ETV Bharat / state

చివరిరోజూ రసవత్తరంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు

ఆటల్లో అదరగొట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు - క్రికెట్‌ మైదానంలో రేసుగుర్రాల్లా కదులుతూ ప్రేక్షకులను అబ్బురపరిచిన నేతలు - ప్రతీ గేమ్‌లో ఒకరిని మించి ఒకరు పోటీ

MLAs And MLCs Exciting Sports Competitions at Vijayawada
MLAs And MLCs Exciting Sports Competitions at Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 10:13 AM IST

2 Min Read
Choose ETV Bharat

MLAs And MLCs Exciting Sports Competitions at Vijayawada: స్నేహపూర్వక పోటీలే కానీ ఎవరూ తగ్గలేదు. ఇటు క్రికెట్‌ అయినా, అటు కబడ్డీ, జావెలిన్‌ త్రో, షాట్‌ పుట్ట్​ ఆట ఏదైనా గానీ గెలుపే లక్ష్యంగా ఒకరిని మించి ఒకరు పోటీపడ్డారు. తొలి రెండు రోజులు చూపిన ఉత్సాహాన్ని మించి మూడో రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా పోటీల్లో దుమ్మురేపారు. క్రికెట్‌ మైదానంలో రేసుగుర్రాల్లా కదులుతూ ప్రేక్షకులను అబ్బురపరిచారు. క్రికెట్‌లో బౌండరీలు బాదేశారు. కబడ్డీలో ఉడుంపట్టు పట్టారు. జావెలిన్‌త్రోలో బాహుబలిలా బల్లెం విసిరారు. షాట్‌పుట్‌ వేసి, ఫిట్‌గా ఉన్నామని నిరూపించుకున్నారు. మ్యూజికల్‌ ఛైర్స్‌ పోటీల్లో మ్యాజిక్ చేశారు. బ్యాడ్మింటన్‌ బ్రహ్మాండంగా ఆడారు.! ప్రతీ గేమ్‌లో ఒకరిని మించి ఒకరు పోటీపడ్డారు మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

ఆటల్లో అదరగొట్టారు: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు చివరిరోజూ రసవత‌్తరంగా సాగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం, దండమూడి రాజగోపాల్‌రావు ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో చట్టసభ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జావెలెన్‌త్రోలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు వంటి సీనియర్లూ భళా అనిపించారు. మహిళా సభ్యులు సైతం తామేమీ తీసిపోమంటూ బలంగా ఈటె విసిరారు. మంత్రి అనితకు స్పీకర్‌ అయ్యన్న మెళకువలు నేర్పారు. షాట్‌పుట్‌లోనూ మహిళా ఎమ్మెల్యేలు సత్తా చాటారు.

మ్యూజికల్‌ ఛైర్స్‌ పోటీల్లో మహిళలు కొచెంసేపు పరిగెత్తేందుకు పాట కనీసం రెండు నిమిషాలైనా ప్లేచేయాలంటూ స్పీకర్‌ ఛలోక్తులు విసిరారు. చివరకు గుమ్మిడి సంధ్యారాణి విన్నర్‌గా, పల్లె సింధూరరెడ్డి రన్నరప్‌గా నిలిచారు. బ్యాడ్మింటన్‌ 50 ఏళ్లదాటిన కేటగిరీలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పరిటాల సునీతపై గెలుపొందారు. మహిళల డబుల్స్‌లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ జోడి 21-16 తేడాతో బండారు శ్రావణి, పల్లె సింధూరరెడ్డి జోడిపై విజయం సాధించారు. పురుషుల కబడ్డీ ఫైనల్స్‌లో విజయకుమార్‌ జట్టుపై, మంత్రి సత్యకుమార్‌ టీం విజయం సాధించింది.

నాదెండ్ల మనోహర్‌ కీపింగ్‌ రాకింగ్: శ్రీరాంతాతయ్య ప్రత్యర్థుల్ని ఉడుంపట్టుపట్టారు. క్రికెట్ ఫైనల్స్ నువ్వా- నేనా అన్నట్లు సాగాయి. ఏడుగురు మంత్రులు క్రికెట్‌ ఆడారు. వాసంశెట్టి శుభాష్‌ అన్నివిభాగాల్లో అదరగొట్టగా సత్యకుమార్‌, కొల్లు రవీంద్ర బౌలింగ్‌లో ఆకట్టుకున్నారు. నాదెండ్ల మనోహర్‌ కీపింగ్‌ రాకింగ్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేల కామెంట్రీ నవ్వుల పువ్వులు పూయించింది.

క్రికెట్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నాదెండ్ల మనోహర్‌ జట్టు 12 ఓవర్లలో 108 పరుగులు సాధించింది. ఛేజింగ్‌లో అచ్చెన్న జట్టు గట్టిగా పోరాడినా నాదెండ్ల టీం కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో కట్టడి చేసింది. చివరకు అచ్చెన్న టీంపై మనోహర్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండో ఏడాదీ క్రికెట్‌ విజేతగానిలిచిన నాదెండ్లను టీం సభ్యులు భుజాలపైకి ఎత్తుకుని అభినందించగా అచ్చెన్న కూడా కంగ్రాట్స్ అంటూ క్రీడాస్ఫూర్తి చాటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు మీడియా సభ్యులతోనూ మంత్రుల ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. మ్యాచ్‌కు ముందు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత బ్యాటింగ్‌ చేసి ఉత్సాహపరిచారు.

రాజకీయాల్లోనే కాదు ఆటలలోనూ తగ్గేదేలే - క్రీడాపోటీల్లో సత్తాచాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

క్రీడాపోటీల్లో అదరగొట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు - ఫోటోలు చూశారా!