ETV Bharat / state

మేడారం జాతరకు వస్తాను - మంత్రులకు తెలిపిన కేసీఆర్‌

ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను కలిసిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ - మేడారం జాతరకు రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించిన సీతక్క, కొండా సురేఖ - వస్తానని చెప్పిన గులాబీ బాస్

Seethakka and Konda Surekha Invited KCR to Attend the Medaram Jathara
Seethakka and Konda Surekha Invited KCR to Attend the Medaram Jathara (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 6:41 PM IST

2 Min Read
Choose ETV Bharat

Seethakka and Konda Surekha Invited KCR to Attend the Medaram Jathara : ఈ నెలలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వ తరఫున మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఆహ్వానించారు. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మంత్రులను కేసీఆర్‌ ఆత్మీయంగా పలకరించారు. జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు కేసీఆర్​కు అందజేశారు. తమ ఇంటికి వచ్చిన మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. కేసీఆర్–శోభ దంపతులు పసుపు, కుంకుమ, వస్త్రాలు, తలంబ్రాలతో సంప్రదాయ రీతిలో మంత్రులను సత్కరించారు. వారు అందించిన తేనేటి విందును స్వీకరించిన మంత్రులు కొద్దిసేపు పరస్పర యోగక్షేమాలు తెలుసుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు.

జాతరకు వస్తానని చెప్పారు : కేసీఆర్​ను కలిసిన అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ఆదివాసి బిడ్డలుగా పుట్టిన సమ్మక్క–సారలమ్మలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా ఖ్యాతి పొందారని పేర్కొన్నారు. ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా భక్తుల కోరికలు తీర్చే తల్లుల జాతర మేడారమని చెప్పారు. ఈ మహాజాతరకు కేసీఆర్‌ను సతీసమేతంగా రావాలని ఆహ్వానించామని, తల్లుల బంగారం, పట్టు వస్త్రాలను కేసీఆర్ దంపతులకు బహుకరించి ఆహ్వానం పలికామని తెలిపారు. తమ ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించారని, జాతరకు వస్తానని ఆయన చెప్పినట్లు వెల్లడించారు. ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదని, రాష్ట్ర పండుగగా జాతరను ఎప్పటినుంచో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను కలిసిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ (ETV)

"మేడారం జాతరకు కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించాం. అన్ని పార్టీల లీడర్లకు స్వయంగా ఆహ్వానం అందజేశాను. మా ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించారు. మేడారం జాతరకు వస్తానని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ మాకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉంది." - సీతక్క, మంత్రి

రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం : కొండా సురేఖ మాట్లాడుతూ ఈ సారి మేడారం జాతరలో తాత్కాలిక ఏర్పాట్లకు తావు లేకుండా, శాశ్వత సౌకర్యాల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనతో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. వాటికి త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 800 ఏళ్లుగా గిరిజనులు సమ్మక్క–సారలమ్మలను కొలుస్తున్నారని, ప్రస్తుత ఏర్పాట్లపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌కు ఈ మహాజాతరకు రావాల్సిందిగా ఆహ్వానం అందజేశామని తెలిపారు.

1996లోనే ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తింపు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 1996లోనే ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే. అందుకే మేడారం రూపురేఖలను మార్చాలని నిర్ణయించి పునరుద్ధరణ పనులను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. జాతర జరిగే ప్రతిసారిలా కాకుండా తాత్కాలిక పనులకు స్వస్తి పలికి మరో వందేళ్లయినా చెక్కుచెదరకుండా ఉండేలా పనులు చేపట్టారు.

జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర : ప్రతి ఏడు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఎప్పటిలా కాకుండా ఈసారి కొత్తగా, మరింత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. దీనికి తెలంగాణతో పాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా.

ఇప్పటివరకు చూసిన మేడారం వేరు - ఇక నుంచి చూడబోయే జాతర వేరు