ETV Bharat / state

అనుకోకుండా ఆధ్యాత్మిక ప్రయాణం - 2 దశాబ్దాలకుపైగా పూజారులుగా తల్లీకుమార్తెలు

5 ఏళ్లుగా బాపులపాడు సాయి మందిరంలో సేవ - చిన్నప్పుడు నేర్చుకున్న వేద విద్యకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ దేవుడి సేవలో రాణిస్తూ - భక్తులు మన్ననలు పొందుతున్న తల్లీకుమార్తెలు

Mother and Daughter as Priests at Krishna District
Mother and Daughter as Priests at Krishna District (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2025 at 2:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

Mother and Daughter as Priests at Krishna District : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన, తపన, ఆశయం ఉంటే దాన్ని నిర్వర్తించడంలో స్త్రీ, పురుష బేధమే లేదు. సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా పురుష అర్చకులు పూజలు చేస్తుంటారు. కానీ, కృష్ణా జిల్లా బాపులపాడులో తల్లీకుమార్తెలు రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి పూజలు నిర్వహిస్తున్నారు. వీరు రెండు దశాబ్దాలకు పైగా పూజారులుగా రాణిస్తున్నారు. వీరి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అనుకోకుండా వృత్తిలోకి అడుగుపెట్టిన తల్లీకుమార్తెలు : కృష్ణా జిల్లా బాపులపాడులోని పురాతన కోదండ రామాలయం ఒకప్పుడు నిర్వహణ లోపంతో మూత పడింది. ఆ ఆలయాన్ని చక్రవర్తుల రాజ్యలక్ష్మి కుటుంబీకుల సలహా మేరకు స్థానికులు 23 ఏళ్ల కిందట పునఃప్రారంభించాలని భావించారు. పూజారి బాధ్యత ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు గ్రామస్థుల కోరిక మేరకు రాజ్యలక్ష్మి ఆ బాధ్యతను స్వీకరించారు. ప్రత్యేక శిక్షణ లేకపోయినా, చిన్నతనంలో తండ్రి వద్ద నేర్చుకున్న వేద విద్యే ఆమెను ముందుకు నడిపిస్తుంది. నిరంతరం ఎంతో శ్రమిస్తూ, పూజా విధానాలను మెరుగు దిద్దుకుంటూ దేవుడి సేవలో రాణిస్తున్నారు. నేటికి రాజ్యలక్ష్మి భక్తుల మన్ననలు పొందుతున్నారు.

Mother and Daughter as Priests at Krishna District
సాయిబాబా మందిరంలో పూజలు చేస్తున్న శ్రీలక్ష్మి (Eenadu)

తల్లి బాటలోనే కుమార్తె : తల్లి అడుగుజాడల్లోనే నడిచిన కుమార్తె భోజనపల్లి శ్రీలక్ష్మి కూడా ఆధ్యాత్మిక సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్ల కిందట ఏలూరు జిల్లా తడికలపూడిలో సాయిబాబా మందిరం నిర్మించినప్పుడు పూజారి ఎవరూ లేరు. ఆ సమయంలో శ్రీలక్ష్మి పూజలు నిర్వహించేందుకు బాధ్యతలు తీసుకున్నారు. కేవలం 3 నెలల్లోనే పూజా విధానాలను నేర్చుకున్నారు ఆమె. నేటికి ఆ బాధ్యతలను చేపడుతున్నారు. గత 5 ఏళ్లుగా బాపులపాడు సాయి మందిరంలో అర్చకురాలిగా సేవలందిస్తున్నారు. తల్లీకూతుళ్లిద్దరూ పూజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

పూజారులుగా మహిళలు: కేవలం పురుషులు నిర్వహించే పూజా కార్యక్రమాలను ఇప్పుడు మహిళలు నిర్వహిస్తున్నారు. తల్లీకుమార్తెలైన రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి సుమారు 20 సంవత్సరాలుగా పూజారులుగా విజయవంతంగా సేవలు అందిస్తున్నారు. నిత్యం ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. విగ్రహాలను పూలతో అలకరిస్తున్నారు. దీప ధూప నైవేద్యాలతో దేదీప్యమానంగా పూజలు నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్దలతో వీరు చేస్తున్న కృషికి స్థానికులు సైతం మంత్రముగ్ధులు అవుతున్నారు. సాధారణంగా ఇలాంటి సంఘటనలు చూడడం చాలా తక్కువ.

సామాజిక మార్పుకు నాంది : సంప్రదాయబద్ధంగా పురుషులకే పరిమితమైన ఈ వృత్తిలో మహిళలు రాణించడం సామాజిక మార్పునకు నిదర్శనం. అడ్డంకులను అధిగమించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తూ వీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భక్తి అనేది మనసులో ఉండాలి కానీ, అది కేవలం ఒక వర్గానికో లేదా పురుషులకో మాత్రమే పరిమితం కాదని వీరిద్దరూ నిరూపిస్తున్నారు. ఈ తల్లీకూతుళ్ల ప్రయాణం ఆధునిక సమాజంలో మహిళా సాధికారతకు, ఆధ్యాత్మిక పరిణితికి ఒక గొప్ప ఉదాహరణ.

వేదాల్లో ఆరితేరిన పండితులు - గ్రౌండ్​లోకి దిగితే క్రికెట్‌లోనూ అదరగొడతారు

800 ఏళ్ల నాటి శివాలయంలో మహిళలే అర్చకులు.. పది తరాలుగా ఘనంగా పూజలు!