'ఫలానా దుస్తులే వేసుకోవాలని చెప్పేందుకు మీకేం హక్కు ఉంది' - శివాజీ కామెంట్స్‌పై నాగబాబు స్పందన
మహిళల దుస్తులపై నటుడు శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టిన నాగబాబు - సమాజం పురుషాధిక్య ఆలోచనల నుంచి బయటకురావాలని వెల్లడి - మహిళలు మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదన్న నాగబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 7:18 PM IST
Nagababu Reaction about Sivaji Comments On Women Dressing : మహిళల డ్రెస్‌ల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్‌ను సినీ నటుడు, జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు తప్పు పట్టారు. సమాజం పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని వాటినుంచి బయటకు రావాలన్నారు. మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదన్నారు. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలు వారి డ్రెస్‌ల వల్ల కాదని మగవాళ్ల క్రూరత్వం వల్ల అని నాగబాబు అన్నారు. ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ వీడియో విడుదల చేశారు.
‘‘నేను రాజకీయ నాయకుడిగానో, ఇండస్ట్రీకి చెందిన నటుడిగానో దీనిపై స్పందించడం లేదు. ఒక సామాన్య వ్యక్తిగా దీని గురించి మాట్లాడుతున్నాను. అలాగని నేను శివాజీని టార్గెట్ చేయడం లేదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. ఆడపిల్లలు ఎలా ఉండాలి, వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయాలపై ప్రతిఒక్కరూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అలా కామెంట్స్ చేయడం రాజ్యాంగం ప్రకారం తప్పు. ఆడవాళ్లు ఇలాంటి డ్రెస్‌లు మాత్రమే వేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది. ప్రతి ఆడపిల్లకు ఆత్మగౌరవం ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. ప్రతి ఆడపిల్లను కుటుంబసభ్యురాలిలానే చూడండి. మగవారితో సమానంగా బతికే హక్కు మహిళలకు కూడా ఉంటుంది’’ అని అన్నారు.
బయటకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు : ఇక ఆత్మరక్షణ కోసం ప్రత్యేక విద్య నేర్చుకోవాలని ఆడపిల్లలకు ఆయన సూచించారు. ‘‘మీరు ఎలాంటి దుస్తులైనా ధరించండి. బయటకు వెళ్లేటప్పుడు మీ రక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. నేను మగవాళ్లందరినీ తప్పుపట్టడం లేదు. కొందరి గురించి మాత్రమే చెబుతున్నాను. ఆడవాళ్లను అవమానించిన వారు బాగు పడినట్లు ఎక్కడా లేదు. మహిళలకు నాలాంటి వారు ఎప్పుడూ అండగా ఉంటారు. ఇలాంటి అంశంపై స్పందించడం ప్రతిఒక్కరి బాధ్యత’’ అని నాగబాబు చెప్పారు.
ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే : మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలను నటుడు ప్రకాశ్‌రాజ్ తప్పుబట్టారు. సీఐటీయూ మహాసభల కోసం విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు తరతరాలుగా పురుషుల వల్ల అన్యాయం జరుగుతోందన్నారు. ఒక వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. అనసూయను తాను సపోర్ట్ చేస్తానని తెలిపారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశారని, అది ముమ్మాటికీ తప్పని ప్రకాశ్‌రాజ్ అన్నారు.
శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు : మరోవైపు తనకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదని నటుడు శివాజీ అన్నారు. మహిళల దుస్తులపై ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల వేదికగా అవి తీవ్ర దుమారం రేపడంతో ఆయన క్షమాపణ కూడా చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. తమ ఎదుట హాజరు కావాల్సిన ఆదేశించింది. దీంతో నటుడు శివాజీ నేడు(శనివారం) కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసి వివరణ ఇచ్చారు.
అనంతరం శివాజీ మాట్లాడుతూ ‘‘నేను ఏం తప్పు చేశానని నా మీద ఇంత కోపం. మీ అమ్మానాన్న మీ ఇంట్లో మీకు జాగ్రత్తలు చెప్పరా? ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకుంటే నాకేంటి? ఎవరి దుస్తులు వారి ఇష్టం. ఇంతకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదా? వారి మీద ఇలానే మాట్లాడారా? సినిమా ప్రమోషన్ కోసం అని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. ‘దండోరా’ ఈవెంట్‌లో నేను చేసిన కామెంట్స్‌కు కమిషన్ నాకు నోటీసులు ఇచ్చింది. నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డవారి తరఫున కమిషన్ ప్రశ్నలు అడిగింది. వాటికి నేను సమాధానం చెప్పా. నేను ఎవరినీ నొప్పించాలని మాట్లాడలేదు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లాయి. నాపైన కుట్ర జరుగుతోంది. నాతో కెరీర్ మొదలు పెట్టిన వారికి నాపై కోపం ఉంది. నా వ్యాఖ్యల తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ పెట్టుకుని చర్చించారు. నాకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు’’
సినిమాలు రాకపోతే, వ్యవసాయం చేసుకుంటా : ‘‘శివాజీ తప్పు చేశాడనుకుంటే రండి మాట్లాడుకుందాం. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అత్యంత గోప్యంగా ముందుకు వెళ్తోంది. ఎవరి హక్కులకు భంగం కలిగినా రక్షించే వ్యవస్థలు ఉన్నాయి. సలహాలు ఇవ్వటం మానుకోవాలని నాకు అర్థమైంది. కమిషన్ అడిగిన వాటికి సమాధానం చెప్పాను. ఇంకా వివరణ ఇవ్వాల్సి వస్తే మళ్లీ కమిషన్ ముందుకు వస్తా. వాళ్లకు నచ్చని ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. సినిమాలు రాకపోతే, వ్యవసాయం చేసుకొని బతుకుతా. నాది రైతు కుటుంబం. నేను ఎవరినీ నొప్పించాలని మాట్లాడలేదు’’
‘‘అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ‘నువ్వెంత నీ బతుకెంత’ అని అంటున్నారు. ఎవరి బెదిరింపులకు నేను భయపడను. ఆత్మాభిమానం చంపుకొని అస్సలు బతకను. అదే సమయంలో వ్యవస్థలను, నేనుండే చిత్ర పరిశ్రమను గౌరవించకుండా విలువల్లేని బతుకు కూడా బతకడం లేదు. ప్రతి ఒక్క దానికి కాలమే సమాధానం చెబుతుంది. నాగబాబు గారు ఏమన్నారో చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరూ మాట్లాడలేరు. ఈ భూమ్మీద ఎవరిని ఎవరూ సంతృప్తి పరచలేరు. ‘యథార్థ వాది లోక విరోధి’’ అని శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
'9వ తరగతి వరకు చెప్పులు లేకుండానే - వాటిని భరించలేక ఇండస్ట్రీకి వచ్చా'
అందుకే #90s మిడిల్ క్లాస్ భారీ సక్సెస్ - ఇక ఆ పాత్రలు చేయాలనుకుంటున్నా : శివాజీ

