నిందితుడిని పట్టించిన 'గోరు' - వెలుగుచూసిన రెండు హత్య కేసులు
ఈనెల 5వ తేదీన ఓ వృద్ధురాలిని హత్య చేసిన దుండగులు - పోలీసులు హత్య కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు - చాకచక్యంగా నిందితుడిని నిర్థారించిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 2:21 PM IST
Murder Case Mystery Solved with Nail at Nellore District: ఎంతటి వారైనా తప్పు చేస్తే పట్టుబడతారు. దొంగతనం, హత్య కేసుల్లో నిందితులను పోలీసులు గుర్తించడానికి సాధారణంగా హత్య ప్రాంతంలో దొరికే వస్తువులే ఏ కేసులోనైనా కీలక ఆధారాలు అవుతాయి. ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన కేసులు సైతం వెలుగులోకి వస్తాయి. ఇటీవల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో హత్య కేసు సంచలనం సృష్టించింది. హత్య ప్రాంతంలో దొరికిన గోరు అతడిని పోలీసులకు పట్టించింది. విచారణలో అతడు చేసిన మరో హత్య ఘటన విషయం తెలిసి అందరూ విస్తుబోయారు. ఒక్క గోరు రెండు హత్యలకు కీలక ఆధారమైంది.
మృతదేహం వద్ద దొరికిన వేలి గోరు ఆధారంగా ఈ నెలలో జరిగిన, 3 ఏళ్ల కిందట జరిగిన హత్యల కేసుల్లోని నిందితుడిని పోలీసులు చాకచక్యంగా నిర్ధారించారు. ఆ వివరాలను నిన్న (గురువారం) జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అజిత వేజెండ్ల వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే: కొడవలూరు మండలం కొత్త వంగల్లుకు చెందిన పేట కోటేశ్వరమ్మ (68) ఒంటరిగా నివాసం ఉంటుంది. ఆమె కుమారుడు శ్రీనివాసులు ఉద్యోగ రీత్యా నగరంలో ఉంటున్నారు. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు కోటేశ్వరమ్మను హత్య చేశారు. ఆమె మెడలోని బంగారు సరుడును దోచుకెళ్లారు. కొడవలూరు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐ సురేంద్రబాబు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
వెలుగులోకి మరుగున పడిన కేసు: ఇదే గ్రామంలో 2022, జూన్ 2న జరిగిన మరో హత్య వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే గోలి సుశీలమ్మ మృతి చెందారు. ఈమె చనిపోయి దాదాపు 3 ఏళ్లు అవుతోంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దాంతో ఈ హత్య కొన్ని ఏళ్లుగా మరుగున పడింది.
ఇటీవల చోటు చేసుకున్న కోటేశ్వరమ్మ హత్య కేసు విచారణలో భాగంగా ఈ కేసుకు సంబంధించి పలు విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రంజిత్ కుమారే సుశీలమ్మ సమీప బంధువైన ఓ మహిళతో కలిసి హత్య చేసినట్లు తాజా విచారణలో వెల్లడైంది. దీంతో అందరూ విస్తుబోయారు.
జల్సాలతో అప్పులపాలై: హత్య జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేవు. మృతదేహం మెడ వద్ద పొడవైన వేలి గోరు లభించింది. దాన్ని పోలీసులు సేకరించారు. వెంటనే కొత్తవంగల్లులో పొడవాటి గోర్లు ఎవరికి ఉంటాయో అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. గ్రామంలో వారిని ఆరా తీశారు. స్థానికంగా ఉంటున్న రంజిత్‌ను పోలీసులు గుర్తించారు. అనుమానంతో అతడిని విచారించారు. వారు అనుమానించినట్లుగానే అతడి ఎడమ చేతి బొటన వేలి గోరు పెద్దగా ఉంది. చిటికిన వేలి గోరు విరిగినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద దొరికిన దానితో సరిపోల్చారు. హత్య చేసింది అతడేనని నిర్ధారణ అయింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గొప్పల కోసం జల్సాలకు అలవాటు పడి, చివరకు అప్పులపాలై ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న అతడు కోటేశ్వరమ్మను రాయితో హతమార్చినట్లు తేల్చారు.
మార్కాపురంలో దారుణం - కుమార్తె సాయంతో భర్తను హతమార్చిన భార్య
నంద్యాల జిల్లాలో దారుణం- ముగ్గురు పిల్లల్ని చంపి ఆపై తండ్రి ఆత్మహత్య

