ETV Bharat / state

'క్షమాపణలు కోరి లెంప లేసుకుంటేనే వైఎస్సార్సీపీకి తిరుమల పేరెత్తే అర్హత' - అసెంబ్లీ లాబీలో మంత్రులు

మండలిలో క్షమాపణలు కోరి లెంప లేసుకుంటేనే వైసీపీకి తిరుమల పేరెత్తే అర్హత - వైఎస్సార్సీపీ సభ్యులు క్షమాపణ చెప్పాకే కల్తీ లడ్డూ వ్యవహారంపై మేము చర్చిస్తాం - అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రులు చిట్‌చాట్

Ministers Chit Chat With Media in Assembly Lobby
Ministers Chit Chat With Media in Assembly Lobby (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 19, 2026 at 3:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ministers Chit Chat With Media in Assembly Lobby : వైఎస్సార్సీపీ సభ్యులు క్షమాపణ చెప్పాకే కల్తీ లడ్డూ వ్యవహారంపై తాము చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శాసన మండలిలో క్షమాపణలు కోరి లెంప లేసుకుంటేనే వైఎస్సార్సీపీకి తిరుమల పేరెత్తే అర్హత ఉందని చెప్పారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ చిట్ చాట్ నిర్వహించారు. లడ్డూలో కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరూ ఒప్పుకున్నారని, వారిద్దరితో పాటు సిట్, వివిధ ల్యాబ్స్ కూడా కల్తీని ధృవీకరించాయని అచ్చెన్నాయుడు అన్నారు.

గత 3 రోజులుగా శాసన మండలిలో వైఎస్సార్సీసీపీ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. లడ్డూలో కల్తీ జరగలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీలు సభలో అనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు సభలో అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. మండలికి వైఎస్సార్సీపీ సభ్యులు తప్పుడు సమాచారం పంపారని దుయ్యబట్టారు. ఇందాపూర్ డెయిరీ నుంచి హెరిటేజ్ చీజ్ కొనుగోలు చేస్తే, దానికి తిరుమల లడ్డూకు సంబంధం ఏంటని? నిలదీశారు. చీజ్ ప్యాకెట్​కు నెయ్యి ప్యాకెట్​కు కూడా తేడా తెలియని స్థితిలో వైఎస్సార్సీపీ ఉందని ఎద్దేవా చేశారు. కల్తీ బురదలో కూరుకుపోయి ఎలా బయటకు రావాలో తెలియని దుస్థితిలో వైఎస్సార్సీపీ ఉందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

జగన్ మానస పుత్రిక అమూల్ : సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామి భక్తుడని అందరికీ తెలుసని, అలిపిరి ఘటనలో తన ప్రాణాలు నిలబెట్టింది వెంకటేశ్వర స్వామి అనే నమ్మకం చంద్రబాబుదని మంత్రి అనగాని సత్యప్రసాద్ గుర్తు చేశారు. అలాంటి వేంకటేశ్వర స్వామికి అపకీర్తి తెచ్చే పని ఎప్పుడూ చంద్రబాబు చేయరని స్పష్టం చేశారు. జగన్ మానస పుత్రిక అమూల్ కూడా ఇందాపూర్ నుంచి కొన్ని కొనుగోళ్లు చేసిందని వెల్లడించారు.

వైఎస్సార్సీపీనే ఓ కల్తీ పార్టీ : హెరిటేజ్​కు ఇందాపూర్ డైరెక్టర్లకు ఎక్కడైనా సంబంధం ఉందా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. అలాంటి ఆధారం ఒక్కటైనా వైఎస్సార్సీపీ చూపించగలదా అని సవాల్‌ విసిరారు. ఇందాపూర్ నుంచి హెరిటేజ్ చీజ్ కొనుగోలు చేసిందే కానీ హెరిటేజ్ ఏనాడూ ఇందాపూర్​కు ఏదీ పంపిణీ చేయలేదని స్పష్టం చేశారు. లడ్డూలో కల్తీ లేదంటున్న వైఎస్సార్సీపీనే ఓ కల్తీ పార్టీ అని మండిపడ్డారు.

హెరిటేజ్‌ సంస్థపై బురద చల్లుతున్నారు : వైఎస్సార్సీపీ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హెరిటేజ్‌ సంస్థపై బురద చల్లుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అసలు నెయ్యే లేకుండా లడ్డూ తయారు చేసి పాపం అంటగట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు హెరిటేజ్‌ సంస్థపై ఆరోపణలు చేస్తూ మరో మహాపాపం మూటగట్టుకున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో నెయ్యి కల్తీపై జగన్‌ను బొత్స సత్యనారాయణ ఏనాడైనా నిలదీశారా అని ప్రశ్నించారు. హెరిటేజ్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చర్చలో పాల్గొనకుండా మండలిలో రచ్చ : వైఎస్సార్సీపీ నేతలు బడ్జెట్ పై చర్చలో పాల్గొనకుండా మండలిలో రచ్చ చేస్తున్నారని ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రాజకీయం కోసమే వైఎస్సార్సీపీ పాకులాడుతోందని మండిపడ్డారు. రోడ్లపై కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే ప్రజలు హర్షిస్తారన్నారు. గత ప్రభుత్వ తప్పులను సరిచేస్తూ సుస్థిర పాలన కోసం కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు. రాయలసీమ ఉద్యాన హబ్​కు రూ.30 వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎందేనన్న మాధవీరెడ్డి, వ్యవసాయ అనుబంధ యూనిట్స్ ఎన్నో సీమకు వచ్చే అవకాశం ఉందన్నారు.

నెయ్యి కల్తీ నిజమే - కానీ నేరం నాది కాదు: వైవీ సుబ్బారెడ్డి

దద్దరిల్లిన శాసన మండలి - పోడియం చుట్టుముట్టి వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన