ETV Bharat / state

పర్యావరణహితంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకుందాం - ఉత్సవ కమిటీకి పొన్నం విజ్ఞప్తి

గణేశ్​ ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష - మట్టి వినాయక విగ్రహాలే వాడి పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి - హాజరైన డీజీపీ సీవీ ఆనంద్, జీహెచ్​ఎంసీ కమిషనర్ కర్ణన్​

GANESH FESTIVAL 2026
ప్రతీకాత్మక చిత్రం (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 1, 2026 at 7:18 PM IST

3 Min Read
Choose ETV Bharat

Minister Ponnam Review on Ganesh Festival Arrnagements : హైదరాబాద్​ నగరంలో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నగరంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. భక్తులంతా మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు. భాగ్యనగరంలో సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు జరగనున్న గణేశ్ ఉత్సవాలపై జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్​ఆర్డీలో హైదరాబాద్ ఇన్​ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ మండపాల వద్ద శానిటేషన్, భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

పర్యావరణహితంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకుందాం - ఉత్సవ కమిటీకి పొన్నం విజ్ఞప్తి (ETV Bharat)

ఎల్​నినో పరిస్థితులు తొలగి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వినాయక మండపాల్లో పూజలు నిర్వహించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి ప్రభుత్వం తరఫున సూచించినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. న్యాయస్థానాల తీర్పులకు గౌరవిస్తూనే వినాయక ఉత్సవాలు నిర్వహిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియంత్రణ లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తులకు మొక్కలు పంపిణీ చేయాలని, చేనేత కండువాలు వాడాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితిని కోరినట్లు చెప్పారు.

"సెప్టెంబర్ 14 నుంచి జరిగే గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఇన్​ఛార్జి మంత్రిగా సన్నాహక కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని శాఖల అధికారులు, మూడు మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్​లు, పోలీస్ అధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితితో సమావేశం జరిగింది. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం. సామూహిక ఉత్సవాలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గణేశ్ మండపాల నిర్వహణ, శానిటేషన్, భద్రత ,సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుపై చర్చించాం. "- పొన్నం ప్రభాకర్, మంత్రి

ఆరు దశల్లో బందోబస్తు : గణేశ్ ఉత్సవాలకు సంబంధించి ఆరు విడతలుగా బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సి ఉందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వినాయక ఆగమన్ నుంచి నిమజ్జనం వరకు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ కమిషనర్​పై అధిక భారం పడే అవకాశం ఉండటంతో బందోబస్తుకు సంబంధించి రీడిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీజేలు పెట్టకూడదని గతేడాది నుంచి చెబుతున్నామని, దీనికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. నగరంలో గతేడాది నిమజ్జనాల రోజు 30 శాతం రద్దీ పెరిగిందన్నారు. ఖైరతాబాద్ గణేశ్​కు సంబంధించి కూడా సమన్వయం చాలా అవసరమన్నారు. నిమజ్జనాలు అయ్యాక శాంతి భద్రతలు, క్లీనింగ్, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి సహకరించాలని డీజీపీ సీవీ ఆనంద్ కోరారు.

"గణేశ్ ఉత్సవాలకు ఆరు విడతలుగా బందోబస్తు టీంను ఏర్పాటు చేస్తాం. నిమజ్జన కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. గతేడాది నిమజ్జనాల సమయంలో 30 శాతం రద్దీ పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేశ్ కమిటీలను సహకరించాలని కోరుతున్నాను. పోలీస్​శాఖ పరంగా పూర్తి స్థాయిలో సహకరిస్తాం. హైదరాబాద్​ గణేశ్ కమిటీ సమన్వయం చాలా అవసరం. సరైన సమయానికి బయలుదేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం"- సీవీ ఆనంద్, డీజీపీ

మండపాల వద్ద తులసీ మొక్కల పంపిణీ : బాలాపూర్ నుంచి ఖైరతాబాద్​ వరకు జీహెచ్​ఎంసీ పరిధిలోకి వస్తుందని కమిషనర్ కర్ణన్​ తెలిపారు. పోలీసు, ట్రాఫిక్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నామని చెప్పారు. 50 శాతం బడ్జెట్​ను క్రేన్స్​లపై వెచ్చిస్తామన్నారు. షిఫ్టుల వారీగా శానిటేషన్ వర్కర్స్ ఉంటారని వెల్లడించారు. మొబైల్ టాయిలెట్స్, ప్రొసీషన్స్ రూట్స్​లో రహదారుల మరమ్మతులు, ట్రీ కట్టింగ్స్, క్రేన్స్, శానిటేషన్, క్లీనింగ్, నిమజ్జనం పాండ్స్, అన్ని చూసుకుంటున్నామన్నారు. మండపాల వద్ద ప్రసాదం రూపంలో తులసి వంటి మొక్కలు ఇచ్చేందుకు చూస్తున్నామని తెలిపారు.

ఈసారి ఖైరతాబాద్​ కాదు నాగోల్​లోనే బడా 'గణేశ్'​ - అదీ మట్టితో తయారీ - ఎన్ని అడుగులో తెలుసా?

గణేశ్​ విగ్రహాల తయారీకి కేరాఫ్​గా దూల్​పేట - ప్రీ బుకింగ్‌ కోసం బారులు తీస్తున్న భక్తులు