కన్న బిడ్డను కట్టెల పొయ్యిలో వేసి చంపిన తల్లి - నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు కట్టేసి
బౌరంపేటలో 2 నెలల కుమారుడిని దారుణంగా హింసించి చంపిన తల్లి - రాత్రి నుంచి ఏడుస్తున్నాడని ట్టెల పొయ్యిలో వేసి హత్య - కుమారుడిని చంపడంపై భార్యతో గొడవపడిన భర్త

Published : February 25, 2026 at 10:01 PM IST
Mother Kills Son In Bowrampet Hyderabad : హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లి చిన్న కారణానికే కర్కశకంగా ఆ పసికందు నిండు ప్రాణాన్ని తీసింది. కన్న కొడుకు ఏడుస్తున్నాడనే కోపంతో ఆ తల్లి ఏం చేస్తోందో కూడా తెలియని స్థితిలో రెండు నెలల పసికందును కట్టెల పొయ్యిలో పడేసింది. హృదయ విదారకంగా జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. సమాజంలో మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. రక్తసంబంధీకులే సొంత వారి పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఘటనల్లో క్రూరంగా మారి అంతం చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు అధికమవుతున్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
అపార్ట్మెంట్‌లో కూలీలుగా పని : రాజేంద్ర, మమత ఇరువురు దంపతులు. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాకు చెందిన వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్‌లో కూలీ పని చేస్తున్నారు. ఆమె రెండు నెలల క్రితమే కుమారుడికి జన్మనిచ్చింది. బాలుడికి సూర్య అనే పేరు కూడా పెట్టారు.
బాలుడిని చూసి రోదించిన రాజేంద్ర : రోజువారీగానే భర్త రాజేంద్ర ఉదయం భవన నిర్మాణ పనులకు వెళ్లగా భార్య 2 నెలల బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు కట్టేసి రూంలో ఉన్న పొయ్యిలో వేసి కాల్చి చంపేసింది. భర్త మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చి చూసే సరికి పొయ్యిలో బాలుడి మృతదేహం చూసి గుండెలవిసేలా రోదించాడు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
"రాజేంద్ర, మమత అనే దంపతులు మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. వీరికి రెండు నెలల క్రితమే బాలుడు జన్మించాడు. ఆ బాబును మమత కిరాతకంగా చంపింది. ఈ విషయంపై మాకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాం" -శంకర్ రెడ్డి, మేడ్చల్ ఏసీపీ
రోజు ఏడుస్తున్నాడని పొయ్యిలో : వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ కసాయి తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. బాలుడు రోజు ఏడుస్తూ రోజూ ఇబ్బంది పెడుతున్నాడని అందువల్లనే మంటల్లో వేసి కాల్చినట్లు చెప్పడంతో సమాధానం విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కౌన్సిలింగ్ ఇవ్వాలంటున్న మానసిక వైద్య నిపుణులు : రాజేంద్ర ఫిర్యాదు మేరకు నిందితురాలు మమతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కన్న తల్లే అభంశుభం తెలియని 2 నెలల కుమారుడిని దారుణంగా పొయ్యిలో పడేసి అంతం చేయడంతో పలువురు స్ధానికులు విషాదంలో మునిగిపోయారు. ఆవేశంలో అయినవారిని కడతేరుస్తున్న కర్కోటకులు తదుపరి పరిణామాల గురించి ఆలోచించడం లేదని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. ఇటువంటి వారి కదలికలను గమనించి వారి ప్రవర్తనలో మార్పులు గమనించి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
"ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల నాకేదో అన్యాయం జరిగిందని భావించి వారు మానసికంగా కుంగుబాటుకు లోనవుతారు. చుట్టుపక్కల ఉన్నవారు వారి మానసిక ఆందోళనను గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయగలిగే అవకాశం ఉంది. మనకు అన్యాయం ఎవరి వల్ల అయితే జరిగిందో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి భావన కూడా ఏర్పడుతుంది. సైకాలజికల్గా తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుమానం వంటివి తలెత్తినప్పుడు ఏం ఆలోచించకుండా చేస్తారు" -ఉమాశంకర్, మానసిక వైద్య నిపుణులు
తరతరాలుగా అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి గొడవలు - భూమి విక్రయించడంతో వ్యక్తి మృతి
ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం భర్తను హత్య చేసిన భార్య - అనాథలైన పిల్లలు

