ETV Bharat / state

ఎలమంచిలి రైలు ప్రమాదం - వివరాలను నోట్ రూపంలో విడుదల చేసిన రైల్వే

బీ1, ఎం2 రెండు బోగీల్లో అగ్నికీలలు - వీటితో పాటు ఎం1 బోగీ తొలగింపు - ప్రయాణికుల కోసం 3 ఏసీ కోచ్​ల ఏర్పాటు - ఘటనపై రైల్వే స్టాండింగ్​కమిటీ చైర్మన్​ రమేష్​ సమీక్ష

department report on ernakulam train accident
Railway department report on ernakulam train accident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 29, 2025 at 10:36 AM IST

2 Min Read
Choose ETV Bharat

MP CM Ramesh About Ernakulam Train Fire Accident : విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. రైల్వే శాఖ ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను నోట్ రూపంలో విడుదల చేసింది. బీ1, ఎం2 రెండు బోగీలలో అగ్నికీలలు చుట్టుముట్టాయని అందులో తెలిపారు. ప్రస్తుతం ముందు జాగ్రత్తగా చర్యగా ఎం1 బోగీని కూడా తొలగించినట్లు తెలిపారు. వీటి స్థానంలో 3 ఏసీ కోచ్​లను ఏర్పాటు చేసివట్లు పేర్కొన్నారు. ప్రయాణికులను సామర్లకోటలో ఎక్కించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రైల్వే అధికారలు స్పష్టం చేశారు.

ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు : రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్​ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదంపై స్పందించారు. రైలులో జరిగిన అగ్నిప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని ఆయన ఆవేదన చెందారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలిపారు.ఈ ఘటనపై ఎంపీ వెంటనే రైల్వే ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అగ్నిమాపక శాఖ, పోలీస్ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

అధికారులతో ఎంపీ సమీక్ష : అనకాపల్లి జిల్లా కలెక్టర్​తో కూడా ఈ ప్రమాదంపై ప్రత్యేకంగా చర్చించి, పరిస్థితిని సమీక్షించారు. గాయాలపాలైన ప్రయాణికులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైల్వే డీఆర్‌ఎంతో మాట్లాడిన ఎంపీ అగ్నిప్రమాదానికి గురై కాలిపోయిన బోగీలను అక్కడే నిలిపివేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైలు ప్రయాణాన్ని వెంటనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీ సూచనల మేరకు రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రైలు సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని ఎంపీ రైల్వే అధికారులకు సూచించారు.

టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం - వృద్ధుడు సజీవ దహనం

ఆలస్యంగా రైళ్లు : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లతో పాటు విశాఖకు రావాల్సిన మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌, పూరీ-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్‌, బెంగళూరు హంసఫర్‌, షాలిమార్‌-చర్లపల్లి(18045), విశాఖ-లింగంపల్లి (12805), విశాఖ-గుంటూరు (17240) ఎక్స్‌రైళ్లు 3-4 గంటలు ఆలస్యమయ్యాయి. విశాఖకు రావాల్సిన గోదావరి, తిరుపతి-హావ్‌డా కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎలమంచిలిలో ఆగే రైళ్లను అధికారులు విశాఖలో నియంత్రించి పంపుతున్నారు. ఎలమంచిలిలో స్టాప్‌ లేని వాటిని యథావిధిగా పంపిస్తున్నారు. వందేభారత్‌, జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు విశాఖ నుంచి యథావిధిగా బయల్దేరాయి.

అరకుకు పర్యాటకుల తాకిడి - రద్దీగా విశాఖ రైల్వేస్టేషన్​