కళాకారులకు చేయూతగా చిత్రిక- 20 ఏళ్లుగా సేవలందిస్తున్న విజయ స్విత
ఏడాది పొడవునా కళాకారులకు అవసరమైన వనరులను అందజేస్తూ నైపుణ్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న చిత్రిక - చదువుకు దూరమైన, నైపుణ్యాలు ఉన్న అమ్మాయిలకు డిజైనింగ్, మార్కెటింగ్, వీవింగ్‌లలో శిక్షణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 2, 2026 at 3:48 PM IST
Most Women Earn Their Livelihood in Handloom Weaving Sector After Agriculture: ఎక్కువ మంది మహిళలు వ్యవసాయం తర్వాత చేనేత రంగంలోనే ఎక్కువగా జీవనోపాధి పొందుతున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. కానీ మార్కెటింగ్ సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల, విదేశీ వస్త్రాల ధాటికి స్వదేశీ కళాకారులు వెనకబడుతున్నట్లు తెలుస్తుంది. అందుకే, చేనేత రంగంలో ఉపాధి పొందుతున్న వాళ్లకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో చిత్రిక (క్రెయో) ఫౌండేషన్ ప్రారంభమయ్యింది. ఈ సంస్థ మహిళా సాధికారతే లక్ష్యంగా 20 ఏళ్లుగా సేవలందింది. ఆ సంస్థ గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
విజయ స్విత గ్రంథి ఐఆర్‌ఎమ్‌ఏ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్) లో 2005లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి క్షేత్రస్థాయిలో పని చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే కళాకారులకు సరైన ఆదాయ మార్గాలు, గుర్తింపు లేకపోవడం గమనించారామె. కళతోపాటు కళాకారులకూ ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే వాళ్ల అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని ఒక ఫౌండేషన్ నడిస్తే బాగుంటుందన్న ఆలోచనతో అవకాశాల కోసం వెతకడం మొదలుపెట్టారు విజయ స్విత గ్రంథి. అయితే దీన్ని స్థాపించడం కోసం క్షేత్రస్థాయిలో ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంతకుముందు కొన్ని సంస్థలు ఈ ఉద్దేశంతోనే పని చేస్తామని చెప్పి కొద్ది రోజులు గడిచాక కనుమరుగైన ఘటనలు ఉన్నాయి. ఆ కారణంగా కళాకారులెవ్వరూ వీరిని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆ సమయంలో వీరు పలు సమావేశాలు పెట్టి తమ లక్ష్యం గురించి వివరించడంతో చిత్రికలో భాగం కావడానికి కళాకారులు సిద్ధమయ్యారు.
10 మంది కళాకారులతో మొదలు: హస్తకళ, నేత రంగాలలో మనకు పైకి కనపడని కష్టం చేసేవాళ్లందరూ మహిళలే. నూలు వడకడం, రంగులద్దడం, డిజైన్ల నిర్ణయించడం, బిన్లు చుట్టడం, వంటి ఎన్నో కీలకమైన పనుల్లో మహిళలు ముఖ్యమైన వాటిల్లో భాగమవుతున్నారు. అయినప్పటికీ ఇది ఎన్నో ఏళ్లుగా పురుషాధిక్య రంగంగానే కొనసాగింది. మహిళలు శ్రమకే పరిమితమయ్యారు. అందుకే విజయ స్విత అలాంటివారందరికీ సంస్థాగత మద్దతు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. చిత్రిక ఫౌండేషన్ కార్యకలాపాలు పొందూరులో 10 మంది కళాకారులతో మొదలయ్యాయి.
దేశంలోనే మొట్టమొదటిది: అది ప్రారంభమైన నాటి నుంచి ఆమె ఎప్పుడూ వెనుదిరిగి చూసింది లేదు. కళాకారుల కళకు రంగులద్దుతూ వారిని చిన్నపాటి సమూహాలుగా ఏర్పాటు చేయడం మొదలెట్టారు. నైపుణ్యాలు ఉన్న వెనకబడిన మహిళలకు, ఆసక్తి ఉన్న వాళ్లకి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. అలా ఒక సంవత్సర కాలం లోపే శ్రీకాకుళంలో 4 బృందాలను ఏర్పాటు చేశారు. మార్కెటింగ్, ఆధునికతను అందిపుచ్చుకోవడం, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విక్రయించడం, ఎగ్జిబిషన్లలో పాల్గొనడం వంటి అనేకమైన నైపుణ్యాలను వారికి నేర్పారు. వాళ్లందరినీ కలిపి 2006లో ఒక సహకార సంఘంగా మార్చేశారు విజయ. ఆపైన ఈ సంఘం క్రయవిక్రయాలు దేశవ్యాప్తం అవ్వాలని వంశధార వీవర్స్‌ను ఉత్పత్తిదారు కంపెనీగా మలిచారు. చిత్రిక ఫౌండేషన్ సేవల్ని ఆసరాగా చేసుకుని గోదావరి విమెన్ వీవర్స్ సర్వీసెస్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పడింది. ఈ తరహా కంపెనీ దేశంలోనే మొట్టమొదటిది ఇదే కావడం విశేషం.
ఆత్మగౌరవంగా జీవనం: చిత్రిక కేవలం కమ్యూనిటీల ఏర్పాటుకే పరిమితమవ్వలేదు. ఏడాది పొడవునా కళాకారులకు అవసరమైన వనరులను అందజేస్తూ నైపుణ్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆ మహిళల జీవన ఉపాధిని మెరుగుపరచి, ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ సంకల్పం అంటున్నారు విజయ స్విత. తమ సంస్థ ఏం చేసినా కళను నమ్ముకున్న వాళ్లు వెనకపడకూడదనే అని అంటారామె. ఈ క్రమంలో భాగంగానే ‘హ్యాండ్‌మేడ్ ఎంబీఏ’ అనే ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టినట్లు ఆమె చెప్తున్నారు. నైపుణ్యాలు ఉన్నప్పటికీ, చదువుకు దూరమైన అమ్మాయిలకు డిజైనింగ్, మార్కెటింగ్, వీవింగ్‌లలో శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలుపుతున్నారు. శిక్షణతో పాటు ఐఆర్‌ఎమ్‌ఏ తరఫున పట్టాను కూడా అందిస్తున్నట్లు వివరిస్తున్నారు. దీనివల్ల అమ్మాయిలు, మహిళలు ఎంతో ఆత్మగౌరవంగా జీవనం సాగించగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంకుర సంస్థల్ని స్థాపించడంలోనూ విజయ స్విత భాగమవుతున్నారు.
ముగ్గురితో ప్రారంభమై 35 మందికి ఉపాధి - వస్త్రరంగంలో రాణిస్తున్న చంద్రకళ
వస్త్రాలపై రామాయణ ఘట్టాలు - కలంకారీలో విజయలక్ష్మికి జాతీయ అవార్డు

