కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగింది : మంత్రి ఉత్తమ్
పోలవరం-నల్లమలసాగర్ అంతర్రాష్ట్ర నిబంధనలకు వ్యతిరేకం - నల్లమలసాగర్‌ను వ్యతిరేకిస్తూ జీఆర్ఎంబీకి లేఖ రాశాం - సుప్రీంకోర్టు తదుపరి విచారణకు స్వయంగా హాజరవుతా : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Published : January 5, 2026 at 10:14 PM IST
Minister Uttam Kumar on Polavaram Nallamala Sagar : పోలవరం-నల్లమల సాగర్‌ను తాము అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నామని, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చూపిస్తున్న లేఖకు దీనికి సంబంధం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం-నల్లమల ఇంటర్‌స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకమని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(జీఆర్‌ఎంబీ)కు లేఖ రాసినట్టుగా వెల్లడించారు. తమ అభిప్రాయంతో జీఆర్‌ఎంబీ కూడా సమర్థించిందన్నారు. పోలవరం-నల్లమల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తోందని ఉత్తమ్ తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వికి సూచించామన్న ఆయన ఈ కేసును వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని చెప్పారు. అసెంబ్లీ విరామ సమయంలో ఉత్తమ్ మీడియాతో చిట్‌చాట్‌లో ఈ విషయాలు తెలిపారు.
అతి తెలివితో రాష్ట్రానికి భారీ నష్టం చేశారు : రిట్ పిటిషన్‌లో కాదు, సూట్ పిటిషన్‌లో రావాలని తమకు సుప్రీంకోర్టు సూచించిందన్నారు. వచ్చే విచారణకు తాను స్వయంగా హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని కోర్టును కోరుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందన్న ఆయన గతంలో ఆగి ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. అతి తెలివితో బీఆర్ఎస్ తెలంగాణకు భారీ నష్టం చేసిందని మండిపడ్డారు. పాలమూరు - రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరాన్ని మార్చి భారీ నష్టం తెచ్చారని బీఆర్ఎస్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం జరిగింది : మరోవైపు సభలో ఇవాళ జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. జీఎస్టీని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ స్లాబుల్లో చేసిన సవరణ వల్ల రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వే బిల్స్ అంశాలు కేంద్రం పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. వాటితో పాటు జీఎస్టీ అమలులో రాష్ట్రం పనితీరు మెరుగ్గా ఉందని వివరించారు. జీఎస్టీ స్లాబులను తగ్గించామని కేంద్రం, బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారని విమర్శించారు. జీఎస్టీ స్లాబుల తగ్గింపు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్నది ఎక్కువ మనకు రాష్ట్రం ఇస్తున్నది తక్కువ అని తెలిపారు. కర్ణాటక నుంచి కేంద్రానికి పన్నుల ఆదాయం రూ.9.82 లక్ష కోట్లు ఉండగా ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిదులు రూ.1.56 లక్షల కోట్లు మాత్రమేనన్నారు.
"జీఎస్టీని కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్నది . ఇటీవల జీఎస్టీ స్లాబుల్లో చేసిన సవరణ వల్ల రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం జరిగింది. జీఎస్టీ స్లాబులను తగ్గించామని కేంద్రం, బీజేపీ నేతలు పదేపదే చెప్తున్నారు. జీఎస్టీ స్లాబుల తగ్గింపు.. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉంది"- జూపల్లి కృష్ణారావు, మంత్రి
అయితే జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చ సమయంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ ఆరోపించింది. ప్లోర్ లీడర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ వెల్‌లోకి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫిర్యాదు : మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. నదీజలాలపై చర్చ సమయంలో సీఎం సభను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ సభాహక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశ మినిట్స్‌పై సీఎం తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేతపై తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందంపై తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. స్పీకర్ సూచన మేరకు శాసనసభ కార్యదర్శికి వారు నోటీసులను అందజేశారు.
బీఆర్ఎస్ సభ్యులపై చర్యలపై చర్యలు తీసుకోవాలి : అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ బీఆర్‌ఎస్ నేతలు బీరాలు పలికారని, అలాంటి వారు మాట్లాడకుండా సభనుంచే జారుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంటే వెళ్లిపోవటం సరికాదని శ్రీధర్‌బాబు అన్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే కృష్ణా జలాలపై ప్రజెంటేషన్ ఇచ్చామని వివరించారు. అభ్యంతరాలుంటే సభలోనే చెప్పాలి బయట చెప్పడం సమంజసమా? అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. స్పీకర్‌ను అగౌరవపరిచిన బీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, పాలమూరును నిర్లక్ష్యం చేశారు : మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం నిర్మాణంలో అన్ని వ్యక్తిగత నిర్ణయాలే - అప్పటి సీఎం జోక్యంతో తప్పుదోవ : మంత్రి ఉత్తమ్

