ETV Bharat / state

సిరులు కురిపిస్తున్న కూరగాయల సాగు - ఆదర్శంగా నిలుస్తున్న రైతన్నలు

కూరగాయల సాగుతో అధిక ఆదాయం సంపాదిస్తున్న రైతులు - పంటల మార్పిడి చేస్తూ మంచి లాభాలు గడిస్తున్న అన్నదాతలు - మంచి ధర పలకడంతో కూరగాయల సాగుపై మెుగ్గు

Good Income From Vegetable Cultivation
కూరగాయల సాగుతో రోజువారీ ఆదాయం పొందుతున్న రైతులు (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : August 27, 2026 at 2:00 PM IST

|

Updated : August 27, 2026 at 2:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

Good Income From Vegetable Cultivation : సాగులో వినూత్న పద్ధతితో ముందుకెళ్తే మంచి ఆదాయం సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు ఆ కర్షకులు. పంట మార్పిడి చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు మంచి ధరలు పలకడంతో ఆ సాగు వైపు మళ్లారు. పందిరి సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన రైతులు.

జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటకు చెందిన గడ్డం శ్రీధర్ రెడ్డి వినూత్నంగా ఆలోచించి కూరగాయల సాగు చేస్తున్నారు. 45 వేల రూపాయల ఖర్చుతో తన వ్యవసాయ భూమిలో కర్రలతో పందిరి ఏర్పాటు చేశారు. బీర, సొర, కాకర, చిక్కుడు వంటి తీగజాతి కూరగాయలను పెంచుతున్నారు. ముఖ్యంగా బీర సాగుపై దృష్టి సారించి మంచి దిగుబడులతో లాభాలు పొందుతున్నారు. ప్రతి రోజు రూ.3,000 వరకు ఆదాయం పొందుతున్నట్లు రైతు శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

కూరగాయల సాగు చేసి లాభాలు పొందుతున్న రైతన్నలు (ETV)

నేను అర ఎకరం కౌలుకు తీసుకున్నాను. అందులో 8 గుంటల వరకు బీరసాగు చేస్తున్నాను. 2 గుంటలు కొత్తిమీర, గుంట వంకాయ, గుంట బెండకాయ, కర్రెలు వేసి తీగ జాతి కూరగాయలు వేశాను. వరి పండిస్తే 6 నెలలకు డబ్బులొస్తాయి. కానీ కూరగాయలు పండిస్తే 30 నుంచి 40 రోజుల్లో డబ్బులొస్తాయి - శ్రీధర్ రెడ్డి, రైతు వెంకట్రావుపేట

జగిత్యాల జిల్లా మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాజారపు భూమేశ్వర్ సమీకృత వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న 8 ఎకరాల వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలు సాగు చేస్తున్నాడు. 4ఎకరాల్లో వరి, మిగతా భూమిలో మొక్కజొన్న, పసుపుతోపాటు చేపలు, కోళ్ల పెంపకం చేస్తున్నాడు. స్థలాన్ని వృథా చేయకుండా గట్ల మీద కూరగాయలు సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రతినెలా ఖర్చులు పోనూ రూ.10,000పైగా ఆదాయం వస్తుందని భూమేశ్వర్ తెలిపారు.

నాకు 8 ఎకరాల భూమి ఉంది. అందులో 4 ఎకరాలు వరి, మిగతా భూమిలో మొక్కజొన్న, పసుపు, ఫిష్​ ఫామింగ్, దేశీ కోళ్ల ఫామింగ్, డైరీ ఫామ్​, కూరగాయలు వేశాను. ప్రస్తుతం వంకాయ, బీర, కాకర మొదలైన కూరగాయలు పండిస్తున్నాను - భూమేశ్వర్, ఆదర్శ రైతు మెట్ల చిట్టాపూర్

మెట్‌పల్లి మండలం ఆరపేట గ్రామానికి చెందిన లంక దేవయ్య బీర సాగుపైనే ప్రత్యేక దృష్టి సారించారు. బీరకు మంచి ధర పలుకుతుండడంతో అత్యధికంగా సాగు చేసి అధిక లాభాలు పొందుతున్నాడు. ప్రస్తుతం రోజుకు రూ.3,000 నుంచి 4,000కు పైగా ఆదాయం వస్తోందని రైతు దేవయ్య తెలిపారు. ఒకే పంటపై ఆధారపడకుండా రకరకాల పంటల్ని పండిస్తేనే లాభాలు పొందవచ్చని రైతులు నిరూపిస్తున్నారు.

మార్కెట్​లో సీజన్ ఆధారంగా కూరగాయల సాగు చేయాలి. నేను బీర, కాకర, వంకాయ, సొరకాయ సాగు చేస్తాను. పందిరికి లక్ష ఖర్చు అయ్యింది. అందులో రూ.50,000 ప్రభుత్వం నుంచి సబ్సిడీ వచ్చింది. పందిరి ఒకసారి వేసుకుంటే చాలు 10 నుంచి 15 సంవత్సరాల వరకు వస్తుంది. మొదటిసారి మాత్రమే ఖర్చు అవుతుంది. 45 రోజులకు క్రాప్​ మొదలవుతుంది. ఇప్పటి వరకు 60 కటింగ్​లు అయ్యాయి. కటింగ్​కు మొదట్లో రూ.5,000 వచ్చాయి. తర్వాత రూ.2,000 నుంచి 3,000 వచ్చాయి. కూరగాయల సాగు లాభంగా ఉంది - లంక దేవయ్య, రైతు ఆరపేట

కూరగాయల సాగుతో లాభాలు గడించాలా? - అయితే వీరిని ఫాలో అయిపోండి

సాగుబడిలో వారంవారం ఆదాయం కావాలా?, అయితే వీరి సక్సెస్ స్టోరీ చదవండి

Last Updated : August 27, 2026 at 2:29 PM IST