శ్రీకాకుళం జిల్లాలో విషాదం - రైలు పట్టాలపై తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు
శ్రీకాకుళం జిల్లాలో దారుణం - పలాస-తాళభద్ర మధ్య రైలు పట్టాలపై తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు - ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో పోలీసుల దర్యాప్తు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 19, 2026 at 10:40 AM IST
Mother Self Died Along with her Two Children : క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సాఫీగా సాగే కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. చిన్నపాటి కుటుంబ కలహాలకే మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాము తనువు చాలించడమే కాకుండా, లోకం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా చిదిమేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పలాస - తాళభద్ర రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
భర్తతో విభేదాలు శ్రీకాకుళం జిల్లాలో భార్య, ఇద్దరు పిల్లల్ని బలిగొన్నాయి. అత్తింటి నుంచి అలిగి ఇంటి నుంచి వెళ్లిన పూజ, ఇద్దరు పిల్లలు రైలు పట్టాలపై శవాలై తేలడం పెను విషాదం నింపింది. అత్తింటి వేధింపుల వల్లే పూజ ఉసురు తీసుకుందని ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస-తాళభద్ర మధ్య రైలు పట్టాలపై తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. పట్టాలపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
కొన్నేళ్లుగా దంపతుల మధ్య గొడవలు: శ్రీకాకుళం జిల్లా భావనపాడుకు చెందిన పూజకు చలమయ్యపేటకు చెందిన వెంకట్‌తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఐదేళ‌్ల కుమారుడు కుశాంత్, మూడేళ్ల కుమార్తె దీక్షిత ఉన్నారు. కుటుంబమంతా విజయవాడలో ఉండేవారు. వెంకట్ భవన నిర్మాణ సంబంధిత పనులకు వెళ్తుండేవారు. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి చలమయ్యపేట వెళ్లారు.
కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పూజ ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటికి నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి రాలేదు. చీకటి పడే సమయానికి పిల్లలతో కలిసి పలాస రైల్వేస్టేషన్‌కు చేరుకుంది పూజిత. రాత్రంతా స్టేషన్‌లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. ఉదయం రైలు వస్తుండగా పలాస-తాళభద్ర మధ్య పట్టాలపై కూర్చుంది. పిల్లలను కూడా గట్టిగా పట్టుకుని కూర్చుంది. అలా రైలు కిందపడి ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అత్తతో పాటు తోటికోడళ్ల వేధింపుల తట్టుకోలేకే, బలవన్మరణానికి పాల్పడిందని పూజ తల్లి ఆరోపించారు.
"నిన్ననే ఫోన్ చేసి మాట్లాడాను. ఎప్పుడూ గొడవలేనా? అని అడిగితే వెంటనే ఫోన్ కట్ చేసేశాడు. కొంత సమయం తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే మీ కూతురు బాధపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని మా అల్లుడు చెప్పాడు. అంతేకాకుండా పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకుని డ్రామాలు ఆడుతున్నావు అని నన్ను నిందించాడు." - మృతురాలి, తల్లి
మరోవైపు కుటుంబ కలహాల వల్లే పూజిత తన పిల్లలతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, ఇది ఆత్మహత్యా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో చలమయ్యపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కోనసీమ జిల్లాలో దారుణం - యజమానిని చంపిన కూలీలు
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినందుకు గిరిజన యువతి దారుణ హత్య

