చదివింది న్యాయశాస్త్రం - చేసేది మాత్రం చట్టవిరుద్ధ లావాదేవీలు
చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో తన గ్యాంగ్‌తో మ్యూల్ ఖాతాలు- త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆశతో అడ్డదారి - మ్యూల్ అకౌంట్స్ కేసు సూత్రధారి రాజా తీరిది

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 11:42 AM IST
Mule Accounts Scam Case Updates : అతను చదివించి న్యాయశాస్త్రం. కానీ చేసేది మాత్రం చట్ట విరుద్ద లావాదేవీల వ్యవహారం. డిజిటల్ మార్కెటింగ్ పేరుతో తిరుగుతుంటాడు. కొంత సమయం సీనియర్ లాయర్ వద్ద ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇటీవల కృష్ణా జిల్లా యనమలకుదురులో వెలుగు చూసిన అద్దె ఖాతాల కేసులో సూత్రధారి సుబ్రమణి రాజా వెంకట్ భిన్న శైలి ఇది.
చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో తన గ్యాంగ్‌తో మ్యూల్ ఖాతాలు తెరిపించి, వాటి ద్వారా చట్ట వ్యతిరేక లావాదేవీలు చేయిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు బెజవాడ పోలీసులు చెన్నై వెళ్లగా, వారికి నిరాశే ఎదురైంది. రెండు రోజులు ఉన్నా అతడి ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి బయలుదేరారు.
త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆశతో : చెన్నై నగరం తిరివొత్తియూర్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు వెంకట్. వీరిది పేద కుటుంబం. తండ్రి తాగుడుకు బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా ఇంటికి పరిమితమయ్యేవాడు. దీంతో వెంకట్ త్వరగా డబ్బు సంపాదించాలి అనే ఆశతో అడ్డదారి తొక్కాడు. చెన్నైలో కొందరితో కలసి అద్దె ఖాతాల (మ్యూల్ అకౌంట్) లావాదేవీలు చేయడం ప్రారంభించాడు.
తనకు సమీప బంధువులైన స్టీవెన్, రవికుమార్ సాయంతో విజయవాడలో కథ నడిపించేవాడు. వీరు ఇక్కడ సైబర్ పోలీసులకు పట్టుబడడంతో రాజా వెంకట్ అప్రమత్తమయ్యాడు. దీంతో ఈ నెల 9వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. నిందితుడి ఇంటికి పోలీసులు వెళ్లినా ఉపయోగం లేకపోయింది. కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో కలసి పోలీసుల వద్దకు వచ్చారు. వారం రోజుల సమయం ఇస్తే వెంకట్‌ను తీసుకు వచ్చి అప్పగిస్తామన్నారు.
పెద్ద మొత్తాల్లో లావాదేవీలు జరగలేదు : లావాదేవీలు జరిగిన కొన్ని ఖాతాల వివరాలు బ్యాంకుల నుంచి వచ్చాయి. ఈ స్టేట్మెంట్లను పోలీసులు వడపోస్తున్నారు. వాటిల్లో పెద్ద మొత్తాల్లో లావాదేవీలు జరగలేదని తెలిసింది. ఓ అకౌంట్లో గరిష్టంగా రూ.16 లక్షలు మాత్రమే జరిగినట్లు గుర్తించారు. నిందితుడు ఈ వ్యవహారాల్లో రెండో అంచెలో ఉన్నట్లు తేలింది. ఇతని వెనుక ఇంకా కొందరు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇతను దొరికితే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవల సైబర్ పోలీసులు అరెస్టు చేసిన మ్యూల్ అకౌంట్స్ గ్యాంగ్ మూలాలు చెన్నైలో తేలుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రవి కుమార్, స్టీవెన్, బాజి, దుర్గా ప్రసాద్‌లు అరెస్టు చేశారు. మ్యూల్ అకౌంట్స్ కేసు సూత్రధారి రాజా కోసం పోలీసుల ప్రత్యేక బృందం చెన్నై వెళ్లగా, అతడు అప్పటికే అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నిందితుల నుంచి వివరాలు సేకరించాడు. వాటి ఆధారంగా చెన్నైకి సుబ్రమణి రాజా వెంకట్, ఆకాశ్‌కు అద్దె ఖాతాలు చేరేవని పోలీసులు గుర్తించారు.
అయితే ఇంటి పరిసర ప్రాంతాల్లో రాజా వెంకట్ గురించి విచారించగా తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని అందరినీ నమ్మించినట్లు తెలిపారు. కుటుంబం వద్ద కూడా అసలు విషయం తెలియకుండా జాగ్రత్త తీసుకున్నట్లు దర్యాప్తులో తెలిసింది. ప్రాంతాల వారిగా ఏజెంట్లను పెట్టి అద్దె ఖాతాలు (మ్యూల్ ఖాతాలు) పెట్టి అద్దె ఖాతాలు తెరిపిస్తున్నట్లు తేలింది. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులు చెప్పిన ఇంకో వ్యక్తి ఆకాశ్ గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు.
మ్యూల్ అకౌంట్స్ కేసులో కీలక పరిణామం - పరారైన కీలక సూత్రధారి
విజయవాడలో నొక్కేస్తారు, నేపాల్‌లో అమ్మేస్తారు - కొలిక్కి వచ్చిన సెల్ఫోన్ల చోరీ కేసు!

