ETV Bharat / state

ఈ ఏడాదే కొత్త భూభారతి పోర్టల్​ - ఇంతకీ ఏ నెలలోనో తెలుసా?

కొత్త భూభారతి పోర్టల్​ను తీసుకువస్తామన్న మంత్రి పొంగులేటి - వారంలో 3వేల లైసెన్స్​డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని వెల్లడి - ట్రెసా ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు త్వరలోనే కల్పిస్తామని వెల్లడి

MINISTER PONGULETI ON BHUBHARATI
MINISTER PONGULETI ON BHUBHARATI (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 7, 2026 at 8:45 AM IST

3 Min Read
Choose ETV Bharat

New Bhu Bharati Portal Launched by March : సర్వే, స్టాంపులు, రెవెన్యూ శాఖలకు సంబంధించి భూముల సమాచారమంతా ఒకేచోట తెలుసుకునే విధంగా మార్చి నాటికి నూతన భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ, వ్యవసాయేతర, దేవాదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర భూముల వివరాలన్నీ ఈ పోర్టల్‌లో పరిశీలించవచ్చన్నారు.

3వేల మంది లైసెన్స్​డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నాం : వారంలో 3 వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను తీసుకోబోతున్నామని పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. త్వరలో వారికి అందాల్సిన అన్ని ప్రయోజనాలను కల్పిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్( ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి మంత్రి పొంగులేటికి విజ్ఞప్తి చేశారు.

ట్రెసా ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్‌ మాట్లాడుతూ 12 ఏళ్లుగా తహసీల్దార్లకు పదోన్నతులు లేవని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల ఐకాస(జేఏసీ) ఛైర్మన్‌ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రకళ, ప్రతినిధి ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇక అన్ని భూ సేవలు ఒకేచోట : రెవెన్యూ శాఖ అందుబాటులోకి తీసుకురానున్న పూర్తిస్థాయి భూ భారతి పోర్టల్​ తెలంగాణ ప్రజలకు ఇక బహుళ ప్రయోజనకారిగా మారబోతుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే దాదాపు కొలిక్కి రాగా, కొన్నిరోజులు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఉన్న భూ భారతి పోర్టల్​లో కేవలం సాగుభూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకు మాత్రమే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం బహుళ ప్రయోజనాలు చేకూరనున్నట్లుగా తెలుస్తోంది.

భూ భారతి పోర్టల్​ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే :

  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ (కార్డ్​) ద్వారా అందించే సేవలన్నీ కొత్త భూభారతి పోర్టల్​​ నుంచే పొందవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన స్లాట్​ నమోదు చేసుకోవడం, ఈసీలు(ఎన్​కంబ్​రెన్స్ సర్టిఫికెట్) పొందడం, సర్టిఫైడ్​ డాక్యుమెంట్లు పొందడం తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి.
  • ఏదైనా సర్వే మ్యాప్ కావాలంటే భూమి కొలతలు, భూ దస్త్రాల నిర్వహణ శాఖకు దరఖాస్తు చేసుకునే పని తప్పుతుంది. ఇకపై నేరుగా భూ భారతి పోర్టల్​ను ఆశ్రయించవచ్చు.
  • ప్రభుత్వ భూములకు (నిషేధిత జాబితాలోని 22ఏ) రిజిస్ట్రేషన్లు కాకుండా అరికట్టేందుకు వీలు కలుగుతుంది.
  • భూముల సర్వే, సరిహద్దు వివాదాలపై స్పష్టత కోరవచ్చు. అటవీ, రెవెన్యూ, వక్ఫ్​ , దేవాదాయ తదితర ప్రభుత్వ భూములతో సరిహద్దు సమస్యల వివరాలనూ ఈ పోర్టల్​లో పొందవచ్చు.
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలతో పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా ఇది ఉపయోగపడనుంది.
  • జనవరిలో భూ యజమానులకు జారీ చేయనున్న తాత్కాలిక భూధార్​తో భూ సంబంధిత సమగ్ర సేవలు ఈ పోర్టల్​ ద్వారా అందుబాటులోకి రానుంది.
  • బ్యాంకు లోన్​లు, తాకట్టు, వ్యవసాయ సంబంధిత అవసరాలకు యాజమాన్య హక్కుల పరిశీలన ఈ పోర్టల్​ ద్వారా జరగనుంది.
  • నేషనల్​ ఇన్ఫర్మేటిక్స్​ సెంటర్​ రూపొందిస్తున్న భూభారతి పోర్టల్​ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే వినియోగంలోకి రానుంది.
  • పూర్తిస్థాయి పోర్టల్​తో ఇంతవరకు వేర్వేరుగా అమలు అవుతున్న భూములకు సంబంధించిన అన్ని సేవలు ఒకే పోర్టల్​లో లభ్యం కానున్నాయి.
  • సాగుభూమి సమాచారం, వ్యవసాయేతర భూమికి చెందిన సమాచారం, భూ సర్వే, మీ భూమి ఎవరి పేరు మీద ఉంది తదితర విషయాలు తెలియాలంటే ఇకపై రిజిస్ట్రేషన్​ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

'భూ భారతి' అప్​గ్రేడ్​ వెర్షన్​ - ఇక అన్ని భూ సేవలు ఒకేచోట

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూధార్‌ కార్డులు పంపిణీ చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి