రేవంత్ రెడ్డికి మహిళల అండ ఎప్పుడూ ఉంటుంది : సీఎంకు బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క - సీఎం రేవంత్‌రెడ్డికి బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ - తాను అందరికీ సోదరినేనని వ్యాఖ్య

Published : August 28, 2026 at 12:14 PM IST
|Updated : August 28, 2026 at 2:46 PM IST
Konda Surekha and Seethakka Tied Rakhi To CM Revanth : రక్షాబంధన్‌ను పురస్కరించుకొని మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. పరకాల వివాదం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన కొండా సురేఖ రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులకూ రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా 'సీఎం రేవంత్‌రెడ్డికి మూడోసారి రాఖీ కట్టా. సీఎం మనవడు, అల్లుడికి కూడా రాఖీ కట్టాను. పండుగ వాతావరణంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయను. నేను అందరికీ సోదరినే. సీఎం రేవంత్ రెడ్డికి మహిళల అండ ఎప్పుడూ ఉంటుంది. రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి ఇవ్వాలని, ఆడబిడ్డల ఆశీర్వాదాలు రేవంత్ రెడ్డికి ఎప్పుడూ ఉండాలని దేవుడిని కోరుకున్నా' అని తెలిపారు.
"రాఖీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డికి ఆడపడుచులందరి దీవెనలు ఉంటాయి. వారు సుపరిపాలన అందించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు వారికి శక్తియుక్తులు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ ఆశీస్సులు ఆడపడుచులందరిపై ఉండాలని కోరుతున్నా"- కొండా సురేఖ, మంత్రి
పరకాల వివాదం తర్వాత తొలిసారి : పరకాల వివాదం తర్వాత కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం ఇదే తొలిసారి. పీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీస్ ఇవ్వగా, కుమార్తె చేసిన ఆరోపణలకు తానెలా బాధ్యురాలిని అవుతానని సురేఖ సమాధానం ఇచ్చారు. క్రమశిక్షణా రాహిత్యంగా భావించి నోటీసులివ్వడంతోనే పరిమితం కాకుండా చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సీఎం నివాసానికి కొండా సురేఖ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు.
— Revanth Reddy (@revanth_anumula) August 28, 2026
ఈ రాఖీ పండుగ ప్రతీ ఆడబిడ్డకు ఆనందాలను పంచాలని ఆకాంక్షిస్తున్నాను.#RakshaBandhan #Rakhi #Telangana pic.twitter.com/vT6hFmHy75
మరోవైపు ప్రతి ఏడాది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టడం సంతోషంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులతో పాటు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, సభ్యులు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, బ్రహ్మకుమారీస్, కాంగ్రెస్ మహిళా నాయకులు, మలక్‌పేటలోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినిలు రాఖీ కట్టారు.

"రాష్ట్రంలో, దేశ విదేశాల్లో ఉన్న అక్కాచెల్లెళ్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. గత 12 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి ఏటా రాఖీ కడుతున్నాను. ఓ ఆదివాసి బిడ్డగా ఉన్న నన్ను మంత్రిగా ఈ స్థాయికి తీసుకురావడంలో ఆయన కృషి, మద్దతు ఎంతో ఉంది. ప్రతి సంవత్సరం మొదటగా ములుగు నియోజకవర్గంలో రాఖీ పౌర్ణమి జరుపుకొంటాం. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అక్కా అని అభిమానంతో వచ్చే ప్రతి ఒక్కరికి రాఖీ కడుతూ ఉంటాను. ప్రజా సేవకే ఈ జీవితం అంకితం చేస్తూ మరింత ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నా"- సీతక్క, మంత్రి
రాఖీ గిఫ్ట్స్ : కాస్త వెరైటీగా - జీవితాంతం తోడుగా ఉండేలా - మీ సోదరికి ఈ బహుమతులు ఇవ్వండి
రాఖీకి 5 వేల 'స్పెషల్' బస్సులు - ప్రయాణికులతో కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణాలు

