హృదయ విదారకం : ఆరేళ్ల పాపను నడుముకు కట్టుకుని బావిలోకి దూకిన తల్లి
కుమారుడిని పడుకోబెట్టి, కుమార్తెను నడుముకు కట్టుకుని బావిలోకి దూకిన తల్లి - భర్తతో గొడవల కారణంగా పుట్టింట్లోనే ఉంటున్న మృతురాలు - ఆదివారం ఉదయం భర్త పిల్లలను చూసి వెళ్లిన కాసేపటికే ఘటన

Published : August 31, 2026 at 10:44 AM IST
Mother Jump Into Well With Daughter : ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో గానీ తన చంటిబిడ్డను నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం, లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత (26)కు ఏడేళ్ల కిందట జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె అక్షిత (6), 18 నెలలున్న కుమారుడు మహేందర్ ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో రజిత కొంతకాలంగా తన పుట్టింట్లోనే ఉంటోంది. అంజయ్య అప్పుడప్పుడు పిల్లలను చూసేందుకు అక్కడికి వస్తుండేవాడు.
కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది : ఆదివారం ఉదయం రజిత తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఆమె భర్త అంజయ్య యథావిధిగా పిల్లలను చూసేందుకు వచ్చి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన కాసేపటికే రజిత తన కుమారుడిని నిద్రపుచ్చి కుమార్తెను తీసుకుని గ్రామం సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అక్కడ కుమార్తెను తన నడుముకు కట్టుకుని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అటుగా వెళ్తున్న స్థానికులు నూతిలో మృతదేహాలు తేలియాడటం గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై రాజవర్ధన్ తెలిపారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు : జీవితంలో ఏదో ఒక సమయంలో సమస్యలు ఎదురవడం సహజమని నిపుణులు చెబుతున్నారు. సరైన దృక్పథంతో సమస్యలను ఎదుర్కోవడం వల్ల అనేక పరిష్కారాలు లభిస్తాయని చెబుతున్నారు. మీకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నా, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నా, లేదా మీ సమస్యలను ఎవరితోనైనా పంచుకోవాలనుకున్నా, హెల్ప్‌లైన్ కేంద్రాలు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మన తోటి వారు బాధలో ఉండి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు కూడా మీకు తెలిసినా వారిని సంప్రదించొచ్చు. ఇటువంటి సమస్యల గురించి ధైర్యం చెప్పేందుకు, మద్దతుగా నిలిచేందుకు మీకు స్నేహ ఫౌండేషన్ 04424640050 (24/7 అందుబాటులో ఉంటుంది) లేదా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్‌లైన్ 9152987821 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఈ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10.00 గంటల మధ్య అందుబాటులో ఉంటాయి. వీరిని సంప్రదించి మీ సమస్యలను చర్చించడం ద్వారా మీరు తగిన పరిష్కారాలను కనుగొనవచ్చు.

