అత్త సూటిపోటి మాటలు - 45 రోజుల పసికందును చంపేసిన తల్లి
45 రోజుల పసికందు ప్రాణం తీసిన తల్లి - ఆసుపత్రిలో వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు - మరోపక్క నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 1:54 PM IST
Mother Killed Her New Born Baby: రోజులు నిండకుండా పుట్టిందని, వైద్య ఖర్చులు భారమయ్యాయని అత్త సూటిపోటి మాటలు కుటుంబ పరిస్థితులు ఆ తల్లి గుండెను పిండేశాయేమో లేక పుట్టిన బిడ్డ పెద్దయ్యాక అందరిలా ఉంటుందో, లేదోనన్న భయం ఆ తల్లిని వెంటాడిందేమో కానీ తానే కడుపు చించుకొని జన్మనిచ్చిన 45 రోజుల పసికందును నులిమేసింది. అమ్మ లాలించి పొత్తిళ్లలో పెంచుతుందని ఆశపడిన రోజుల శిశువు లోకాన్ని చూడకుండానే ఆమె చేతిలో మృత్యుపాశానికి బలైంది.
క్షణమొక యుగంలా: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురంలో ఈ నెల 2వ తేదీన నెలన్నర పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రావి ప్రభుకుమార్‌తో హైదరాబాద్‌కు చెందిన వీరమాచనేని సాయిచైతన్యకు 2024లో వివాహమైంది. నెలలు నిండకుండానే పాప జన్మించింది. ఆసుపత్రిలో వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. మరోపక్క నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిందని అత్త వాణి ఈసడింపు మాటలతో కోడల్ని మానసిక క్షోభకు గురి చేయడం మొదలు పెట్టింది. తరచూ ఎత్తిపొడుస్తుండడంతో క్షణమొక యుగంలా ఇంటి వాతావరణం మారింది. బిడ్డ అనారోగ్యం కూడా తోడు కావడంతో భర్తతో ఈ బాధను చెప్పుకోలేక, ఆ తల్లి తనలో తానే మథన పడింది.
తనకు జన్మించిన బిడ్డ వల్లే ఇదంతా జరుగుతోందని భావించి బిడ్డను కడతేర్చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్న తల్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శిశువును ఇంటి పక్కనే ఉన్న నీటి గుంటల్లో విసిరేసింది. మొదట బిడ్డ కనిపించట్లేదని చెప్పింది. కానీ పోలీసుల విచారణలో తానే చంపేసిన తీరును వివరిస్తూ కన్నీంటి పర్యంతమైంది. 8 మాసాలు మోసి జన్మనిచ్చిన పాపను తానే చంపుకున్నానని గుండలవిసేలా రోదించింది.
తన బిడ్డను తానే చంపేసినట్లు తల్లి సాయి చైతన్య విచారణలో ఒప్పుకొంది. అనారోగ్యంతో ఉన్న పాప, మరోవైపు అత్త సూటిపోటి మాటలతో మనస్తాపం చెంది శిశువు నిండు ప్రాణాన్ని తీసినట్టు తెలిపింది. కేసు నమోదు చేసి బాధ్యులైన అత్త, కోడలిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపించామని సీఐ ఈశ్వరరావు తెలిపారు.
పిల్లలను చంపేసి ఆపై తానూ: విడాకులు తీసుకున్న భార్య ఎప్పటికీ కాపురానికి రాదన్న విషయం జీర్ణించుకోలేక ఓ తండ్రి ఇద్దరు పిల్లలను చంపేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. నారాయణపేట జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరికల్ సీఐ రాజేందర్‌రెడ్డి వివరాలు తెలిపారు. మరికల్ మండలం తీలేర్ గ్రామానికి చెందిన శివరాములు (32)కు ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన సుజాతతో తొమ్మిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి కుమార్తె రితిక (8), కుమారుడు చైతన్య (6) ఉన్నారు. వివాహమైన వెంటనే శివరాములు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. చైతన్య జన్మించక ముందు నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ గొడవలతో సుజాత కుమారుడికి మూడునెలల వయసున్నప్పుడే భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది.
ఆ తర్వాత శివరాములు హైదరాబాద్ నుంచి స్వగ్రామం వచ్చారు. గత ఏడాది మార్చిలో వీరు కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి శివరాములు ఇంట్లో ముభావంగా ఉండేవాడు. రితికకు దద్దుర్లు రావడంతో సోమవారం సాయంత్రం ఆసుపత్రికి తీసుకువెళ్తున్నా అంటూ ఇద్దరు పిల్లలను పొలం వద్దకు తీసుకెళ్లాడు. రాత్రి 9 దాటినా రాకపోవడంతో కుటుంబీకులు ఫోన్ చేయగా మరికల్‌లో ఉన్నట్లు చెప్పాడు. పొలంవద్ద గుడిసెలో పిల్లలు గాఢనిద్రలో ఉన్న సమయంలో తాడుతో ఉరివేసి చంపి సమీపంలోని యాపల్‌చెర్వు వంపు వాగు కల్వర్టులో పడేశాడు.
అనంతరం తాను చనిపోయేందుకు గడ్డి మందు తాగాడు. వెంటనే చనిపోవాలని విద్యుత్తు తీగను పట్టుకున్నాడు. షాక్ కొట్టి ఫ్యూజు ఎగిరిపోయింది. జేబులో ఉన్న బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. అయినా మరణించకపోవడం, గడ్డిమందుతో కడుపులో మంట రావడంతో తాళలేక విషయాన్ని మిత్రులకు వివరించాడు. పొలం దగ్గరకు వెళ్లి చూసి గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రాము సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. యాపల్‌చెర్వు వంపు వాగు కల్వర్టులో వెతకగా పిల్లల మృతదేహాలు లభించాయి. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసులే దొంగలతో కుమ్మక్కై స్వామివారి సొమ్ముకు ఎసరు - బయటపడనున్న అక్రమార్కుల జాతకాలు
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

