ETV Bharat / state

"నో వెహికల్​ డే" - మంత్రి నిమ్మల 18 కిలోమీటర్లు సైకిల్ డబుల్​ రైడ్​

ఎండను లెక్కచేయకుండా 18 కిలోమీటర్లు సైకిల్​ తొక్కిన నిమ్మల - రామవరప్పాడు నుంచి మంగళగిరి వరకు పయనం - ఒకే సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి చేరుకున్న మంత్రి నిమ్మల, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

Minister Nimmala Rode A Bicycle Along With Palla Srinivasa Rao
Minister Nimmala Rode A Bicycle Along With Palla Srinivasa Rao (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2026 at 3:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

Minister Nimmala Rode A Bicycle Along With Palla Srinivasa Rao: చిన్నప్పుడు డబుల్స్ తొక్కగలవా అంటూ స్నేహితుడితో సైకిల్ పంచుకున్న సందర్భం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అలాంటి చిన్నప్పటి సైకిల్ డబుల్స్ జ్ఞాపకాలను స్మరించుకుంటూ, సీనియర్ మంత్రి నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులు మరోసారి బాల్యానుభూతిని ఆస్వాదించారు.

సాధారణ వ్యక్తిలా రైలులో ప్రయాణం: ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ‘నో వెహికల్ డే’ సందేశాన్ని చాటుతూ వీరి ప్రయాణం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకూ సాగింది. ముందుగా పాలకొల్లు నుంచి రైలులో ప్రయాణికులతో కలిసి సాధారణ వ్యక్తిలా మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ వరకు ప్రయాణించారు. ఆపై రామవరప్పాడు నుంచి మంగళగిరి వరకు సైకిల్ తొక్కారు. తాడేపల్లి వద్ద తోడుగా చేరిన పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఒకే సైకిల్‌పై డబుల్ రైడ్ చేస్తూ మంత్రి నిమ్మల ముందుకు కదిలారు. మధ్యలో కాసేపు ఆగి నిమ్మ సోడా తాగుతూ ఇద్దరు నేతలూ ప్రయాణానికి తేలికపాటి విరామం ఇచ్చారు. పొదుపు, పర్యావరణ పరిరక్షణ అనే సందేశాలను సహజంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ ప్రయాణం నిలిచింది.

"నో వెహికల్​ డే" - మంత్రి నిమ్మల 18 కిలోమీటర్లు సైకిల్ డబుల్​ రైడ్​ (ETV Bharat)

18 కిలోమీటర్లు మేర సైకిల్ ప్రయాణం: రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకు దాదాపు 18 కిలోమీటర్లు మేర సైకిల్ తొక్కారు. తాడేపల్లి వద్ద మంత్రి నిమ్మలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. ఇద్దరం కలిసి వెళ్దామా అంటూ ఒకే సైకిల్​ పై పార్టీ కార్యాలయానికి మంత్రి నిమ్మల, పల్లా శ్రీనివాసరావులు డబుల్ రైడ్ చేశారు. దాంతో మండుటెండను సైతం వీరి ప్రయాణం ముందు చిన్నబోయినట్లైంది. వరుసగా రెండో వారం నో వెహికిల్ డే సందర్భంగా నిమ్మల మళ్లీ సైకిల్ తొక్కడం గమనార్హం. ఈ సందర్బంగా టీడీపీ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ మంత్రి నిమ్మల సైకిల్ ప్రయాణం మాలో ఎంతో స్ఫూర్తి నింపిందని కొనియాడారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సైకిల్ తొక్కినట్లు ఇరువురు నేతలు ఈ సందర్భంగా వివరించారు.

"ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు పశ్చిమాసియా యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. విద్యుత్ వాడకంలో పొదుపును అలవరుచుకోవాలి. ఖర్చుల దుబారాను తగ్గించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపునకు స్పందనగా ఈరోజు నేను, మా సోదరులు పల్లా సైకిల్​పై ప్రయాణించాం. ప్రజలంతా పొదుపు మంత్రాన్ని పాటించాల్సిందిగా ఈ సందర్భంగా మేమంతా సూచిస్తున్నాం". -నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ మంత్రి

"ఇంధన వనరులను ఆదా చేయాలని, మా ద్వారా ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకున్నాం. ఇందులో భాగంగానే సోదరులు మంత్రి నిమ్మల సైకిల్​పై 18 కిలోమీటర్ల మేర నాతో పాటు కలిసి డబుల్ రైడ్ చేసుకుని పార్టీ కార్యాలయానికి చేరుకోవడం ఎంతో అభినందనీయం. ప్రభుత్వం కల్పించిన వాహనాలను వదిలి సైకిల్​పై ప్రయాణించి ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలనుకునే నిమ్మల ఆలోచన ఎంతో గొప్పది. నిమ్మలను మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలి". -పల్లా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు

"నో వెహికల్​ డే" - మండుటెండలో 10 కి.మీ సైకిల్ తొక్కిన మంత్రి నిమ్మల

రూ.35 వేల విలువైన ఈ-సైకిల్​పై రూ.11 వేలు రాయితీ - సంతోషంలో లబ్ధిదారులు