కాశీతోటలో విషాదం - తనతోపాటు కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించుకున్న తల్లి
సోమవారం సాయంత్రం కుమారుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొని కాశీతోటలోని శివాలయం వద్దకు చేరుకున్న లీలాబాలశ్రావణి - నిర్మానుష్య ప్రాంతంలో తనతో పాటు కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించుకున్న శ్రావణి

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 7, 2026 at 12:38 PM IST
Mother and Son Losts Life in Tirupati District : అప్పుడప్పుడే చీకటి పడుతోంది. అమ్మ స్కూటీ బయటకు తీసింది. గ్రామం దాటి వాహనం వెళ్తుండగా చిమ్మ చీకటి. చల్లని గాలులకు శరీరం వణికింది. అది కొన్ని క్షణాల పాటే. తల్లి తీసుకొచ్చిన పెట్రోలు పోసి తనతో పాటు బిడ్డకు నిప్పు పెట్టడంతో పచ్చని తోటల్లో అగ్నికీలలు ఎగిశాయి. చలికి వణికిన శరీరం నిప్పుల కొలిమిలా మారింది. క్షణాల్లోనే తల్లి ప్రాణాలు అగ్నికి ఆహుతి కాగా ఏం జరుగుతుందో తెలియని ఆ బాలుడు ఒళ్లు కాలిపోతోంది కాపాడండీ అంటూ చీకట్లోనే పరుగులు పెట్టాడు. చివరికి ప్రాణాలు విడిచాడు.
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో రెండు ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటగిరి పట్టణంలోని ఆత్మామాలిక్ ధ్యాన మందిరంలో నాగేశ్వరశర్మ పండితుడిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య లీలాబాలశ్రావణి (35), కుమారుడు చంద్రమౌళి (9), ఓ కుమార్తె (7) ఉన్నారు. లీలా బాలశ్రావణి సోమవారం సాయంత్రం కుమారుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొని కాశీతోటలోని శివాలయం వద్దకు చేరుకున్నారు. నిర్మానుష్య ప్రాంతంలో తనతో పాటు కుమారుడిపై పెట్రోలు పోసి నిప్పంటించుకుంది. మంట వేడి తాళలేక చంద్రమౌళి కేకలు వేస్తూ తుప్పల్లో పరుగులు తీశాడు. సమీపంలోని ఆటో డ్రైవర్లు గమనించి ఆరా తీయగా తన తండ్రి సెల్‌ఫోన్ నంబరు ఇచ్చి సమాచారం తెలియజేయాలని కోరాడు.
విషయం తెలుసుకున్న నాగేశ్వరశర్మ అక్కడి చేరుకున్నారు. భార్య చనిపోయి ఉండటంతో చేసేది లేక కుమారుడిని తీసుకొని తిరుపతి బయలుదేరాడు. సగం దూరం వెళ్లేసరికి బాలుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరూ బయటకు వచ్చిన సమయంలో కుమార్తె ఆడుకోవడానికి వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న సీఐ రోశయ్య, ఎస్సై స్వరూప అక్కడకి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

