ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం : మంత్రి ఉత్తమ్
ఎస్‌ఎల్‌బీసీ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష - సొరంగం తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని వెల్లడి - ప్రాజెక్టు పూర్తిచేసి నల్గొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేస్తామని ప్రకటన

Published : January 11, 2026 at 8:01 PM IST
Minister Uttam Kumar Reddy Reviewed the Progress of the SLBC Works : ఎస్‌ఎల్‌బీసీ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, ఇంజనీర్లతో మంత్రి సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన పునఃప్రారంభ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సొరంగం తవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేసి నల్గొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేస్తాం : తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు జరపనున్నారని, మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలోమీటర్ల పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే పూర్తయినట్టు అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారు. భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా సపోర్ట్ సిస్టం కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి వివరించారు. సొరంగ మార్గం పనుల్లో క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందికి 25 % అదనపు జీతాలు ఉంటాయని అన్నారు. భారత రాష్ట్ర సమితి పది సంవత్సరాల పాలన వల్లే ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో ఆలస్యం జరిగిందని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ నిర్మాణ పనులపై ప్రతి సోమవారం సమీక్ష చేస్తామని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండను సస్యశ్యామలం చేయడమే కాకుండా, ఫ్లోరోసిస్‌ను శాశ్వతంగా లేకుండా చేస్తామని మంత్రి ప్రకటించారు.
"ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు. సొరంగం తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. భూగర్భ పరిస్థితుల అంచనాకు సపోర్ట్ సిస్టం ఏర్పాటు. సొరంగ మార్గం రెండువైపులా తవ్వకాలకు నిధులు మంజూరు. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గంగా ఎస్‌ఎల్‌బీసీకి గుర్తింపు. సొరంగ మార్గం పనుల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి 25 శాతం అదనపు జీతాలు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ నిర్మాణ పనులపై ప్రతి సోమవారం సమీక్ష. ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేసి నల్గొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేస్తాం."- ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి
మార్గం మళ్లించి SLBC తవ్వకాలు - జనవరి నుంచి 'అడ్వాన్స్‌డ్' విధానంలో పనులు
ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతాం : సీఎం రేవంత్ రెడ్డి

