ETV Bharat / state

ములకలచెరువు నకిలీ మద్యం కేసు - వెలుగులోకి కీలక విషయాలు

కోర్టు ఉత్తర్వుల మేరకు ఎక్సైజ్‌ పోలీసులు అదుపులో నలుగురు నిందితులు - పలు బ్రాండ్ల లోగోలతో మూతలను అద్దేపల్లి సోదరులకు అందజేత - విచారణలో వెల్లడి

Fake Liquor Case Updates
Fake Liquor Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 10, 2026 at 1:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

Fake Liquor Case Updates: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణలో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'తొలుత మనోజ్‌ కుమార్‌కు మూతలు సరఫరా చేశాను. అతను ఇబ్రహీంపట్నం, ములకలచెరువులోని తయారీ కేంద్రాలకు పంపించాడు. ఆ తర్వాత నేను స్వయంగా ఆర్డర్‌ తీసుకుని సరఫరా చేశా’నని నకిలీ మద్యం కేసులో నిందితుడు ధారబోయిన ప్రసాద్‌ ఎక్సైజ్ పోలీసుల విచారణలో చెప్పాడని సమాచారం. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎక్సైజ్‌ పోలీసులు నలుగురు నిందితులను కస్టడీకి తీసుకున్నారు.

విజయవాడ కారాగారంలో ఉన్న ప్రసాద్‌ను నిన్న (శుక్రవారం) ఉదయం జైలు నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తూర్పు ఎక్సైజ్‌ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. మిగిలిన నిందితులు బాలాజీ, సుదర్శన్, తలారి రంగయ్యను నెల్లూరు కారాగారం నుంచి తీసుకురావడంతో ఆలస్యమైంది. వీరు సాయంత్రం రావడంతో తొలి రోజు వీరి విచారణ సాగలేదు. ప్రసాద్‌ను ఎక్సైజ్‌ అధికారుల బృందం పలు ప్రశ్నలు సంధించింది.

బ్రాండ్ల లోగోలతో మూతలను అద్దేపల్లి సోదరులకు: మనోజ్‌తో ఎలా పరిచయమైందని ప్రశ్నించారు. అతని సోదరుడితో తనకు పరిచయం ఉందన్నాడు. అలా అతనితో పరిచయమైందని వివరించాడు. 2022 నుంచి నకిలీ మద్యం తయారీ కోసం అల్యూమినియం మూతలు సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. మనోజ్‌ సరఫరా చేయలేక తప్పుకున్న తర్వాత పలు బ్రాండ్ల లోగోలతో మూతలను అద్దేపల్లి సోదరులకు అందజేసినట్లు విచారణలో వెల్లడించాడు. సరఫరా చేసిన మూతలకు జనార్దనరావు తరఫున రవి తనకు చెల్లింపులు చేసినట్లు చెప్పినట్లు తెలిసింది. శనివారం మిగతా ముగ్గురిని లోతుగా విచారించనున్నారు.

ఇదిలా ఉండగా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, రాము, ప్రసాద్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ల పై విజయవాడ ఎక్సైజ్‌ కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును ఈ నెల 20న ఇవ్వనున్నట్లు న్యాయ అధికారి లెనిన్‌బాబు ప్రకటించారు.

  • హాజి, కట్టా రాజు, మిథున్‌ దాస్, అంత దాస్‌ బెయిల్‌ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశిస్తూ తదుపరి వాదనలకు ఈనెల 12కు వాయిదా వేశారు.
  • ఇదే కేసులో జినేష్, శిబుల కస్టడీ కోసం సిట్‌ వేసిన పిటిషన్లపై కౌంటర్ల నిమిత్తం 12కు వాయిదా పడింది.
  • అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహన్‌రావు, తలారి రంగయ్య, సుదర్శన్, బాలాజీ బెయిల్‌ పిటిషన్లపై విచారణ 19కి వాయిదా పడింది.
  • జినేష్, శిబు గురువారం బెయిల్‌ పిటిషన్లు ఫైల్‌ చేశారు. నోటీసుల నిమిత్తం ఈనెల 19కి వాయిదా వేశారు.

మరోవైపు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు తమకు తెలియదని వారితో సంబంధం లేదని జోగి సోదరులు బుకాయించినా సిట్‌ శాస్త్రీయ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీలతో పాటు సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి. ఇవి జోగి, అద్దేపల్లి సోదరుల బంధాన్ని బయట పెట్టాయి. నకిలీ మద్యం వ్యవహారంలో రమేష్, రాము ప్రధాన పాత్ర పోషించారని కోర్టులో సమర్పించిన అనుబంధ ఛార్జిషీట్‌లో సిట్‌ పేర్కొంది. ఫోన్, వాట్సప్‌ కాల్స్‌లో తరచు మాట్లాడుకునే వారని తేలింది.

కుట్రకు తెర తీశారని: ఈ కేసులో నిందితుల కాల్‌ డీటైల్‌ రికార్డ్స్‌ (CDR)ను సిట్‌ విశ్లేషించింది. ఇందులో ఎక్కువ మంది నిందితుల టవర్‌ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలోనే చూపించాయి. ఇక్కడి నుంచే నకిలీ మద్యం తయారీకి ప్రణాళిక, కుట్రకు తెర తీశారని తేలింది.

'నకిలీ మద్యం కేసులో జోగి సోదరులదే ముఖ్యపాత్ర' -ఛార్జిషీట్‌లో సిట్‌ కీలక వివరాలివే

స్వర్ణ డెవలపర్స్‌ ఖాతా నుంచి జోగి ఖాతాలోకి భారీ మొత్తాల్లో నగదు మళ్లింపులు -సిట్​ నిర్ధారణ