కల్తీ నెయ్యిపై సీఎం కీలక ప్రకటన - రేపు అసెంబ్లీలో 4 గంటలపాటు చర్చ
సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో కలిసిన మంత్రులు - అన్యమతస్థులకు డిక్లరేషన్ నిబంధన మరింత కఠినతరం చేయాలనే అంశంపై చర్చ - టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 3:22 PM IST
Ministers met CM Chandrababu in Assembly Chamber: అసెంబ్లీ బడ్జెట్ సమావైశాల్లో భాగంగా రేపు (మంగళవారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును మంత్రులు కలిశారు. అన్యమతస్థులకు డిక్లరేషన్ నిబంధన మరింత కఠినతరం చేయాలనే అంశంపై చర్చించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో మంగళవారం 4 గంటల పాటు చర్చ జరగనుంది. మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్ రద్దు చేసి ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు కల్తీ నెయ్యిపై చర్చించాలని నిర్ణయించారు.
నెయ్యి కల్తీపై కూటమి ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని నిర్ణయం తీసుకున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు సభకు రాలేదు. రేపు సభకు వచ్చిన తరువాత కల్తీ నెయ్యిపై పవన్ కల్యాణ్ కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకు కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు ఓ ప్రకటన చేయనున్నారు. టీటీడీ నిబంధనలు ప్రకారం అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
స్వర్ణ దేవాలయం తరహాలో: తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టాన్నీ తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమృతసర్లో స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంది. అటువంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంకు కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రేపు అసెంబ్లీలో పెడతాం: తిరుమల లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ రేపు అసెంబ్లీలో పెడతామని అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో మంత్రి నారా లోకేశ్ చెప్పారు. దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామని అన్నారు. అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టుపెట్టి పిలవరని ఎద్దేవాచేశారు. సభకు రావటం సభ్యులుగా వారి బాధ్యత అని గుర్తుచేశారు. దేవుడిని కూడా వైఎస్సార్సీపీ రోడ్డు మీదకు తీసుకురావవటం బాధాకరమైన విషయమని మండిపడ్డారు. దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయమని మంత్రి లోకేశ్ అన్నారు.
అదే తీరు: మరోవైపు శాసనమండలిలో వైఎస్సార్సీపీ తీరు మారలేద. హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై శాసన మండలిలో చర్చించాలని మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుసగా ఐదో రోజు ఆందోళనకు దిగారు. ఇవాళ సభలో చర్చించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుసగా ఐదోరోజు వాయిదా తీర్మానం ఇవ్వగా దాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. ప్లకార్డులు పట్టుకుని పోడియంను చుట్టు ముుట్టి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలను మండలి ఛైర్మన్ చేపట్టారు. వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన ఉద్దృతం చేయడం, సభలో గందరగోళం నెలకొనడంతో సభను కాసేపు వాయిదా వేశారు. వరుసగా ఐదు రోజుల పాటు సభా కార్యకలాపాలు నిలిచిపోవడం, సభలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న దృష్ట్యా సభా కార్యకలాపాల నిర్వహణ కోసం మండలి బీఎసీ సమావేశమైంది. ఛైర్మన్ కొయ్యె మోషను రాజు అధ్యక్షతన సమావేశంలో సభలో ప్రజా సమస్యలపై చర్చించే విషయమై కూటమి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చర్చించారు.
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి అవకాశం - అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు
రాజమహేంద్రవరంలో మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష - కఠిన చర్యలకు ఆదేశం

