విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎంపీ కేశినేని చిన్ని - నూతన క్రిటికల్ కేర్ భవనాల నిర్మాణ పనుల పరిశీలన - పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 2, 2026 at 10:53 PM IST
MP Chinni Inspection Govt Hospital : విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ కేశినేని చిన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో కొత్తగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ నూతన భవనాలను ఆయన పరిశీలించి నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలోనే విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందితో కేశినేని చిన్ని మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యసేవల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఆ తర్వాత రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, తదితర వివరాలను చిన్ని అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు రోగులు, వారి సహాయకుల కోసం ఆసుపత్రిలో తగినన్ని వెయిటింగ్ హాల్స్ లేవని ఆసుపత్రి సూపరింటెండెంట్, కేశినేని చిన్ని దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చిన్ని, ఎంపీ నిధులతో ఆసుపత్రిలో రెండు వెయిటింగ్ హాళ్లను నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చిన్ని పేర్కొన్నారు. ఈ నెల 9న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విజయవాడ రానున్నారని తెలిపారు. ఆ రోజున ఆయన ఈ నూతన క్రిటికల్ కేర్ భవనాలను ప్రజలకు అంకితం చేయనున్నట్లు వివరించారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ భవనాలు ముస్తాబవుతున్నాయని చిన్ని వెల్లడించారు. నూతన క్రిటికల్ కేర్ భవనాలు అందుబాటులోకి వస్తే విజయవాడతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఇవి కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ విషయంలో వైద్యులు, సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.
అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం - జైషా అనుమతి: కేశినేని చిన్ని
కేశినేని నాని రూ.120 కోట్ల బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారు: ఎంపీ కేశినేని శివనాథ్

