తిరుమలలో రూ. 25 కోట్ల వ్యయంతో ఫుడ్ ల్యాబ్ - త్వరలో ఫ్రాన్స్ నుంచి యంత్రాలు
తిరుమలలో సిద్ధమవుతున్న ఆహార ప్రయోగశాల - నెయ్యి నాణ్యత నిర్ధరించేందుకు ఈ-టంగ్, ఈ-నోస్ ఏర్పాటు, వెల్లడించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 10:12 AM IST
Minister Satyakumar on Food Lab in Tirumala: తిరుమలకు వేంకటేశ్వరస్వామికి సరఫరా అయ్యే నెయ్యిలో ఏ మాత్రం కూడా నాణ్యత తగ్గినా సరే వెంటనే పసిగట్టేందుకు గాను ఈ-టంగ్, ఈ-నోస్ యంత్రాలు సమకూరుస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందుకు రూ.3.5 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
రూ. 25 కోట్ల వ్యయంతో ఫుడ్ ల్యాబ్: నెయ్యి నాణ్యతలో చిన్నపాటి లోపమున్నా సరే ఇట్టే ఇవి గుర్తిస్తాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. దాదాపు రూ. 25 కోట్లతో తిరుమలలో ఏర్పాటు చేస్తున్న అత్యాధునికమైన ఆహార ప్రయోగశాలలో వీటిని నెలకొల్పుతున్నట్లు మంత్రి తెలిపారు. గత వైఎస్సార్సీపీ హయాంలో తిరుమలకు భారీ ఎత్తున కల్తీ నెయ్యి సరఫరా జరిగిన క్రమంలో అలాంటి వారికి ఏ విధమైన ఆస్కారం అనేదే లేకుండా ఉండేందుకు ఆధునిక యంత్రాలను ఇక్కడ ప్రవేశపెడుతున్నట్లు వివరించారు.
మంత్రి సత్యకుమార్ వెల్లడి: ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తయిన అత్యాధునికమైన ఆహార ప్రయోగశాలలో వచ్చేనెల నుంచి సేవలను అందుబాటులోనికి రానున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలియజేశారు. ఈ-టంగ్, ఈ-నోస్ యంత్రాలను ఈ ఏడాది మే నెల నాటికి వస్తాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను మంత్రి సత్యకుమార్ వివరించారు. వాటిలోని ప్రధానాంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రయోగశాలలో సమగ్రంగా పరీక్షలు: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల తయారీలో ఉపయోగించేటటువంటి నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదం, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు, కారం వంటి మొదలైనటువంటి దాదాపు 60 రకాల ముడి సరుకులు, ప్రసాదాల నాణ్యత ఈ ఆహార ప్రయోగశాలలో సమగ్రంగా పరీక్షలను నిర్వహిస్తారు. ఈ ల్యాబ్లో టీటీడీ జలప్రసాదాల నమూనాలను సైతం పరీక్షిస్తారు. వీటన్నింటి కోసం 50 రకాల పరికరాలు, దీనికి సంబంధించిన యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు.
త్వరలో పూర్తి కానున్న ఏర్పాట్లు: వైద్య ఆరోగ్య శాఖ, టీటీడీ లు సంయుక్తంగా 40 మంది ఉద్యోగులను అందుబాటులోనికి తీసుకొస్తారు. అంతేకాకుండా తిరుమలలోని పిండిమిల్లు ఆవరణలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న రెండు అంతస్తుల భవనాన్ని కూడా ప్రయోగశాల ఏర్పాటుకు కేటాయించారు. కిందటి ఏడాది జులైలో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. అతి త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయి.
మరిన్ని: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనలో రోజుకో కొత్త విషయంలో వెలుగులోకి వస్తోంది. సిట్ దర్యాప్తులో వెలుగుకి వస్తున్న విషయాలు తెలిసి భక్తులు ఆవేదన చెందుతున్నారు. భోలేబాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యిని మోనోగ్లిజరైడ్స్ అనే రసాయనాన్ని వినియోగించి తయారు చేసినట్లు సిట్ నిగ్గు తేల్చింది. దిల్లీలోని రఘుబీర్ శరణ్ ఓవర్‌సీస్ సంస్థ వీటిని కొరియా నుంచి దిగుమతి చేసుకోగా సుగంధ ఆయిల్ సంస్థ వాటిని భోలేబాబా డెయిరీకి సరఫరా చేసినట్లు తెలిసింది.
గత ఏడాది ఏప్రిల్ నెల 23న సిట్ అధికారులు సుగంధ ఆయిల్స్ సంస్థలో తనిఖీలు చేపట్టగా వీనస్ బ్రాండ్ లేబుల్ తే 200 కిలోల కెపాసిటీ ఉన్న డ్రమ్ముల్లో భారీగా మోనోగ్లిజరైడ్స్ కనిపించింది. ఆ డ్రమ్ములపై ముద్రించిన లేబుళ్లపై కొరియాకు చెందిన ఐఎల్ షిన్ వెల్స్ కో లిమిటెడ్ కంపెనీ తయారు చేసినట్లు ముద్రించి ఉంది. సిట్ అధికారులు ఉత్తరాఖండ్ భగవాన్‌పుర్‌లోని భోలేబాబా డెయిరీలో సోదాలు చేసినప్పుడు, అక్కడ కూడా మోనోగ్లిజరైడ్స్ లభించాయి. వాటితో తయారు చేసిన కల్తీ నెయ్యినే తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
కొరియా నుంచి మోనోగ్లిజరైడ్స్ - రసాయన మిశ్రమాలతో తయారుచేసిన కల్తీ నెయ్యే టీటీడీకి సరఫరా

