ETV Bharat / state

తుపాన్ల లక్షణాలు మారిపోతున్నాయ్‌ - గందరగోళానికి గురిచేసిన ‘మొంథా’

వేగంగా బలపడి, అంతే వేగంతో బలహీనపడిన మొంథా తుపాను - వాతావరణ మార్పుల దృష్ట్యా కొత్త రకం తుపాన్ల లక్షణాలు

Montha Cyclone Unusual Path
Montha Cyclone Unusual Path (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 30, 2025 at 7:20 AM IST

2 Min Read
Choose ETV Bharat

Montha Cyclone Unusual Path: ఈశాన్య రుతుపవనాల కాలంలో ఏర్పడిన తొలి తీవ్ర తుపాను ‘మొంథా’ భారీ నష్టానికి దారి తీసింది. అయితే, ఈ తుపాను ప్రవర్తన వాతావరణ నిపుణులను, అధికారులను గందరగోళానికి గురిచేసింది. వాతావరణ మార్పుల ప్రభావంతో తుపాన్లు ఇప్పుడు తమ స్వభావాన్ని, గమనాన్ని, వేగాన్ని మార్చుకుంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సాధారణంగా తుపాను తీరం దాటిన తర్వాత సమీప ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయి. కానీ ‘మొంథా’ మాత్రం తీరం దాటిన కూడా అంత ప్రభావం చూపలేదు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు పశ్చిమ గోదావరి, ఏలూరు, డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఎక్కడా 50 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదు కాలేదు. కేవలం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం వద్ద మాత్రమే కొంతమేర వర్షం పడింది.

కావలి వద్దే మేఘాలు: సాధారణంగా తుపాను ‘కన్ను’ (ఐ)కు 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ‘క్లౌడ్ వాల్స్‌’ ఏర్పడి భారీ వర్షాలు పడి, ఈదురుగాలులు వీస్తాయి. అయితే ‘మొంథా’ తుపానులో ఇది పూర్తిగా విభిన్నంగా చోటు చేసుకుంది. తీరం దాటిన అంతర్వేది నుంచి దాదాపు 330 కిలోమీటర్ల దూరంలోని కావలి వద్దే మేఘాలు కేంద్రీకృతమై 20 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. అంతర్వేది సమీపం, కోనసీమ జిల్లాలో మాత్రం చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. గాలుల వేగం కూడా తీవ్ర తుపానుకు తగినంతగా లేదు.

అంచనాలకు విరుద్ధంగా: తుపాన్లు సాధారణంగా తీరం దాటిన ప్రాంతానికి కుడివైపు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం ఉంటుంది. ఈ లెక్కన అంతర్వేదికి కుడివైపున ఉన్న కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవాలి. కానీ ఎక్కడా అలా జరగలేదు. విశాఖలో నమోదైన అధిక వర్షం తుపానుతో కాకుండా ద్రోణి ప్రభావంతోనే అని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బలపడినంత వేగంగా బలహీనపడిన ‘మొంథా’: శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రూపంలో ప్రారంభమైన ‘మొంథా’, శనివారం ఉదయానికి వాయుగుండంగా, ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి తుపానుగా మారింది. మంగళవారం నాటికి ఇది తీవ్రమైన తుపానుగా బలపడింది. కానీ తీరం దాటిన తర్వాత అదే వేగంతో బుధవారం తెల్లవారుజామున తుపానుగా, ఆపై తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.

సముద్రంలో తుపాన్లు ఎక్కువ సమయం కొనసాగితే బలం పెరుగుతుందని నిపుణులు చెబుతారు. కానీ ‘మొంథా’ మాత్రం గంటకు 15 నుంచి 17 కి.మీ. వేగంతో కదిలి, తక్కువ సమయంలోనే బలహీనపడింది. దీని కారణంగా ఎక్కువగా ప్రభావం చూపలేకపోయింది. తుపాను తీరం దాటేటప్పుడు మచిలీపట్నంలో మాత్రమే 82 కి.మీ. వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు.

తుపాన్ల లక్షణాలు మారిపోతున్నాయ్‌: ఏ రెండు తుపాన్లు ఒకేలా ఉండవు. అయితే వాతావరణ మార్పుల ప్రభావంతో ఇప్పుడు తుపాన్ల లక్షణాలు వేగంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘మొంథా’ తుపాను ఏర్పడే వరకు బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగిన విధంగా ఉన్నాయి. కానీ తర్వాత పరిస్థితులు అది బలం పుంజుకునేందుకు, ప్రభావం చూపేందుకు అనుకూలించలేదు. వాతావరణ మార్పుల దృష్ట్యా తుపాన్ల ప్రవర్తన మారిపోతోందని విశాఖపట్నం వాతావరణ నిపుణుడు ఆచార్య భానుకుమార్ తెలిపారు.

తుపాను తీరం తాకి మళ్లీ సముద్రంలోకి వెళ్తుందా? - అక్కడ గాలి-వాన ఎందుకు ఉండవు!

పోర్టుల్లో తుపాను ప్రమాద హెచ్చరికలు - ఏ నంబరు ఎందుకో తెలుసా?