల కాలంలో ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్, డిప్లొమో, డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. అయితే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మాత్రం వెనుకబడుతున్నారు. దీనికి ముఖ్య కారణం వారికి సరైన నైపుణ్యాలు లేకపోవడం. దీంతో అలా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు శిక్షణనిచ్చేందుకు ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అవగాహన లేమి కారణంగా యువత అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.

జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్​) ఎంతోమంది నిరుద్యోగులకు నాణ్యమైన శిక్షణను అందించి వారి భవిష్యత్​కు బాటలు వేస్తోంది. ఈ సంస్థ పలు కోర్సుల్లో యువతకు శిక్షణను అందిస్తోంది. అర్హత, కోర్సుల వివరాలు? ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నిరుద్యోగ యువతకు వరం : ఎంతోమంది నిరుద్యోగ యువతకు జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్​) పలు నైపుణ్య శిక్షణ కోర్సులతో ఉపాధి మార్గం చూపుతోంది. యువతకు ఆయా కోర్సుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి స్వయం ఉపాధి, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నిలదొక్కుకొనే విధంగా చూస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ న్యాక్‌లో శిక్షణ పొందితే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన(డీడీయూజీకేవై) ద్వారా ఏడు నెలల పాటు శిక్షణ ఇస్తారు.

ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ మిషన్‌ సహకారంతో గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇటీవల కాలంలో ఏ కార్పొరేట్​ జాబ్​కు అయినా సరే సాఫ్ట్​స్కిల్స్​, కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా అవసరం. వీటిపై ఇక్కడ శిక్షణ తీసుకునే యువతకు ప్రత్యేకంగా తర్ఫీదునిస్తారు. తద్వారా ఉద్యోగ నియామకాల్లో నిరుద్యోగ అభ్యర్థులు ఎంపికయ్యేందుకు అవకాశం ఉంటుంది.

ఏం చేయాలంటే : న్యాక్​ అందిస్తున్న ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థి ఆధార్‌, రేషన్‌కార్డుతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ, విద్యార్హత పత్రాలు, బ్యాంకు అకౌంట్​ జిరాక్స్‌, 4 పీపీ ఫొటోలతో నేరుగా ఎన్‌ఏసీ యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, బోయపల్లికి వెళ్లే దారిలో సోమేశ్వర కాలనీలోని కేంద్రంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. మహబూబ్​నగర్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని న్యాక్‌ సంస్థ ఏడీఈ శివశంకర్‌ వెల్లడించారు.

భోజనం వసతి : ఆయా కోర్సుల్లో శిక్షణకు ఎంపికైన యువతీ, యువకులకు ఏడు నెలల పాటు ఉచిత భోజనం వసతిని కల్పిస్తారు. రోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలు పెంచుకోవాలని కోరుతున్నారు. ల్యాండ్ సర్వేయర్​, సూపర్​వైజర్ స్ట్రక్చర్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ తదితర విభాగాల్లో శిక్షణను అందిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. శిక్షణకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని న్యాక్​ కేంద్రం నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని కోరుతున్నారు. ఈ నెల 20వ తేదీనుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతున్నాయి.

ముఖ్యమైన వివరాలు ఇవే :

  • దరఖాస్తులకు చివరి తేదీ: ఈ నెల 13
  • తరగతులు ప్రారంభం : ఈ నెల 20 నుంచి
  • కేంద్రం : నవాబ్‌పేట దారిలోని బోయపల్లి పరిధిలోని న్యాక్‌ కేంద్రం
  • అర్హులు: తెల్లరేషన్‌ కార్డు ఉండి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న గ్రామీణ యువతీ, యువకులు
  • ఏయే కోర్సుల్లో శిక్షణ : ల్యాండ్‌ సర్వేయర్‌, సూపర్‌వైజర్‌ స్ట్రక్చర్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబింగ్‌
  • సంప్రదించాల్సిన నంబర్లు : 79892 00412, 99085 59685

ఇక్కడ శిక్షణ తీసుకుంటే మీకు ఉపాధి గ్యారంటీ - ట్రైనింగ్​ కోర్సులు ఇవే

డిగ్రీలు కాదు జాబ్​నే ముఖ్యం - అక్కడ ఏడాదిలో 1000 మందికి ట్రైనింగ్​ పూర్తి