లక్షల ఉద్యోగాల దిశగా రాయలసీమ - ఓర్వకల్లు, కొప్పర్తి కారిడార్లకు శంకుస్థాపన
పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి మోదీ శంకుస్థాపన - రూ. 4,920 కోట్లతో కారిడార్లలో అభివృద్ధి పనులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 17, 2025 at 11:34 AM IST
Modi lays foundation for Industrial Corridors: ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ల ద్వారా రాయలసీమ పారిశ్రామిక ముఖ్య చిత్రం మారే అవకాశం ఉంది. ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టుల విషయంలో కీలక ముందడుగు పడింది. అసలీ కారిడార్లతో ఎన్ని లక్షల ఉద్యోగాలు రానున్నాయి? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంది? ఇందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో ఈ కథనంలో చూద్దాం.
రూ.4,920 కోట్లతో కారిడార్‌లకు శ్రీకారం: ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 4,920 కోట్లతో చేపట్టే పనులకు ప్రధాని మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో రహదారుల నిర్మాణం, నీటి వసతులు, సహా ఇతర మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టనున్నారు. ఒక్క కొప్పర్తిలోనే 2 వేల కోట్ల రూపాయలతో 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా ఈ రెండు కారిడార్లలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
రాయలసీమకు కొత్త ఊపిరి: కర్నూలు జిల్లాలో అపారమైన వనరులు ఉన్నా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓర్వకల్లు మెగా ఇండస్ట్రీయల్ హబ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
22 వేల ఎకరాల్లో పారిశ్రామిక హబ్: దీనికి ఓర్వకల్లు మండలంలోనే 22 వేల ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. APIICకి 13,830 ఎకరాలు కేటాయించింది. గట్టుపాడు వద్ద ప్రతిపాదించిన ఉత్తర, దక్షిణ క్లస్టర్లలో 2,471 ఎకరాల్లో ప్రతిపాదించిన క్లస్టర్‌ను APIIC ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికి 2,870.39 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో సుమారు 1,754 ఎకరాలు పారిశ్రామిక అవసరాలకు కేటాయించనున్నారు.
నత్తనడకన సాగిన పనులు - ఇప్పుడు ఊపందుకున్నాయి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నత్తనడకన సాగిన ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ పనులు, కూటమి ప్రభుత్వం రాకతో ఊపందుకున్నాయి. ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలోని జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనులూ చకచకా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఈ కంపెనీ పనులు ముందుకు సాగలేదు. 2.2 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సదరు సంస్థ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పరిశ్రమలోనే 3,200 మందికి ప్రత్యక్షంగా, 12,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కేంద్రం సహకారంతో ఓర్వకల్లు అభివృద్ధి: ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ అభివృద్ధికి కేంద్రం కూడా ముందుకొచ్చింది. మొదటి దశలో 2,600 ఎకరాల్లో, రెండో దశలో 2,100 ఎకరాల్లో, మొత్తం కలిపి 4,700 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో MSME పార్క్ అభివృద్ధికి రూ.2,786 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
దేశంలోనే తొలి సెమీకండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లులో: దేశంలోనే మొట్టమొదటి చిప్ తయారీ సెమీకండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ సంస్థ తన భాగస్వామ్య సంస్థ అయిన జపాన్‌కు చెందిన మైక్రో టెక్నాలజీ కంపెనీతో కలసి స్థాపించనుంది. 14 వేల కోట్లకుపైగా పెట్టుబడులతో పరిశ్రమ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమకు అవసరమైన 130 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూమిని ఓర్వకల్లు సమీపంలో గుర్తించారు. దీని ద్వారా 2 వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది.
కొప్పర్తి - చెన్నై కారిడార్‌లో భాగం: చెన్నై కారిడార్‌లో భాగంగా కొప్పర్తిని పారిశ్రామిక హబ్‌గా కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రకటించింది. నిధులు కేటాయించింది. ఈ నిర్ణయంతో అతిపెద్ద కంపెనీలు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లో పరిశ్రమలను స్థాపించనున్నాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.76 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం: ఐదేళ్ల కిందటే విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కొప్పర్తిని అభివృద్ధి చేయాలని కేంద్రం భావించినా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సహకారం లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. కానీ, సీఎం చంద్రబాబు తీసుకున్న చొరవతో రాయలసీమ నడి బొడ్డున ఉన్న కడప శివారులో కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమర్రి, సీకేదిన్నె, వల్లూరు మండలాల్లోని 6 గ్రామాల పరిధిలో 6,740.44 ఎకరాల్లో కారిడార్ ఏర్పాటైంది. 17,310 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ కొప్పర్తి పారిశ్రామిక నోడ్‌గా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
రాయలసీమ అభివృద్ధికి పునాది: తద్వారా రవాణా మార్గాలు, ఉపాధి అవకాశాలతో జిల్లా సహా పరిసర ప్రాంతాల దశ మారనుంది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధితో కడప, కర్నూలు జిల్లాలకు మంచి రోజులు రానున్నాయి. వృథాగా పడి ఉన్న వేలాది ఎకరాల్లో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టనుంది. ఫలితంగా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉంది - ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ

