ETV Bharat / state

కేబినెట్​ మీటింగ్​లో​ మంత్రి రాంప్రసాద్​రెడ్డి కంటతడి - ఓదార్చిన సీఎం చంద్రబాబు

అన్నమయ్య జిల్లాను రద్దు - మదనపల్లె జిల్లా ఏర్పాటుకు చంద్రబాబు, నారా లోకేశ్‌ హామీ - ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు - మదనపల్లె జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజవర్గం

Minister Ramprasad Reddy was in tears
Minister Ramprasad Reddy was in tears (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 29, 2025 at 2:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

Annamayya Districts Divided to 3 Parts: అన్నమయ్య జిల్లాను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజవర్గాలతో కొత్తగా ఏర్పాటు మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయనున్నారు. అన్నమయ్య జిల్లాలో మిగిలిన రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాలను మూడు జిల్లాల్లో కలపాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టత ఇచ్చింది. వైఎస్‌ఆర్‌ కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు చెరుకూరి శ్రీధర్, నిశాంత్‌ కుమార్‌లను అమరావతికి ఆదివారం పిలిపించారు. తుది ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు ఇద్దరు కలెక్టర్లు అమరావతిలోనే మకాం వేశారు.

తానంతా చూసుకుంటానన్న సీఎం: ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన అంశంపై చర్చ జరిగింది. అన్నమయ్య జిల్లాను విభజించి మిగతా జిల్లాలలో కలపడంపై మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి మండిపల్లి రాంప్రసాద్​ రెడ్డి మనస్థాపం చెందారు. సమావేశంలోనే కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు మంత్రిని ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చకుంటే తలెత్తే సాంకేతిక ఇబ్బందులు వివరించారు. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని రాంప్రసాద్​ రెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కంటతడితోనే బయటకు వచ్చారు. రాంప్రసాద్​ రెడ్డిని మరో మంత్రి బీసీ జనార్ధన్​ రెడ్డి ఓదార్చి తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు.

త్వరలో అధికారిక ఉత్తర్వులు: మదనపల్లె జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ ఇచ్చిన హామీ అమలు దిశగా ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ముందుగా నిర్ణయించిన మేరకు మదనపల్లె జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజవర్గం చేర్చాలని నిర్ణయించింది. అన్నమయ్య జిల్లాలో మూడు నియోజకవర్గాలు మాత్రమే మిగిలిపోయాయి. మూడు నియోజకవర్గాలతో జిల్లా నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. నిర్వహణ భారం, రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలు, మరో వైపు రాయచోటిలోనే కొనసాగించాలనే డిమాండ్ల నేపథ్యంలో మధ్యమార్గంగా కీలక నిర్ణయం తీసుకుంది.

వారికి సంతోషం-వీరికి అసంతృప్తి: ఈ మేరకు తిరుపతి జిల్లా నుంచి గూడూరును నెల్లూరులో కలుపుతున్న నేపథ్యంలో రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, ప్రతిపాదిత మదనపల్లె జిల్లాలోకి రాయచోటి, కడపలోకి రాజంపేట నియోజకవర్గాన్ని కలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల విలీనాన్ని ఆయా నియోజకవర్గాల ప్రజల్లో సంతోష వాతావరణం కనిపిస్తోంది. పెనగలూరు, చిట్వేలి మండలాలకు తిరుపతి కాస్త దూరంగా ఉండనుంది. రాయచోటి నియోజకవర్గ ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది.

అదే పేరు కొనసాగింపు?: జిల్లా కేంద్రం మదనపల్లె అయినప్పటికీ అన్నమయ్య పేరుతోనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అన్నమయ్య పేరును రద్దు చేశారనే అపఖ్యాతి లేకుండా ఆ పేరునే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికార యంత్రాంగానికి సంకేతాలిచ్చారు.

యధావిధిగా ఆందోళనలు: అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలని కోరుతూ సోమవారం రాయచోటిలో ఆందోళనలు యధావిధిగా కొనసాగాయి. పట్టణంలోని ప్రజా సంఘాలు విద్యార్థులు యువజన కార్మిక ఉద్యోగ సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తొలుత పట్టణంలోని శివాలయం కూడలిలో నిరసన తెలియజేశారు. అక్కడ నుంచి కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై భారీ నిరసన ర్యాలీని కొనసాగించారు. నేతాజీ కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఠాణా కూడలి, దిగువ పెట్రోల్ బంక్, గాంధీ బజార్, కంసల్ వీధి, గాలివీడు రోడ్డు, బస్టాండ్ రోడ్డు మీదుగా వేలాదిమంది విద్యార్థులు జేఏసీ నాయకులు వైఎస్సార్సీపీ, తెదేపా ఇతర పార్టీల నాయకులు, కార్మికులు, ఉద్యోగ సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేశారు.

అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల మార్పు - జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

రాజంపేట జిల్లా కేంద్రం కోసం కొనసాగుతున్న నిరసనలు